తెలంగాణలో 'BRU' ట్యాక్స్ టెర్రర్...

తెలంగాణాలో BRU ట్యాక్స్ వల్ల ఐటి ఎగుమతులు తగ్గుతున్నాయి, పెట్టుబడులు వెనక్కిపోతున్నాయని కేటీఆర్ ఆరోపించారు.

Update: 2024-05-25 08:07 GMT

తెలంగాణాలో BRU ట్యాక్స్ వల్ల వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ఐటి ఎగుమతులు తగ్గుతున్నాయి, పెట్టుబడులు వెనక్కిపోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్ వచ్చాక అన్నీ మోసాలే జరుగుతున్నాయన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇప్పటివరకు ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు.

రాష్ట్రంలో BRU ట్యాక్స్ నడుస్తోందన్న ఆయన.. B ట్యాక్స్ అంటే - బట్టి విక్రమార్క ట్యాక్స్, R ట్యాక్స్ అంటే - రేవంత్ ట్యాక్సో రాహూల్ గాంధీ ట్యాక్సో, U ట్యాక్స్ అంటే - ఉత్తమ్ ట్యాక్స్ అంటూ మిల్లర్ల దగ్గర నుండి వసూలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. "BRU ట్యాక్స్ వల్ల వ్యవస్థలు కుదేల్ అవుతున్నాయి. పెట్టుబడులు వెనక్కు పోతున్నాయి. కేన్స్ టెక్నాలజీని పట్టుకొచ్చి వారం రోజుల్లో వారికి ల్యాండ్ ఇచ్చినం. 20 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి. కాంగ్రెస్ వచ్చాక వెనక్కి వెళ్లిపోయింది. నల్గొండ, వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా మేము ఐటీని తీసుకెళ్ళాం. వరంగల్‌ లో ఐటి మూతపడుతున్నది. ఐటీ ఎగుమతులు తగ్గినయి" అని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి దశాబ్ది నిండుతున్న సందర్భంగా ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుందో ఆలోచించాలి. అంతేగానీ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది ట్యాక్స్ ల పేరుతో వసూల్ చెయ్యడానికి కాదంటూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు.

రేపే రాజీనామా చేస్తా...

95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే. కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చి స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకున్నామని కేటీఆర్ అన్నారు. "2014-23 వరకు మేమున్నాం.. మాకంటే ముందు పదేండ్లు కాంగ్రెస్ ఉంది. ఆ పదేండ్లలో 24,086 పోస్టులనే ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేశారు. ఇందులో 10,084 ఉద్యోగాలే తెలంగాణకు దక్కాయి. 2,32,308 ఉద్యోగాలకు కేసీఆర్ అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇచ్చారు. ఇందులో 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 1,60,083 భర్తీ చేశారు. మిగిలినవి అండర్ ప్రాసెస్‌లో ఉన్నాయి. 32 వేల ఉద్యోగాలు ఇచ్చాం అని కాంగ్రెస్ చెబుతోంది. వాళ్లకు దమ్ముంటే నోటిఫికేషన్ ఇచ్చిన తేదీలను చెప్పాలె. ఈ 32 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చింది, పరీక్షలు పెట్టింది మేమే.. కేవలం రిజల్ట్ ఇచ్చి, ఉద్యోగాలు తామే భర్తీ చేసినట్టుగా కాంగ్రెస్‌ చెప్పుకుంటోందని మండిపడ్డారు.

"పోలీస్ ఉద్యోగాల రిజల్ట్ కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఇచ్చింది. ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని యువతకు సరిగా చెప్పుకోలేకపోయాం. ప్రైవేటు రంగంలో 24 వేల పరిశ్రమలకు పర్మిషన్ ఇచ్చాం. 24 లక్షల ఉద్యోగాలు ప్రైవేటులో వచ్చాయి. ఇంతకంటే ఎక్కువ నియామకాలు చేపట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంటే బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు చూపించాలి. చూపిస్తే నేను రేపే రాజీనామా చేస్తాను" అంటూ కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ లకు సవాల్ చేశారు.

Tags:    

Similar News