Caste Census | ‘వారికి ఇంకా టైమ్ ఉంది.. సమాచారం ఇవ్వొచ్చు’
కుల గణన.. రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. సుదీర్ఘకాలం కసరత్తు చేసిన తర్వాతే ప్రారంభించామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి.;
కుల గణనలో పాల్గొనని వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ గుడ్ న్యూస్ చెప్పారు. వారికి ఇంకా సమయం ఉందని, ఇప్పటికైనా వారు ముందుకొచ్చి తమ సమాచారం అందించవచ్చని చెప్పారు. ప్రజల నుంచి సమాచారం స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు దశాబ్దాలుగా పరిష్కారాల కోసం ఎదురుచూస్తున్న సమస్యలను సాల్వ్ చేయడానికి ఈ సర్వే సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. సచివాలయంలో కుల గణన సర్వే గురించి ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 3శాతం మంది వరకు సర్వేలో పాల్గొనలేదని, వారంతా కూడా ఇప్పుడైనా ముందుకొచ్చి తమ సమాచారన్ని అందించవచ్చని అన్నారు. ప్రజలకు సంక్షేమాన్ని మరింత చేరువ చేయడం కోసమే ఈ సర్వే చేశామని, సంక్షేమ పథకాల రూపకల్పన, అమలులో ఈ సర్వే కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు.
‘‘ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కుల గణన సర్వే మొదలు పెట్టాం. ఇందుకోసం రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోలేదు. సుదీర్ఘ కాలం పాటు కుల గణనపై కసరత్తు చేసిన తర్వాతే దానిని ప్రారంభించాం. రాష్ట్ర స్థితి గతుల ఎక్స్‌రేలా ఈ నివేదిక పనిచేస్తుంది. కులగణనతో దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. దేశానికే తెలంగాణ మార్గదర్శకంగా నిలుస్తోంది. దేశంలో స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి కుల గణను మేమే పూర్తి చేశాం. సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సామాజిక, విధానపరమైన నిర్ణయాల అమలుకు సర్వే సమాచారాన్ని వినియోగిస్తాం. కుల గణన జరగకూదని కొందరు కుట్రలు పన్నారు. అందులో భాగంగానే తప్పుడు ప్రచారాలు చేశారు. అయితే ప్రభుత్వంపై నమ్మకంతో వాటిని తిప్పికొట్టిన ప్రజలకు కృతజ్ఞతలు. అతి త్వరలోనే సర్వే జరిగిన తీరు, సమాచారన్ని వెల్లడిస్తాం’’ అని చెప్పారు డిప్యూటీ సీఎం.