కేటీయార్ సేమ్ సైడ్ గోల్ వేసుకున్నారా ?

ఒకరిద్దరి ఫోన్లను ట్యాపింగ్ చేసుండచ్చు, దొంగలవి, లంగాల ఫోన్లను ట్యాప్ చేయటంలో తప్పులేదన్నట్లుగా కేటీయార్ మాట్లాడారు.

Update: 2024-03-28 07:37 GMT

‘ఒకరిద్దరి ఫోన్లను ట్యాపింగ్ చేస్తే చేసుండచ్చు అయితే ఏంటి ? దొంగలవి..లంగాలవి ఫోన్లు ట్యాపింగ్ జరిగుండచ్చు’ ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ చేసిన వ్యాఖ్యలు. మల్కాజ్ గిరి నేతలతో మాట్లాడుతు కేటీయార్ పై వ్యాఖ్యలుచేశారు. ఒకరిద్దరి ఫోన్లను ట్యాపింగ్ చేసుండచ్చు, దొంగలవి, లంగాల ఫోన్లను ట్యాప్ చేయటంలో తప్పులేదన్నట్లుగా కేటీయార్ మాట్లాడారు. ప్రత్యర్ధులు దొంగలు, లాంగాలని డిసైడ్ చేయటానికి కేటీయార్ ఎవరు ? అన్నదే ఇక్కడ కీలకమైన పాయింట్. ఎవరెంత అడ్డుగోలుగా దోచుకున్నా వాళ్ళు తప్పుచేశారని, ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆధారాలను చూపాల్సిన బాధ్యత పోలీసులు, సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్ధలవి. దాన్ని నిర్ధారించి తీర్పు చెప్పాల్సింది కోర్టులు.

దర్యాప్తులో నిజాలు బయటపడనంతవరకు, కోర్టులు తీర్పుచెప్పేంతవరకు ఎవరూ దోషులు కారు. కాబట్టి కేటీయార్ భాషలో ఎవరినీ దొంగలు, లంగాలు అనేందుకు లేదు. ఇక్కడ జరిగింది ఏమిటంటే రాజకీయంగా తమకు పడని వారందరి ఫోన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయించినట్లు అర్ధమవుతోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపణల ప్రకారం కొన్ని వందల మంది ఫోన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేయించింది. ట్యాపింగ్ ను ప్రత్యక్షంగా పర్యవేక్షించి, అరెస్టయిన పోలీసు అధికారుల లెక్కల ప్రకారమే లక్ష ఫోన్ రికార్డులను ధ్వంసం చేశారట. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే లక్ష ఫోన్ రికార్డులను ధ్వంసంచేసినట్లు డీఎస్సీ ప్రణీత్ రావు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఎవరి ఫోన్లను కూడా ప్రభుత్వం ట్యాప్ చేసేందుకు లేదు. అలాంటిది వందలాది ఫోన్లను ట్యాపింగ్ చేయటమంటే చాలా పెద్ద నేరం. అంతపెద్ద నేరంచేసిన ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కేటీయార్ ట్యాపింగ్ ను చాలా చిన్న విషయంగా చూస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ట్యాపింగ్ విషయాన్ని అంతర్జాతీయ కుంభకోణంగా చూస్తున్నారంటు ప్రభుత్వంమీద విరుచుకుపడటమే ఆశ్చర్యంగా ఉంది. అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పు జరిగుంటే నిరూపించి బాధ్యులపై చర్యలు తీసుకోమని చాలెంజ్ విసరటం విడ్డూరమనే చెప్పాలి. కేటీయార్ మాటల్లో ప్రభుత్వం ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేందు అనే ధైర్యమే కనబడుతోంది. ఒకరిద్దరు ఫోన్లను ట్యాపింగ్ చేశాం, దొంగలవి, లంగాల ఫోన్లు ట్యాప్ జరిగిందన్నారంటే చాలామంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు కేటీయార్ అంగీకరించినట్లే.

పోలీసులున్నదే అందుకు కదా అని కేటీయార్ అనటం బరితెగింపుకు నిదర్శనంగా ఉంది. పోలీసులు ఉన్నది ఫోన్లను ట్యాప్ చేయటానికి కాదని అందరికీ తెలుసు. ఒకరి ఫోన్ను ట్యాప్ చేయాలంటే అనుసరించాల్సిన నిబంధనలు చాలా ఉంటాయి. కేంద్ర లేదా రాష్ట్ర హోంశాఖల సెక్రటరీల అనుమతి లేకుండా ట్యాప్ చేయటం నేరమే. పార్లమెంటు ఎన్నికల ముందు వెలుగుచూసిన ట్యాపింగ్ ఆరోపణలను కేటీయార్ అంగీకరించినట్లుగానే ఉంది. ఈ పరిస్ధితుల్లో కేటీయార్ ప్రకటన సేమ్ సైడ్ గోలనే చెప్పాలి. ఎందుకంటే ట్యాపింగ్ ఆరోపణలపై ఇప్పటివరకు బీఆర్ఎస్ లో కేసీయార్ తో సహా ఏ నేత కూడా మాట్లాడలేదు. ట్యాపింగ్ అంశంతో తనకు ఎలాంటి సంబంధంలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరణిచ్చుకున్నారు.

ఇదే విషయమై కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడుతు ట్యాపింగ్ విషయంలో కేసీయార్, హరీష్ రావు, కవితలే కీలక పాత్రదారులు కాబట్టి వాళ్ళపై కేసులు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలోనే ట్యాపింగ్ జరిగిందని కేటీయార్ అంగీకరించటం పార్టీని ఇరకాటంలో పడేసేట్లయ్యింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల విషయంలో కూడా కేటీయార్ ఇలాగే మాట్లాడారు. మేడిగడ్డలో కుంగిన పిల్లర్లపై జరుగుతున్న రాద్దాంతంపై కేటీయార్ మాట్లాడుతు ‘రెండు మూడు పిల్లర్లు కుంగితే ఏమైతది’ ? అని ఎదురు ప్రశ్నించారు. దాని ఫలితం ఏమిటో ఎన్నికల్లో కనబడింది.

ఇదే విషయమై సామాజిక విశ్లేషకులు జోస్యుల వేణుగోపాల్ మాట్లాడుతు టెలిఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన నేరమన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ చేయటమంటే ఇతరుల అనుమతి లేకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి చొరబడటమే అని అభప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాదని కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇవే పనులు చేస్తున్నట్లు జోస్యుల ఆందోళన వ్యక్తంచేశారు. పెగాసస్ స్పైవేర్ ను మోడీ ప్రభుత్వం ఉపయోగించిందన్న ఆరోణలను గుర్తుచేశారు. చట్ట విరుద్ధంగా ట్యాపింగ్ చేయకూడదని తెలిసి ప్రభుత్వాలే ఆ పని చేస్తున్నట్లు జోస్యుల వాపోయారు.

Tags:    

Similar News