రేవంత్ కష్టానికి ఎంఎల్ఏల తూట్లు

నియోజకవర్గాల్లో ఆధిపత్య గొడవలు పడుతు ప్రభుత్వానికి దక్కాల్సిన మైలేజి దక్కకుండా చేస్తున్నారు.;

Update: 2025-02-07 06:37 GMT
Revanth reddy

రేవంత్ ఏడాది కష్టానికి సరైన ఫలితాలు రాకుండా కొంతమంది ఎంఎల్ఏలు తూట్లు పొడుస్తున్నారు. నియోజకవర్గాల్లో ఆధిపత్య గొడవలు పడుతు ప్రభుత్వానికి దక్కాల్సిన మైలేజి దక్కకుండా చేస్తున్నారు. ఈ విషయమై గురువారం జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సీఎల్పీ)(CLP) సమావేశంలో రేవంత్ డైరెక్టుగానే ప్రస్తావించాడు. ఎంఎల్ఏలు గ్రూపులుగా భేటీలవ్వటంపై మండిపోయారు. ఒకపుడు గులాంనబీ ఆజాద్ ఆధ్వర్యంలో ఏఐసీసీలోని సీనియర్ నేతలు 23 మంది గ్రూపు సమావేశాలు పెట్టడాన్ని ప్రస్తావించారు. ఆజాద్ గ్రూప్ మీటింగులు పెట్టినపుడు కూడా ఏఐసీసీ నాయకత్వం సీరియస్ అయిన విషయాన్ని రేవంత్(Revanth) గుర్తుచేశారు. కాబట్టి ఇకనుండి గ్రూపు మీటింగులు పెట్టడంకాకుండా ఏదైనా మాట్లాడాలంటే తనతో, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh) లేదా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(AICC president Mallikarjuna Kharge), ఇన్చార్జీలతోనే మాట్లాడాలని స్పష్టంగా తేల్చిచెప్పేశారు.

పనిలోపనిగా మరోవిషయాన్ని కూడా రేవంత్ స్పష్టంచేశారు. అదేమిటంటే ఏడాదిలో ప్రభుత్వంచేసిన మంచిపనులను ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయామని. ఈ విషయం నూరుశాతం నిజమనటంలో సందేహంలేదు. కులగణన సర్వే రిపోర్టును బయటపెట్టడం, ఎస్సీల వర్గీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అన్నది నిజంగా డేరింగ్ స్టెప్ అనే అనుకోవాలి. బీఆర్ఎస్ హయాంలో కూడా సమగ్రకులగణన సర్వే జరిగినా కేసీఆర్(KCR) ఆ నివేదికను బయటపెట్టలేదు. ఎన్నికలముందు ఇచ్చిన ఆరుగ్యారెంటీల్లో కొన్నింటిని పూర్తిగాను, మరికొన్నింటిని పాక్షికంగాను అమలుచేస్తోంది. అయితే సిక్స్ గ్యారెంటీస్ అంతా పచ్చిమోసమని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలే ఎక్కువగా ప్రచారంలో ఉంది. తమప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలకు సంబంధించిన ప్రచారం జరగాల్సినంత స్ధాయిలో జరగలేదు. దీనికి ప్రధానకారణం ఏమిటంటే మంత్రులు-ఎంఎల్ఏలకు సరైన సమన్వయం లేకపోవటమే.

మంత్రులు జిల్లాల్లోను, ఎంఎల్ఏలు నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసం పోరాటాలు చేస్తున్నారు. పదేళ్ళ తర్వాత అధికారంలోకి రావటంతో కరువును తీర్చుకోవటంలో ఎవరికివారు బిజీగా ఉన్నారు. ఈకారణంగా ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను జనాల్లోకి తీసుకెళ్ళే విషయాన్ని చాలామంది గాలికొదిలేశారు. ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీమంత్రి హరీష్ రావు(Harish) పదేపదే ప్రతిరోజు టైంటేబుల్ ప్రకారం ప్రభుత్వంపై ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టడంలో మంత్రులు, ఎంఎల్ఏలు చూపించాల్సినంత చొరవ చూపించటంలేదు. దాంతో మీడియాలో బీఆర్ఎస్ ఆరోపణలే బాగా హైలైట్ అవుతున్నాయి. మొన్నటికిమొన్న ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ఒక పోల్ నిర్వహించింది. సర్వే ఏమిటంటే ‘ఫామ్ హౌస్ పాలన కావాలా ? లేక ప్రజాపాలన కావాలా’ ? అన్నది టాపిక్. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోల్ లో 67శాతం మంది ఫామ్ హౌస్ పాలన కావాలని ఓట్లేశారు.

కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోల్ లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఫలితాలు వస్తాయని అందరు ఊహించారు. అయితే అందుకుభిన్నంగా కేసీఆర్ ఫామ్ హౌస్ కావాలని మెజారిటి ఓట్లు వచ్చాయి. దీంతోనే కాంగ్రెస్ పార్టీ చేతకానితనం ఏమిటో బయటపడింది. తమపోల్ ను బీఆర్ఎస్ హైజాక్ చేసి ప్రజాపాలనకు వ్యతిరేకంగా నెటిజన్ల మద్దతును బీఆర్ఎస్ కూడగడుతోందని కాంగ్రెస్ నేతలు తెలుసుకోలేకపోవటమే అతిపెద్ద ఫెయిల్యూర్. నిజానికి ఇలాంటి పోల్స్ వల్ల ఎవరికీ ఎలాంటి లాభాలుండవు. కాని ఓ నాలుగురోజుల పాటు జనాల్లో చర్చయితే జరుగుతుంది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జనాల్లో చర్చలు జరగటమే బీఆర్ఎస్ కు కావాల్సింది. అందులో కారుపార్టీ నేతలు నూరుశాతం సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏల వల్ల కూడా పది నియోజకవర్గాల్లో గొడవలవుతున్నాయి. ఇలాంటి అనేక పరిణామాల కారణంగా ప్రభుత్వానికి రావాల్సినంత పాజిటివ్ మైలేజీ రావటంలేదన్నది మాత్రం వాస్తవం.

కొన్నిపథకాలను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా అమలుచేస్తూ కూడా పాజిటివ్ ప్రచారం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నదంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరిగోల వాళ్ళది కాబట్టే. ఎవరూ ఎవరిమాటా వినరు. ఏకతాటిపైన నడవటం అన్నది కాంగ్రెస్ నేతల్లో చాలా అరుదు. పార్టీలో ఎవరితోను ఎవరికీ సమన్వయం అన్నది పెద్దగా ఉండదు. అందుకనే ప్రభుత్వం తరపున కాకుండా వ్యక్తిగత మైలేజీ కోసమే చాలామంది ప్రయత్నిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాంటిది. నూరుశాతం ప్రజాస్వామ్యంతో నడిచేపార్టీ కాబట్టి ఎవరిమీదా ఎవరి అదుపూ ఉండదు. అందరూ సమన్వయంతో పనిచేయాలని ఎంతమంది ముఖ్యనేతలు చెప్పినా చెవిటివాడిముందు శంఖం ఊదినట్లే అవుతుంది. అందుకనే రేవంత్ ఏడాది కష్టానికి కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచేస్తోంది. ప్రభుత్వంచేసే మంచిపనులను, అమలుచేస్తున్న పథకాలను జనాల్లోకి తీసుకెళ్ళే బాధ్యత తమదే అని పార్టీలోని ప్రజాప్రతినిధుల్లో చాలామంది మరచిపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

Tags:    

Similar News