‘42శాతం రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయమే’

బీసీల రిజర్వేషన్లను ఈబీసీ వాళ్లు కూడా వినియోగించుకుంటారు.;

Update: 2025-07-25 08:37 GMT

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన 42శాతం రిజర్వేషన్లతో బీసీలకు తీవ్ర అన్యాయం జరగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్లతో బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్నామని చెప్పడమే కానీ.. కాంగ్రెస్ అసలు లక్ష్యం కాదని హెచ్చరించారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీల రిజర్వేషన్లను ఈబీసీ వాళ్లు కూడా వినియోగించుకుంటారని, త్వదారా ఈబీసీ రిజర్వేషన్లకింద ముస్లింలు కూడా రిజర్వేషన్లు పొందుతారని కిషన్ రెడ్డి అన్నారు. ‘‘బీసీని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందా?. బీసీని ప్రధానిని చేసిన ఘనత భాజపాది. రాజకీయ లబ్ధి కోసమే రిజర్వేషన్‌ అంశాన్ని ఎత్తుకున్నారు. ప్రజలు తిరస్కరిస్తున్నా కాంగ్రెస్‌కు బుద్ధి రాలేదు. అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఆ పార్టీ ఓడిపోతుంది. మోదీ కులాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వమే బీసీ జాబితాలో చేర్చింది. పెంచిన బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

రిజర్వేషన్ అంతా మోసమే..

‘‘తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పటి వరకు 32శాతం మాత్రమే ప్రకటించారు. ఇది ముమ్మాటికీ బీసీలను మోసం చేయడమే. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీసీల పేరుతో రిజర్వేషన్లు పెంచి.. బీసీ యేతరులకు లబ్ధి చేకూర్చడమే కాంగ్రెస్ లక్ష్యం. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ బీసీలకు న్యాయం చేస్తున్నట్లు నటించడం దుర్మార్గం. ముస్లింలకు అందిస్తున్న 4శాతం రిజర్వేషన్లనే రాజ్యాంగ విరుద్ధంగా కోర్టు పేర్కొంది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వాలు.. సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకొని కొనసాగించాయి. ఇప్పుడు అదే రిజర్వేషన్‌ను 10శాతానికి పెంచి బీసీలకు నష్టం కలిస్తున్నారు’’ అని కిషన్ రెడ్డి ఆరోపించారు.

బీజేపీ చేసిన కమిషన్ చట్టబద్ధం..

‘‘బీజేపీ చేసిన బీసీ కమిషన్ చట్టబద్దంగా ఉంది. ఎంపీల్లో ఎక్కువ మంది బీసీలు.. బీజేపీ నుంచే ఉన్నారు. కొందరు మాటిమాటికి.. మోదీ కులాన్ని ఎంచుతున్నారు. ఆయన పుట్టుకతో బీసీ కాదని అంటున్నారు. ఆయన కులాన్ని మండల్ కమిషన్ ఆధారంగా బీసీల్లో చేర్చారు. విశ్వబ్రాహ్మణుల వంటి వందల కులాలు దశలవారీగా బీసీ జాబితాలోకి చేరాయి. ఇప్పుడు మోదీని కన్వర్టెడ్ బీసీ అంటారా? ఆయన కులాన్ని బీసీల్లోకి చేర్చిందే మీ ప్రభుత్వం కదా? బీసీ లంటేనే పడని కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు బీసీలకు పెద్దపీట వేస్తున్నట్లు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది’’ అని చురకలంటించారు. కాంగ్రెస్ తన హాయంలో ఒక్క బీసీని అయినా ప్రధానిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ ఎంపిక చేసిందా? అని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News