గ్రూప్-1 గలాటా.. ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్న పోలీసులు

తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ పరీక్షను రద్దు చేయాలంటూ ఔత్సాహికులు ధర్నాలు, నిరసనలకు దిగుతున్నారు.

Update: 2024-10-20 07:39 GMT

తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ పరీక్షను రద్దు చేయాలంటూ ఔత్సాహికులు ధర్నాలు, నిరసనలకు దిగుతున్నారు. ఈరోజు అశోక్ నగర్‌లో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు. సోమవారమే మెయిన్స్ పరీక్ష జరగనున్న క్రమంలో వీరు తమ నిరసనను ఉద్రిక్తతం చేశారు. ఈ సందర్భంగానే వారు సీఎం రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పినట్టే చెప్పి తమపైకి పోలీసులను ఉసుగొల్పుతున్నారంటూ సీఎం రేవంత్‌పై మండిపడుతున్నారు. వారి ఆందోళన తెలుపుతున్న విషయం తెలిసిన వెంటనే భారీ సంఖ్యలో పోలీసులు అశోక్‌నగర్ చౌరస్తాను మొహరించారు. గ్రూప్-1 అభ్యర్థులు నిరసన, ఆందోళనను విరమించుకోవాలని కోరారు. తాము బాగుందని ఆందోళన చేయట్లేదని, కడుపు రగిలి రోడ్డెక్కామంటూ గ్రూప్-1 అభ్యర్థులు పోలీసులకు బదులిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు, గ్రూప్-1 అభ్యర్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని అక్కడ తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది.

రిజర్వేషన్ పొందే వారికి ఆ హక్కు లేదు..

ఈ సందర్బంగా వాళ్లు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల గొంతు కోస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మానసిక ఒత్తిడిని ఎదుర్కొంగున్నామని, జీవో 29వల్ల రిజర్వేషన్ పొందేవారికి ఓపెన్ కేటగిరిలో ఉద్యోగం పొందు హక్కు లేదని వారు వివరించారు. ఈ సందర్భంగానే 95శాతం హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ అయ్యాయన్న వార్తలపై స్పందిస్తూ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్నంత మాత్రాన తాము పరీక్ష రాయమని స్పష్టం చేశారు. తమను పిలిపించుకుని తమ బాధలను సీఎం వినాలని కోరారు. ‘‘ప్రతిపక్షాలతో మాట్లాడే బదులు మాతోనే మాట్లాడండి సీఎం. ఆర్థికంగా, మానసికంగా చితికిపోయి ఉన్నాం. మా బాధ వినండి. తెలుసుకోండి. మాకున్న చివరి అవకాశం చేజార్చకండి. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? దయచేసి ఆలోచించండి’’ అని ప్రాధేయపడ్డారు.

ప్రెస్‌మీట్‌కు పోలీసుల అడ్డం..

ఆదివారం ఉదయం నుంచి ఆందోళన తెలుపుతున్న గ్రూప్-1 అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కాగా వారు అనుకున్న ప్రెస్ మీట్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పలువురుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ ప్రెస్‌మీట్‌లో గ్రూప్-1 అభ్యర్థులు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టనున్నారన్న సమాచారం రావడంతోనే పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారని గ్రూప్-1 అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అరెస్ట్‌లు కేసుల ద్వారా తమ నోటిని నొక్కేయలేరని అన్నారు.

Tags:    

Similar News