మావోయిస్టు అగ్రనేత జగన్ మృతి

మావోయిస్టు అగ్రనేత, మొదటి తరం నాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ మృతి చెందారు.

Update: 2024-09-04 18:12 GMT

మావోయిస్టు అగ్రనేత, మొదటి తరం నాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ మృతి చెందారు. మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా, సెంట్రల్ ఆర్మీ ఇన్చార్జిగా, మహారాష్ట్ర - ఛత్తీస్గఢ్ సరిహద్దు ఇన్చార్జిగా ఉన్న ఆయన మంగళవారం కన్నుమూశారు. ఛత్తీస్గడ్ లో పోలీసు భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో మరణించినట్లు దంతెవాడ ఎస్సై బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయన హన్మకొండ జిల్లా, కాజీపేట మండలం టేకులగూడెం వాసి.

మావోయిస్టు ఉద్యమంపై ఆకర్షితుడైన జగన్... 1980లో పార్టీలో చేరారు. ఏసోబు అలియాస్ జగన్ భార్య మాచర్ల లక్ష్మక్క గతేడాది అనారోగ్యంతో మరణించారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఛత్తీస్గడ్ నుంచి టేకులగూడెంకు ఆయన మృతదేహాన్ని తీసుకొస్తున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన మరణంతో కుటుంబంలోనూ, గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ ఎన్కౌంటర్లో మరణించిన ఏసోబు పై 25 లక్షల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా చత్తీస్గడ్ లోని దంతేవాడలో మంగళవారం ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారంటూ సమాచారం అందడంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. ఏసోబుతో సహా మొత్తం 9 మంది పార్టీ సభ్యులు ఎన్కౌంటర్లో ప్రాణాలు విడిచారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో 303 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, 12 తుపాకులు లభ్యమయ్యాయి అని పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News