కేసీఆర్ ఫోన్ చేయడంపై ఈటల క్లారిటీ..
బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు తమ మాజీ బాస్ కేసీఆర్ ఫోన్ చేశారన్న ప్రచారం తెలంగాణలో తెగ వినిపిస్తోంది.;
బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు తమ మాజీ బాస్ కేసీఆర్ ఫోన్ చేశారన్న ప్రచారం తెలంగాణలో తెగ వినిపిస్తోంది. ఈటల ఫోన్ చేసిన కేసీఆర్.. మళ్ళీ కలిసి పనిచేయాలని కోరారని, ఈటలను తిరిగి బీఆర్ఎస్లో చేరాలని కోరారని సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంటుంది. ఈ క్రమంలో ఈ అంశంపై ఈటల క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, కొందరు కావాలనే ఈ ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేనంటే గిట్టని వారు, సోషల్ మీడియాలో ఉండే సైకోలు, శాడిస్టులు మాత్రమే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. చాలా కాలంగా కేసీఆర్ విషయంలో నేను స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేస్తూనే ఉన్నాను. అయినప్పటికీ కొందరు కావాలనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. ఇది పూర్తిగా బాధ్యతలేని వ్యక్తుల శాడిజం, నాపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటా’’ అని హెచ్చరించారు.
ఒకవేళ కేసీఆర్ నిజంగానే ఫోన్ చేసి పిలిస్తే ఈటల మళ్ళీ బీఆర్ఎస్లో చేరతారా? అన్న విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇదేమైనా పిల్లల ఆటనా? మేమంతా బాధ్యత ఉన్న రాజకీయ నాయకులం. వాళ్ల పార్టీ వాళ్ళది, మా పార్టీ మాది. రేపు బీఆర్ఎస్ను ఓడించి తెలంగాణలో బీజేపీని గెలిపించడమే నా లక్ష్యం’’ అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈటలకు కేసీఆర్ ఫోన్ చేశారని, తిరిగి బీఆర్ఎస్కు రావాలని కోరారన్న వార్తలు ఊపందుకున్నాయి. కానీ వాటిలో వాస్తవం లేదని ఈటల స్పష్టం చేయడంతో వీటికి ఫుల్ స్టాప్ పడినట్లే భావించొచ్చు.