కాగితాల్లోనే మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్
మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ కాగితాల్లోనే ఉంది. అక్రమ కట్టడాలను నిరోధించేందుకు మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని ఫోరం కోరింది.
By : The Federal
Update: 2024-11-15 12:59 GMT
అనుమతి లేని అక్రమ కట్టడాలను నిరోధించేందుకు మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుక్రవారం లేఖ రాసింది.
- మున్సిపాలిటీ అనుమతి లేని అక్రమ కట్టడాలతో ప్రణాళికా బద్ధంగా పట్టణాలు అభివృద్ధి చెందడం లేదు.అక్రమ కట్టడాలతో ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకునే సందర్భంలో బిల్డర్‌లు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే ఆర్డర్‌లు తెచ్చుకుంటున్నారు.
ఆరేళ్లుగా పెండింగులోనే...
తెలంగాణ ప్రభుత్వం 2016వ సంవత్సరంలో మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో జిల్లా జడ్జి చైర్‌పర్సన్‌గా డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ అధికారి సభ్యులుగా ఉండి ప్రజల నుంచి మున్సిపల్ అధికారులు కట్టడాలపై ఇచ్చిన నోటీసులు పరిశీలించి పరిష్కరిస్తారు. అంటే ప్రజలకు మునిసిపాలిటీకి మధ్య వారధిగా ట్రిబ్యునల్ ఉంటుంది. కాని చైర్‌పర్సన్ అలాగే సాంకేతిక సభ్యుల నియామకం చేయకపోవడంతో గత ఆరు సంవత్సరాలుగా ట్రిబ్యునల్ కాగితాలకే పరిమితమైంది.
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్
ఎంతకూ ప్రభుత్వంలో చలనం లేనందున 2019లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో పిల్ వేసింది. ట్రిబ్యునల్ పనిచేయకపోవడంపై హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా సంస్థను నెలకొల్పింది. హైడ్రా పెద్ద ఎత్తున అక్రమ కట్టడాల కూల్చివేత మొదలుపెట్టడంతో రాజకీయ దుమారం లేచింది. చివరకు బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.బిల్డింగ్ ట్రిబ్యునల్ చైర్‌పర్సన్, సాంకేతిక సభ్యులు మరియు ఇతర సిబ్బందిని తక్షణమే నియమించి ట్రిబ్యునల్ నడిచే విధంగా చర్యలు చేపట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ముఖ్యమంత్రికి వినతిపత్రంలో కోరింది.