మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తెలుగు రాష్ట్రాలలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (DROUPADI MURMU) డిసెంబర్ 17న ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు.
By : The Federal
Update: 2024-12-17 12:50 GMT
తెలుగు రాష్ట్రాలలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (DROUPADI MURMU) డిసెంబర్ 17న ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం వద్ద రాష్ట్రపతి ముర్ముకి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. విమానాశ్రయంలో పోలీసు గౌరవవందనం స్వీకరించిన అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి ఎయిమ్స్‌కు చేరుకున్నారు. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విద్యా సంస్థ(ఎయిమ్స్) స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబరు 17 నుంచి ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పర్యటించనున్నారు. ఆమె పర్యటన సందర్భంగా హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) స్నాతకోత్సవంలో పాల్గొన్న తర్వాత హైదరాబాద్ బయలు దేరి వెళ్లనున్నారు.
ఎయిమ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆడిటోరియంలో జరిగిన స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రధాన ప్రసంగం చేశారు. విద్యార్థులకు అవార్డులు బహుకరించారు. బంగారు పతకాలను అందజేశారు.
రాష్ట్రపతి ముర్ముతో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్, ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రి నారా లోకేష్ తదితరులు రాష్ట్రపతి పాల్గొన్న సభలో ఉన్నారు.
49 మంది MBBS విద్యార్థులతో పాటు నలుగురు పోస్ట్-డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు విద్యార్థులు తమ డిగ్రీలను అందుకున్నారు.
ఇక,హైదరాబాద్ లో రాష్ట్రపతి రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయం వైపు దారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.