గ్రూప్-1 పై కోర్టు వివాదాలకు అంతం లేదా?పరిష్కారమేమిటి ?
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో గ్రూప్ -1 పై మెయిన్స్ పై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ ఆందోళనలకు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించడంతో..
By : Chepyala Praveen
Update: 2024-10-19 07:39 GMT
తెలంగాణలో గ్రూప్-1 పరీక్షపై రగడ కొనసాగుతూనే ఉంది. సోమవారం( అక్టోబర్ 21) నుంచి జరగనున్న మెయిన్స్ పరీక్షలను పోస్టు పోన్ చేయాలని, జీఓ నెంబర్ 29 రద్దు చేయాలని విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో గ్రూప్స్ కోచింగ్ కు పేరుపొందిన అశోక్ నగర్ లో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ విద్యార్థులు ఆందోళన చేయడం, పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించి, విద్యార్థులను అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.అసలు టీజీపీఎస్సీ పై నిర్వహిస్తున్న గ్రూప్-1 పై వివాదం ఏంటీ?
ప్రిలిమ్స్ తో వివాదం మొదలు..
గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష ఇప్పటికే మూడు సార్లు జరిగింది. 2022, 2023, 2024 లో మూడు సార్లు గ్రూప్ -1 పరీక్ష నిర్వహించింది టీజీపీఎస్సీ. మొదటి సారి పేపర్ లీక్ కారణంగా మెయిన్స్ ముందు ప్రిలిమ్స్ రద్దు చేసిన కమిషన్, రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించిన సరైన నిబంధనలు పాటించలేదని హైకోర్టు రద్దు చేసింది. చివరిగా ఈ సంవత్సరం జూన్ లో ముచ్చటగా మూడో సారి ప్రిలిమ్స్ నిర్వహించింది.
అదనంగా మరో 63 పోస్టులు కొత్త నోటిఫికేషన్ కు జతచేయడంతో మొత్తం 1:50 నిష్పత్తిలో 31,382 మంది అభ్యర్థులు ప్రధాన పరీక్షకు అర్హత సాధించారని కమిషన్ వెల్లడించింది. కానీ ప్రస్తుతం మెయిన్స్ పరీక్ష కోసం 34 వేలమంది అభ్యర్థులకు కమిషన్ హల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించిందని కొంతమంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. తరువాత వివాదం జీవో 29 మీదకి మళ్లింది.
జీఓ 29 జారీ..
గ్రూప్-1 పరీక్షకు ముందు దివ్యాంగుల రిజర్వేషన్ లో మార్పులు చేస్తూ జీవో 55 కి బదులుగా కొత్తగా జీవో 29 ను జారీ చేసింది. దీనిలో ప్రధానంగా ఉన్నత కులాల వారీకి మాత్రమే అవకాశం ఉందని మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి అన్యాయం జరుగుతోందని విద్యార్థులు ఆందోళనలు ప్రారంభించారు.
ఇదే విషయంపై అశోక అకాడమీ డైరెక్టర్ అశోక్ ది ఫెడరల్ తెలంగాణతో మాట్లాడుతూ.. ‘‘ ఈ జీవోను రద్దు చేయాల్సిందే. ఒపెన్ కేటగిరి వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు దక్కెలా ఈ జీవో ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈ జీవో వల్ల అన్యాయం జరగుతోంది. ఈ నష్టం పూడ్చుకోలేది. రిజర్వేషన్ అభ్యర్థికి ఓపెన్ లో ఉద్యోగం వచ్చిన.. వారికి తిరిగి వారి కేటగిరిలో మాత్రమే ఉద్యోగం ఇవ్వడం ఏంటీ?’’ అని ప్రశ్నించారు.
బీఆర్ ఎస్ నేత, మాజీ సివిల్ సర్వెంట్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ఇదే తరహ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జీవో 29 ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు కు చేరింది. ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించబోతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఉద్యోగాల భర్తీని వివాదం చేస్తోందని కొంతమంది విద్యార్థి నాయకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ ఇప్పటికే నాలుగు సంవత్సరాలుగా చదువుతూనే ఉన్నాం. గ్రూప్-4 ఉద్యోగాలు ఇప్పటి వరకూ భర్తీ చేయలేదు. గ్రూప్ 2 వాయిదా వేస్తారనే ఆందోళనగా ఉంది. ఎస్సీ వర్గీకరణ జరగకుండా గ్రూప్ 2 ను భర్తీ చేస్తారా లేదా అనేది సందిగ్థం. నాకు తెలిసి చాలా మంది ప్రభుత్వ టీచర్లు లాంగ్ లీవ్ పెట్టుకుని గ్రూప్ 1 కి చదువుతున్నారు. ఇప్పుడు పరీక్ష వాయిదా పడితే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని భయపడుతున్నారు’’ అని జ్యోతి అనే అభ్యర్థి ది ఫెడరల్ తెలంగాణతో ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రశ్నలపై కమిషన్ వ్యవహరించిన తీరు దారుణం..
ఈ ఏడాది జూన్ లో నిర్వహించిన ప్రిలిమ్స్ లో దాదాపు 14 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయి. అందులో ఏడు ప్రశ్నలు పూర్తిగా తప్పులని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే అభ్యర్థులకు ఉన్నత న్యాయస్థానంలో అనుకూలంగా తీర్పు రాలేదు. అయితే వివాదం ఇక్కడితో ముగిసిపోలేదు.
టీజీపీఎస్సీ తన అఫిడవిట్ లో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని తేల్చి చెప్పి అభ్యర్థులను, విద్యార్థులను తీవ్ర గందరగోళంలో పడేసింది. ఇదే అంశంపై అశోక్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్ మాట్లాడుతూ ‘‘ తను చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికి టీజీపీఎస్సీ నిందను తెలుగు అకాడమీకి మీదకు నెట్టేసింది. ముందు ప్రభుత్వం తెలుగు అకాడమీని మూసివేయాలి. ఏదీ ప్రామాణిక పుస్తకమే ప్రకటించాలి. ’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ ఇంతకుముందు 2011 లో అప్పటి ఏపీపీఎస్సీ కూడా ఇలాగే ఆరు ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఇచ్చింది. అభ్యర్థుల అభ్యంతరాలను లెక్క చేయకుండా మెయిన్స్, ఇంటర్వ్యూలు సైతం నిర్వహించింది. కానీ 2017 లో సుప్రీంకోర్టు ఈ పరీక్ష ని రద్దు చేసింది. తిరిగి మెయిన్స్, ఇంటర్వ్యూను నిర్వహించాలని ఆదేశించింది.
ఇప్పుడు టీజీపీఎస్సీ కూడా అదే దారిలో వెళ్తోంది. నిజానికి గ్రూప్-1 పరీక్షలో 14 ప్రశ్నలు తప్పులు ఉన్నాయి. కొంతమంది అభ్యర్థులు ఏడు ప్రశ్నలు తప్పని కోర్టు మెట్లేక్కారు. ఇక్కడ హైకోర్టులో వారికి ఊరట లభించలేదు. కానీ సుప్రీంకోర్టులో వీరికి అనుకూలంగా తీర్పు వస్తే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది’’ అని కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్ చెబుతున్న మాట. ‘‘ కాస్త ఆలస్యమైన సరే కోర్టు కేసులు అన్ని పరిష్కరించి, మెయిన్స్ పరీక్ష నిర్వహించాలి’’ అని అశోక్ డిమాండ్ చేస్తున్నారు.
వాల్యూషన్ కు తక్కువ సమయం ఏంటీ..
పరీక్ష కు దాదాపు 31 వేల మందికి పైగా హజరవుతున్నారు. అయితే డిసెంబర్ 9 లోపే ఫలితాలు ప్రకటిస్తామని కాంగ్రెస్ చెబుతోందని, ఇదేలా సాధ్యమని ఓ విద్యార్థి నాయకుడు అనుమానం వ్యక్తం చేశారు. ‘‘ యూపీఎస్సీ పది వేల అభ్యర్థులను మెయిన్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. వారు రాసిన మెయిన్స్ వాల్యూయేషన్ చేయడానికి దాదాపు ఐదు నెలల సమయం దాకా తీసుకుంటోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నెల రోజుల వ్యవధిలోనే 31 వేల మంది అభ్యర్థులు రాసిన ఏడు పేపర్లను వాల్యూయేషన్ చేయడానికి పూనుకుందని ఇదేలా సాధ్యం అవుతుంది’’ అని ప్రశ్నిస్తున్నారు.
వివాదాలు లేకుండా ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించాలని చాలామంది అభ్యర్థులు కోరుతున్నారు. ఇప్పటి దాకా ప్రకటించిన ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించలేదని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగిన వాటికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వలేదని వాపోతున్నారు. అలాగే ఎన్నికల్లో హమీ ఇచ్చినట్లు ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
అశోక్ నగర్ లో బండి సంజయ్ ఆందోళన..
గ్రూప్- 1 విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆయన శనివారం మధ్యాహ్నం అశోక్ నగర్ చౌరస్తాకు చేరుకున్నారు. దీనితో పోలీసులు అప్రమత్తమయ్యారు. హస్టళ్ల నుంచి విద్యార్థులు బయటకు రాకుండా జాగ్రత్తులు తీసుకున్నారు. బండి సంజయ్ అశోక్ నగర్ చేరుకోగానే ‘‘ వీ వాంట్ జస్టిస్’’ అనే నినాదాలు మారు మోగాయి. కొంతమంది గ్రూప్ -1 అభ్యర్థులు ఆయనను కలిసి మాట్లాడారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ ఇక్కడ నుంచి కదిలేది లేదని ప్రకటించారు.