నీతి అయోగ్ భేటీకి రేవంత్ డుమ్మా.. కాంగ్రెస్ స్పందన కోరిన కేటీఆర్
నీతి అయోగ్ సమావేశానికి గైర్హాజరు కానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం వెంటనే బడ్జెట్‌ను సవరించాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో ఈరోజు జరగనున్న నీతి ఆయోగ్ కీలక భేటీకి పలు రాష్ట్రాల సీఎంలు గైర్హాజరు కానున్నారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తమ రాష్ట్రాలకు జరిగిన అన్యాయానికి నిరసనగానే ముఖ్యమంత్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వారిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. కేంద్రం.. తెలంగాణపై కక్ష్య పెట్టుకునే బడ్జెట్‌లో గుడ్డు సున్నా ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు రేవంత్. అందుకే తాము నీతి అయోగ్ సమావేశానికి హాజరు కానని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు రేవంత్. చెప్పినట్లే ఈరోజు ఢిల్లీ వేదికగా జరిగే నీతి అయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టనున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యే అంశంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వింద్ సుక్కు, కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా రేవంత్ బాటలో వెళ్తున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.
రేవంత్ మాత్రం డుమ్మా..!
నీతి అయోగ్ భేటీని పలు రాష్ట్రాల సీఎంలు బాయ్‌కాట్ చేస్తున్నారు. వారిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. తాను నీతి అయోగ్ భేటీకి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశవారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, అందుకు నిరసనగానే ఈ భేటీని బాయ్‌కాట్ చేస్తున్నామని ఆయన వివరించారు. అంతేకాకుండా తెలంగాణపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్న కేంద్రం తీరును ఎండగడతామని, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలే టార్గెట్‌గా అన్యాయం చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఆయా రాష్ట్రాలకు కూడా న్యాయం చేస్తూ వెంటనే బడ్జెట్‌ను సవరించాలని కూడా రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
రేవంత్‌ను ప్రశ్నించిన కేటీఆర్..
తన దాక వస్తే కానీ బాధ తెలియదు అన్న నానుడిని.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ అక్షర సత్యం చేస్తుందంటూ రేవంత్ సర్కార్‌ను బీఆర్‌ఎస్ ఎద్దేవా చేసింది. నీతి అయోగ్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేసిన అంశంలో సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇదే విధంగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానితో ఇలాంటి సమావేశాలకు దూరంగా ఉండేవారని, అప్పుడు కాంగ్రెస్ తమ సీఎం తీరును తీవ్రంగా విమర్శించేదని గుర్తు చేశారు కేటీఆర్. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నదీ అదేనని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు.