టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో కీలక పరిణామం
ట్యాపింగ్ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) విచారణకు శ్రవణ్ రావు హాజరయ్యారు.;
టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో శనివారం కీలకమైన పరిణామం జరిగింది. అదేమిటంటే ట్యాపింగ్ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) విచారణకు శ్రవణ్ రావు హాజరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై విచారణకోసం రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం సిట్ ను ఏర్పాటుచేసింది. విచారణలో భాగంగా 2024, మార్చి 11వ తేదీన సిట్ అధికారులు డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్టుచేశారు. ఎప్పుడైతే ప్రణీత్ అరెస్టయ్యాడో మరుసటి రోజే శ్రవణ్ రావు, టీ ప్రభాకరరావు విదేశాలకు పారిపోయారు. శ్రవణ్ రావు ఎవరంటే కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకడు, మీడియా అధిపతి కూడా. ఇక టీ ప్రభాకరరావు ఎవరంటే కేసీఆర్(KCR) హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఐపీఎస్ అధికారి. టెలిఫోన్ ట్యాపింగ్ లో వీళ్ళిద్దరి పాత్ర చాలా కీలకం.
ప్రణీత్ రావు అరెస్టవ్వగానే వీళ్ళు విదేశాలకు ఎందుకు పారిపోయారంటే అరెస్టయిన అధికారి తమ పేరును చెబితే పోలీసులు తమను కూడా అరెస్టుచేస్తారన్న భయంతోనే వీళ్ళిద్దరు పారిపోయారు. ప్రభాకరరావు నేరుగా అమెరికా(America)కు పారిపోతే శ్రవణ్ ముందు లండన్ వెళ్ళి అక్కడినుండి అమెరికాకు చేరుకున్నాడు. వీళ్ళిద్దరిని విచారించేందుకు సిట్ అధికారులు ఎన్ని ప్రయాత్నాలు చేసినా ఫలితం కనబడలేదు. దాదాపు ఏడాదిగా అమెరికాలోనే ఉన్న ఈ ఇద్దరు సిట్ ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ట్యాపింగ్ కేసు(Telephone Tapping)లో అరెస్టయిన నలుగురు పోలీసులు అధికారులు శ్రవణ్, ప్రభాకరరావులు చెప్పినట్లే తాము నడుచుకున్నట్లు వాగ్మూలమిచ్చారు. అందుకనే వీళ్ళిద్దరినీ విచారించేందుకు సిట్ అంతగా ప్రయత్నించింది. ఈ ఇద్దరినీ విచారించకుండా కేసును లాజికల్ ఎండ్ కు తీసుకెళ్ళటం సాధ్యంకాదు.
శ్రవణ్, ప్రభాకరరావు ట్యాపింగ్ కేసులో కీలకపాత్రదారులుగా ఇప్పటికే అందరికీ తెలిసింది. అయితే వీళ్ళకు ఆదేశాలిచ్చి వేలాది ఫోన్లను ట్యాపింగ్ చేయించిన అసలు సూత్రదారి ఎవరన్న విషయం ఇంకా అధికారికంగా బయటపడలేదు. అసలు సూత్రదారి ఎవరన్న విషయం తెలియాలంటే కీలకపాత్రదారులు ఇద్దరు విచారణకు హాజరుకావాలి. వీళ్ళిద్దరిని అమెరికా నుండి ఇండియాకు రప్పించేందుకు సిట్ అధికారులు సీబీఐ(CBI) ద్వారా అమెరికాలోని ఇంటర్ పోల్(Inter Pol) ఉన్నతాధికారులను కాంటాక్ట్ చేశారు. ఇంటర్ పోల్ ద్వారా పై ఇద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు ఇప్పించారు. ఒకవైపు సిట్ తమ ప్రయత్నాలు చేస్తునే మరోవైపు వీళ్ళిద్దరిపైనా లుకౌట్ నోటీసులు జారీచేయించింది. వీళ్ళిద్దరి పాస్ పోర్టులను రద్దుచేయించటమే కాకుండా ఇద్దరిపైనా అరెస్టు వారెంటులు కూడా జారీచేయించింది.
సిట్ ప్రయత్నాలను చూసిన వీళ్ళిద్దరికీ ఎన్నోరోజులు తప్పించుకోవటం సాధ్యంకాదని అర్ధమైపోయింది. అందుకనే తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కావాలని ప్రభాకరరావు హైకోర్టులో కేసు వేశాడు. ఈ కేసు విచారణ జరుగుతోంది. ఇదేసమయంలో ముందస్తుబెయిల్ కోసం శ్రవణ్ సుప్రింకోర్టులో పిటీషన్ వేశారు. శ్రవణ్ అదృష్టం బాగుండి సుప్రింకోర్టు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. శ్రవణ్ ను అరెస్టు చేయద్దని సిట్ అధికారులకు ఆదేశాలిచ్చిన సుప్రింకోర్టు ఇదేసమయంలో సిట్ విచారణకు హాజరుకావాలని శ్రవణ్ ను ఆదేశించింది. సుప్రింకోర్టు ఆదేశాల కారణంగానే శ్రవణ్ అమెరికా నుండి శనివారం తెల్లవారుజామున హైదరాబాదు చేరుకున్నాడు. మధ్యాహ్నం సిట్ విచారణకు హాజరయ్యాడు. సిట్ విచారణలో శ్రవణ్ ఏమి చెబుతాడన్నది చాలా ఆసక్తిగా మారింది.