రాహుల్ గాంధీకి కూడా ఏచూరి మార్గదర్శకుడే...

రాష్ట్రాలు హక్కుల కోసం పోరాడుతున్నపుడు ఏచూరి లేకుండాపోయారు: రేవంత్

Update: 2024-09-21 08:01 GMT
Revanth in Yechuri samsarana Sabha

కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం దేశానికి తీరని లోటుగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. దేశం క్లిష్టపరిస్ధితుల్లో ఉన్నపుడు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణించటం చాలా బాధాకరమని రేవంత్ అన్నారు. సీతారాం ఏచూరి సంస్మరణ సభ రవీంద్రభారతిలో శనివారం ఉదయం జరిగింది.


"ప్రజాస్వామిక వేదికలపై భారత కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి సీతారాం ఏచూరిఅంటూ ఆయనను కలిసి మాట్లాడినప్పుడు కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గుర్తొచ్చేవారని ముఖ్యమంత్రి అన్నారు. దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి గారి సమకాలికుడుగా సీతారాం ఏచూరి ఉండేవారు. ఇపుడు దేశంలో జమిలి ఎన్నికల ముసుగులో దేశంలో ఆధిపత్యం చేలాయించాలన్న కుట్ర జరుగుతోంది.. జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబాలించాలనుకుంటున్న ఇలాంటి కీలక సమయంలో ఆయన లేకపోవడం దేశ రాజకీయాల్లో తీరని లోటు," అని రేవంత్ అన్నారు.


యూపీఏ హయాంలో పేదలకు ఉపయోగపడే కీలక బిల్లులకు మద్దతు తెలపడంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారని  అంటూ  కాంగ్రెస్ అధినేత  రాహుల్ గాంధీ కూడా ఆయన్ను మార్గానిర్దేశకుడిగా భావిస్తారని  రేవంత్ చెప్పారు.

"రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన ఇలాంటి సందర్భంలో ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు . మనకు దిక్సూచీలా ఉండాల్సిన సమయంలో ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం,"  అని ముఖ్యమంత్రి అన్నారు.

అంతకుముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతు ఉద్యమం నుండి వచ్చిన బిడ్డలుగా ఏచూరితో తమ బంధం రక్తసంబంధమన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం చివరివరకు పోరాడిన ఏచూరి తమలాంటి వారికి ఆదర్శమన్నారు. ఎప్పుడు కండువాలు మార్చుతారో తెలీని ఈ కాలంలో కూడా ఏచూరి జీవితం స్పూర్తిదాయకం అని కేటీఆర్ చెప్పారు. ఫిరాయింపుల కాలంలో పదవుల కోసం కాకుండా సిద్ధాంతాల కోసమే ఏచూరి జీవించిన గొప్ప నాయకుడన్న విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలన్నారు. ఓట్ల రాజకీయంలో వెనకబడినా ప్రజల కోసం పోరాటాలు చేయటంలో ముందుంటామని చాటిచెప్పిన వ్యక్తి ఏచూరిగా కేటీఆర్ వర్ణించారు. సంస్మరణ సభకు రేవంత్ వస్తున్నాడని తెలుసుకుని కేటీఆర్ తన ప్రసంగాన్ని క్లుప్తంగా చేసి సభ నుండి వెళ్ళిపోయారు. ఈ సభకు కోదండరామ్, తమ్మినేని వీరభద్రం, బీవీ రాఘవులు, మోహన్ కందా, నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లురవి, జూబ్లీహిల్స్ ఎంఎల్ఏ మాగంటి గోపి తదితరులు హాజరయ్యారు.

Tags:    

Similar News