తీహార్ జైల్లో కవిత, రెండు రోజులు ఎలా గడిపారో తెలుసా ?
మొన్నటి అసెంబ్లీ ఎన్నికలవరకు పదేళ్ళపాటు ఆకాశమే హద్దుగా అపరిమితమైన అధికారాలను అనుభవించిన కల్వకుంట్ల కవిత తీహార్ జైలులో సాధారణ ఖైదీ.
విధి అందరికన్నా బలీయమైనది. ఎంతటి బలవంతులైనా సరే కాలం ముందు తలొంచాల్సిందే తప్ప వేరేదారిలేదు. ఇపుడిదంతా ఎందుకంటే కల్వకుంట్ల కవితగురించే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలవరకు పదేళ్ళపాటు ఆకాశమే హద్దుగా అపరిమితమైన అధికారాలను అనుభవించిన వారిలో కల్వకుంట్ల కవిత కూడా ఒకరు. అలాంటి కవిత పరిస్ధితి ఈరోజు ఏమిటంటే ఢిల్లీలోని తీహార్ జైలులో సాధారణ ఖైదీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన కవితకు రౌస్ ఎవిన్యు కోర్టు రిమాండ్ విధించింది. దాంతో ఏప్రిల్ 9వ తేదీవరకు కవిత తీహార్ జైలులోనే ఉండాలి. రాజకీయ ఖైదీ హోదాలో కవితకు కొన్ని సౌకర్యాలను కల్పించమని కోర్టు ఆదేశించింది.
అయితే ఆ ఆదేశాలు ఇంకా జైలు ఉన్నతాధికారులకు అందని కారణంగా ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు అందలేదని జైలువర్గాల సమాచారం. దాంతో మంగళ, బుధవారాలు మిగిలిన సాధారణ ఖైదీల్లాగే కవిత కూడా గడపాల్సొచ్చింది. ప్రత్యేక ఖైదీగా కవితకు ఇంటి భోజనం, ప్రత్యేక గది, బంగారు ఆభరణాలు వేసుకునే సౌలభ్యాన్ని కల్పించమని కోర్టు ఆదేశించింది. అయితే జైలులో బుధవారం మొదటిరోజు కవిత ఎలా గడిపారు ? ఎలాగంటే ముగ్గురు ఖైదీలతో కవిత గదిని పంచుకోవాల్సొచ్చింది. మిగిలిన ఖైదీల్లాగే లైనులో నిలబడి భోజనం అందుకున్నారు. మొదటిరోజు పప్పు, అన్నం మాత్రమే తిన్నారు. ఉదయం టీ, స్నాక్స్ తీసుకున్నారు. అందరి ఖైదీలకు పెట్టే భోజనాన్నే కవిత కూడా తిన్నారు. తన సహచర ఖైదీలతో ముచ్చట్లు చెబుతు రెండు రాత్రుళ్ళు గడిపారు.
కోర్టు ఆదేశాలు అందలేదుకాబట్టి కవితను జైలు అధికారులు ప్రత్యేక ఖైదీగా పరిగణించలేదు. దాంతో కోర్టు ఆదేశించినట్లుగా ప్రత్యేకభోజనం లేదు, ప్రత్యేక గది కూడా దక్కలేదు. ఎలాంటి వీవీఐపీ ట్రీట్మెంట్ లేకుండానే గడిపేశారు. కాలం అందరినీ సమానంగానే చూస్తుందన్న విషయం జైలులో కవిత మొదటిరోజులు గడిపిన విధానం చూస్తే అర్ధమవుతోంది. తనకు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కవిత కలలో కూడా అనుకునుండరు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని కవిత ఆకాశమే హద్దుగా పదేళ్ళు చెలరేగిపోయారనే ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి. కవిత నిజామాబాద్ ఎంపీ తర్వాత ఎంఎల్సీ అనే పదవులు ప్రోటోకాల్ కు మాత్రమే కాని అసలైన హోదా కేసీయార్ కూతురనే.
ఈ హోదాలోనే అపరిమితమైన అధికారాలను అనుభవించారని ఆరోపణలున్నాయి. కాలం అందరిని సమానంగానే చూస్తుందన్నట్లుగా అధికారంతో చెలరేగిపోయిన కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తగులుకున్నారు. అప్పటినుండి కష్టాలు మొదలయ్యాయి. ముందు సీబీఐ తర్వాత ఈడీ ఉన్నతాధికారులు విచారించారు. తర్వాత విచారణకు రమ్మంటే హాజరుకాకుండా దాదాపు ఏడాదికాలం తప్పించుకున్నారు. విచారణ నుండి తప్పించుకునేందుకు కోర్టుల్లో కేసులు వేశారు. కవితను ఈడీ అరెస్టుచేయకపోవటం కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఇష్యూ అయిపోయింది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది కాబట్టే కవితను అరెస్టుచేయటం లేదన్న కాంగ్రెస్ ఆరోపణలను జనాలు కూడా నమ్మారు. బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాల్లో కవిత లిక్కర్ స్కామ్ కూడా ఒకటి.
అలాంటి కవిత ఈరోజు కరుడుగట్టిన ఖైదీలుండే తీహార్ జైలులో సాధారణ జీవితాన్ని గడిపారంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. కాని వాస్తవం అయితే ఇదే. జైలుకు వచ్చిన మొదటిరోజు కాబట్టి కవితను కలుసుకునేందుకు అధికారులు బుధవారం బయటవాళ్ళని ఎవరినీ అనుమతించలేదు. 14 రోజుల రిమాండు మీద తీహార్ జైలుకు వెళ్ళిన మొదటి ఖైదీ కవితే. కాబట్టి కోర్టు ఆదేశాలు అందిన తర్వాత కవిత దినచర్య మారుతుందేమో చూడాలి.
ఇదే విషయమై రాజకీయ విశ్లేషకులు రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ కోలాహలం రామకిషోర్ మాట్లాడుతు ఖైదీలకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది జైలు మాన్యువల్ బట్టే ఉంటుందన్నారు. కవిత విచారణ ఖైదీనే కాబట్టి శిక్షలుపడిన ఇతర ఖైదీల్లాగ చూడరన్నారు. మందులు కూడా జైలు డాక్టర్ ఇచ్చినవే వాడాలని చెప్పాలి. అసలీ కేసు నిలుస్తుందనే నమ్మకం కూడా లేదన్నారు. ప్రతిపక్షాల నేతలను టార్గెట్ చేయటం ద్వారా అందరినీ బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కవిత అరెస్టు కూడా ఇందులో భాగమే అన్నారు.