బాబు చేతిలో రేవంత్ జుట్టు.. ప్రభుత్వంపై కవిత విమర్శలు

చంద్రబాబు ,రేవంత్ రెడ్డి ప్రజా భవన్‌లో సమావేశం తర్వాతే ఆంధ్రకు నీటి తరలింపు జరుగుతుందని ఆరోపించారు కవిత.;

Update: 2025-02-22 06:37 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి లాంటి సీఎం ఉండటం తెలంగాణ ప్రజలు దురదృష్టమని అన్నారు. ఎక్కటంటే ఒక్కటి కూడా ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, ప్రజల బాగోగులను గాలికి వదిలేశారంటూ రేవంత్‌పై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలో ఉందని, బాబు జుట్టు ప్రధాని మోదీ చేతిలో ఉందని ఆరోపించారు. అందుకే తెలంగాణకు, రాష్ట్ర ప్రజలకు కృష్ణా జలాలు సహా పలు ఇతర అంశాల్లో కూడా ఎంత అన్యాయం జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి నోరుమెదపడం లేదన్నారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కవిత విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు జరిగిన మేలంటూ ఏమీ లేదని అన్నారు. పసుపు బోర్డును కూడా ఏదో నామమాత్రంగానే ఏర్పాటు చేశారే తప్ప పసుపు రైతులకు న్యాయం చేయడానికి కాదని అన్నారు.

‘‘పసుపు రైతుల పరిస్థితి చూస్తే గుండెలు అవిసి పోతున్నాయి. పసుపు ధర రోజు రోజు కూ పతనం అవుతున్నది. రూ.15 వేల మద్దతు ధర ఇస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి. పసుపు బోర్డు నామ మాత్రంగా ఏర్పాటు చేశారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టీ పాస్ చేయిస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. పసుపుకు12 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది..హామీని నిలబెట్టు కోవాలి. రూ.12 వేల కంటే ధర తక్కువగా వస్తే బోనస్ రూపంలో రైతులకు చెల్లించాలి. వ్యాపారులు సిండికేట్ అయి రైతులను దగా చేస్తున్నారు. మార్చి 1వ తేదీ వరకు డెడ్లైన్ విధిస్తున్నాం. పసుపుకు క్వింటాలకు రూ.15 వేల ధర ఇవ్వకుంటే రైతులతో కలిసి కలెక్టరేటును ముట్టడిస్తాం’’ అని హెచ్చరించారు.

‘‘కవిత విషయంలో మాట్లాడవద్దని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా రేవంత్ తీరులో మార్పు రాలేదు. బహుశా కోర్టు మరోసారి చివాట్లు పెట్టాలేమో. అప్పుడుగానీ మారరేమో ఈ ముఖ్యమంత్రి. కాగా చంద్రబాబు ,రేవంత్ రెడ్డి ప్రజా భవన్‌లో సమావేశం తర్వాతే ఆంధ్రకు నీటి తరలింపు జరుగుతుంది. తెలంగాణ ప్రజలు, రైతులు తాగు, సాగు నీరు లేక తల్లడిల్లుతున్నా రేవంత్ మాత్రం.. ఆంధ్ర అక్రమ నీటి తరలింపుపై నోరుమెదపడం లేదు. రేవంత్ రెడ్డి జుట్టు చంద్ర బాబు చేతిలో ఉంది..చంద్ర బాబు జుట్టు మోది చేతిలో ఉంది. చంద్రబాబు ప్రతి పాదన పై సిఎం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని చురకలంటించారు.

Tags:    

Similar News