బీసీ భజన చేస్తున్నా, కవితకు బీసీ సంఘాల మద్దతు కరువు

బీసీలకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న బీసీ భజనకు ఆ వర్గం నేతల మద్దతే కరువైంది. మరి బీసీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి కవిత ప్రయత్నాలు ఫలిస్తాయా..

Update: 2024-03-13 05:05 GMT
Source: Twitter


(ఫెడరల్ ప్రత్యేక ప్రతినిధి)

హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా బీసీ...బీసీ అంటూ భజన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆ బీసీల మద్దతే కరువైంది. కనీసం లేవనెత్తుతున్న ఆశయాలకు, డిమాండ్స్‌ను బీసీ సంఘాలు కనీసం పట్టుంచుకోవటం లేదు. బీసీల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలే దీనికి కారణంగా చెప్పొచ్చు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 47 శాతం రిజర్వేషన్, రాష్ట్ర శాసనసభ ఆవరణలో బీసీల ఆరాధ్య దైవం జ్యోతి రావు పూలే విగ్రహం పెట్టాలన్న ఆమె డిమాండ్స్‌కు బీసీ సంఘాల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు.
ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలయింది. దళిత బంధు లాగా బీసీ బంధు పెట్టాలనే బీసీల డిమాండ్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. బీసీల కోసం పెట్టిన పథకాల అమలులో సైతం అవకతవకలు జరగటంతో అవికూడా శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓట్లు రాల్చలేదు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవడానికే బీఆర్ఎస్ నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ బాధ్యతను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భుజాలమీద వేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం ఓట్లలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల వ్యతిరేకతను చూరగొన్న ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించలేదు అన్నది స్పష్టం.
బీసీలకు న్యాయం కోసం అనే అంశంపై ఇటీవల జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొని "బీసీ గళం"ను వినిపించారు. కాంగ్రెస్‌ను బీసీ వ్యతిరేకిగా అభివర్ణించారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఉద్యోగుల నియామకాల్లో బీసీలకు 47 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఉత్తర్వులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థలో బీసీలకు 47 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధనకు బీసీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ కు ప్రతినిధి అయినట్లు ఆమె తెలంగాణ బిసిలకు ప్రతినిధి కావాలని కలకంటున్నారు. అయితే, ఎవరూ పట్టించుకున్నట్లు లేరు. ఇంతవరకు ఆమెకు మద్ధతు చెబుతూ బిసి మేధావులు గాని, బిసి సంఘాలు ప్రకటనలుచేయలేదు.
తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో బీసీల ఆరాధ్య దైవం జ్యోతి రావు పూలే విగ్రహం పెట్టాలనే డిమాండ్‌ను సైతం ఎత్తుకున్నారు. కానీ బీసీ నాయకుల నుంచి తనకు సరైన మద్దతు లభించక పోవటంతో నిరాశ చెందారు. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో జ్యోతి రావు పూలే విగ్రహాన్ని నెలకొల్పాలనే తన డిమాండ్‌కు మద్దతు తెలపాలని కవిత తనకు ఫోన్ చేశారని, మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయలేదు అని దళిత మేధావి, రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య విమర్శించారు.
కవిత ప్రోద్బలంతో నడుస్తున్న ఒక బీసీ సంస్థ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రౌండ్ టేబుల్ మీటింగ్స్ నిర్వహిస్తూ, ఆమెను దానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు బీసీ నాయకులు చెవులు కొరక్కుంటున్నారు. బీసీ సంఘాల ఉద్యమాలకు ఏనాడూ మద్దతు ప్రకటించని ఆమె బీసీ గళం ఎత్తుకోవటం వెనుక పెద్ద మతలబు ఉందని ఆ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. మరి కవిత.. బీసీ నాయకులను ప్రసన్నం చెసుకోగలరా అనే విషయం సమయమే తేలుస్తుంది.
 బిసిలు ఎందుకు దూరంగా ఉన్నారు?

బిసిలకు సరైన ప్రాతినిధ్యమీయని బిఆర్ ఎస్ నుంచి వచ్చిన ఈ కవిత ఈరోజు బిసిలకు న్యాయం అంటేఎలా విశ్వసిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు దుడుకు లక్ష్మీనారాయణ వాఖ్యానించారు. 

"రాజకీయ పార్టీలు బీసీలను వోట్ బ్యాంకుగానే పరిగణిస్తున్నాయి. ఏ  పార్టీ బీసీ నేతలకు సైతం ఎన్నికల్లో అవకాశం కల్పించటం లేదు.  దీనికి కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న బిఆర్ఎస్ కూడా మినహాయింపు కాదు,"  అని లక్ష్మీనారాయణ అన్నారు.

ఎన్నికలలో ప్రయోజనం కోసం రాజకీయ పార్టీలు బిసి గళం వినిపించటం ఓట్ల కోసమే అనటంలో సందేహం లేదని చెబుతూ   ఉన్నట్లుండి  బీసీ సమస్యను ఎత్తుకున్న కవిత ను ఇదే కోవలో బిసిలు చూస్తున్నారని ఆయన అన్నారు.

Tags:    

Similar News