హైడ్రా బాధితులకు శుభవార్త, టీడీఆర్ రూపంలో పరిహారం
అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన ‘హైడ్రా’ బాధితులకు పరిహారం ఇవ్వాలని యోచిస్తోంది.
By :  Saleem Shaik
Update: 2025-10-31 03:13 GMT
హైదరాబాద్ నగరంలో వేలాది అక్రమ నిర్మాణాలు, కబ్జాలను తొలగించిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) మానవత్వం చూపించనుంది. చెరువులు,నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో నష్టపోయిన బాధితులకు ట్రాన్సఫర్‌బుల్ డెవలప్‌మెంట్ రైట్స్(టీడీఆర్) కింద నష్టపరిహారం ఇచ్చేందుకు హైడ్రా ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు హైడ్రా అధికారులు తాజాగా ప్రకటించారు. టీడీఆర్ పరిహారం ఇచ్చేందుకు వీలుగా అర్హులను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
పేదలకు పరిహారం
హైదరాబాద్ నగరంలోని పలు చెరువుల్లోని ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్లలో తక్కువ ధరకు వచ్చాయని పేదలు కొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. బతుకమ్మకుంట, కూకట్ పల్లి నల్ల చెరువు, సున్నం చెరువు, మాదాపూర్ తమ్మిడికుంట, ఉప్పల్ నల్ల చెరువు,  బమృక్నుద్దౌలా చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్లలోని ఆక్రమణలను హైడ్రా తొలగించి ఆయా చెరువుల సుందరీకరణ పనులు చేపట్టింది. దీంతో చెరువుల కింద ఇళ్లు కోల్పోయిన పేదలకు, భూమి, ఇల్లు లేని వారికి ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్స్ కింద పరిహారం అందించేందుకు హైడ్రా కసరత్తు చేస్తుంది. 
రూ.50వేల కోట్ల భూముల పరిరక్షణ
హైదరాబాద్ నగరంలో కబ్జాకు గురైన 923.14 ఎకరాల భూములను హైడ్రా పరిరక్షించింది. 233 ఎకరాల చెరువుల భూములు, 424 ఎకరాల ప్రభుత్వ భూములు, పార్కుల భూములను హైడ్రా కాపాడింది. హైడ్రా రూ.50 వేల కోట్ల విలువైన ఆస్తులను కాపాడింది. 
సీఎస్ ఆర్ నిధులతో ముష్కిన్ చెరువు అభివృద్ధి
కార్పోరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీ (సీఎస్ ఆర్) నిధులతో చెరువులను అభివృద్ధి చేస్తున్న పలు సంస్థలకు ముష్కిన్ చెరువు ఒక నమూనా కావాలని తత్వ డెవలపర్స్‌కు హైడ్రా కమిషనర్  ఏవీ రంగనాథ్ కోరారు.నార్సింగి మండలంలోని ఈ చెరువు అభివృద్ధిని తత్వ డెవలపర్స్ అనే సంస్థ సీఎస్ ఆర్ నిధుల(సామాజిక బాధ్యత)తో అభివృద్ధి చేస్తోంది. గతంలో చెరువు హద్దులను పూర్తి స్థాయిలో మార్కింగ్ చేసి ఇవ్వక పోవడంతో అభివృద్ధి జాప్యం అయ్యిందని సంస్థ ప్రతినిధులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. 60 ఎకరాల పరిధిలోని ప్రభుత్వ భూములను సర్వే పూర్తి చేసి, అనధికార ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. చెరువులోకి వరద నీరు వచ్చి చేరడంతో పాటు ఔట్‌లెట్ కూడా సరిగా ఉండేలా చూడాలన్నారు.చెరువు చుట్టూ పటిష్ఠమైన బండ్ నిర్మించి, మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా తత్వ సంస్థ అభివృద్ధి పనులు చేపట్టాలని కమిషనర్ రంగనాథ్ సూచించారు.
పాతబస్తీలో చారిత్రక చెరువు పునరుద్ధరణ
పాతబస్తీలో చారిత్రక భమృక్నుద్దౌలా చెరువును హైడ్రా సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తుంది. నవంబరు నెలాఖరు నాటికి ఈ చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలనే లక్ష్యంతో హైడ్రా పని చేస్తోంది.ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ భమృక్నుద్దౌలా చెరువు పునరుద్ధరణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చెరువును జాతి సంపదగా భావితరాలకు అందించాల్సిన అవసరాన్ని హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ క్రమంలోనే  చెరువు ఆక్రమణలను గత ఏడాది ఆగస్టు నెలలో తొలగించినట్టు చెప్పారు. 18 ఎకరాలకు పైగా ఉన్న ఈ చెరువు కేవలం 4.12 ఎకరాలకు పరిమితమైపోగా, ఆక్రమణలను తొలగించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పుడు చెరువును 18 ఎకరాల మేర విస్తరించి,వరద కట్టడితోపాటు భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని హైడ్రా కమిషనర్ చెప్పారు. 
చెరువు చుట్టూ సుందరీకరణ పనులు
భమృక్నుద్దౌలా చెరువు చుట్టూ బండ్ నిర్మించి వాకింగ్ ట్రాక్‌లు నిర్మిస్తున్నారు. చెరువు కట్ట చుట్టూ ఫెన్సింగ్ నిర్మిస్తున్నారు. చెరువు లోపలి వైపు కూడా ఎవరూ లోపలకు వెళ్లకుండా గట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ప్లే ఏరియాలు ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధులు సేద దీరే విధంగా అక్కడ సీటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు పార్కులు నిర్మిస్తున్నారు. ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. చెరువు చుట్టూ రహదారులు నిర్మించడంతో పాటు.. గ్రీనరీని పెంచే విధంగా మొక్కలు నాటుతున్నారు. పచ్చిక బైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. నాటి చారిత్రక ఆనవాళ్లను పరిరక్షిస్తూనే చెరువు వద్ద నగిషీలు చెక్కుతున్నారు. చెరువులో మట్టిలో కలిసిపోయిన నాటి రాళ్లను బయటకు తీసి భద్రపరుస్తున్నారు. చెరువు వద్ద సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసి నిఘాను పటిష్ఠం చేస్తున్నారు. 
నిజాం నిర్మించిన చెరువు
హైదరాబాద్ కు 435 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 1770లో హైదరాబాదు మూడవ నిజాం సికందర్ జాకు ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్‌ఉద్‌దౌలా నిర్మించిన భమృక్నుద్దౌలా చెరువుకు పూర్వ వైభవం కల్పించనున్నారు.నిజాంల కాలంలో మీరాలం ట్యాంక్‌ను రాజులు, భమృక్నుద్దౌలా చెరువును రాణులు స్నానాలకు వినియోగించేవారని స్థానికులు చెబుతున్నారు. భమృక్నుద్దౌలా చెరువులో వనమూలికల చెట్లు, కొమ్మలు వేసి.. ఆ దిగువున నిర్మించిన బావిలోకి వచ్చిన ఊట నీటిని తాగేందుకు వినియోగించేవారని మరి కొంతమంది  చెప్పారు.  ఔషధగుణాలున్న ఈ నీటిని మాత్రమే నిజాంలు వినియోగించేవారంటున్నారు. ఈ చెరువు చుట్టు సువాసనలు వెదజల్లే పూల మొక్కలు విరివిగా ఉండేవని, ఆ పూలన్నీ చెరువులో పడడంతో ఇక్కడి నీటిని సెంటు తయారీకి  వినియోగించేవారని చెబుతారు. 
పార్కుకు కబ్జాల నుంచి విముక్తి.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, బాలాపూర్ మండలాల్లో 976 గజాల పార్కుతో పాటు 1.28 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా గురువారం కాపాడింది. వీటి విలువ రూ. 111 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మైలార్‌దేవుపల్లి విలేజ్‌లోని శాస్త్రీపురం కాలనీలో 976 గజాల పార్కు స్థలం చుట్టూ గతంలో మున్సిపల్ అధికారులు ఫెన్సింగ్ వేశారు. తప్పుడు డాక్యుమెంట్లతో కొంతమంది పార్కు స్థలాన్ని కబ్జా చేస్తున్నారని అక్కడి నివాసితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు తీసుకుంది. బాలాపూర్ మండలం జిల్లేలుగూడ విలేజ్‌లో  సర్వే నంబరు 76లోని 1.28 ఎకరాల ప్రభుత్వ భూమిలో కూడా  ఆక్రమణలను హైడ్రా గురువారం తొలగించింది.ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది.
నిజాంపేటలో పార్కులను కాపాడిన హైడ్రా
నిజాంపేట మున్సిపాలిటీలో వేర్వేరు ప్రాంతాల్లో రెండు పార్కులను హైడ్రా  కాపాడింది. బృందావన్ కాలనీలో 2300 గజాల పార్కును కాపాడారు. కౌశల్యా కాలనీలోని 300ల గజాల పరిధిలోని బనియన్ ట్రీ పార్కును  కబ్జాల నుంచి రక్షించింది. 2600ల గజాల స్థలం విలువ రూ. 39 కోట్లకు పైగా ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్ర స్థాయిలో విచారించిన అధికారులు పార్కు స్థలాలుగా గుర్తించి బుధవారం ఆక్రమణలను తొలగించింది.