‘పోలీసులూ.. మూల్యం చెల్లించుకోవాల్సిందే’

కాంగ్రెస్ కార్యకర్తల్లా కాదు శాంతిభద్రత రక్షకులుగా పనిచేయండన్న కేటీఆర్.;

Update: 2025-07-07 12:14 GMT

పోలీసులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న ప్రతి పోలీసు అధికారి తగిన మూల్చం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, కానీ తెలంగాణ పోలీసులు దానిని కాలరాస్తున్నారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణతో పాటు పలువురు ఇతర నేతలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో పాటు, పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యం చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఖాకీలు వేసుకున్నే కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. అయితే ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చుక్క రమేష్ మృతికి నిరసనగా బీఆర్ఎస్ శాంతియుత ఆందోళనకు దిగింది. వారి ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో పోలీసుల తీరును కేటీఆర్ తప్పుబట్టారు. బీఆర్ఎస్ నేతల శాంతియుత ఆందోళనను అడ్డుకున్న పోలీసులు.. కాంగ్రెస్ నేతల పర్యటనలకు ఎలా పర్మిషన్లు ఇస్తున్నారని ప్రశ్నించారు. కొందరు పోలీసులు కాంగ్రెస్ తొత్తుల్లాగా, హస్తం నేతల చేతుల్లో కీళ్లుబొమ్మల్లా పనిచేస్తున్నారని, నేడు బీఆర్ఎస్ నేతల విషయంలో వారు నడుచుకున్న తీరు చూస్తే ఇది స్పష్టం అవుతుందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం ఏం పోలీసింగ్ అని కేటీఆర్ మండిపడ్డారు. ఎవరి ఆదేశాల మేరకు దౌర్జన్యంగా ఇళ్లలోకి దూరి 2 వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారో ములుగు పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కొంతమంది పోలీసులకు న్యాయస్థానాల్లో చివాట్లు పడుతున్నా ఇంకా సోయి రావడం లేదన్ని విమర్శించారు.

కాంగ్రెస పార్టీ తొత్తుల్లా, ఆ పార్టీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్న పోలీసులు రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. ఎల్లకాలం కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండదని, ఆ విషయాన్ని గుర్తుంచుకుని పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని కేటీఆర్ సూచించారు. తాము వేసుకున్నది కాంగ్రెస్ కండూవా కాదు, ఖాకీ యూనిఫాం అని ఇప్పటికైనా పోలీసులు గ్రహించి బుద్దితెచ్చుకుని చుక్క రమేశ్ చావుకు కారణమైన సీతక్క అనుచరులపై కేసు నమోదు చేయాలాని కేటీఆర్ అన్నారు. లేకుంటే బీఆర్ఎస్ తరుపున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.

Tags:    

Similar News