జపాన్ లో రేవంత్ తొలిరోజు పర్యటన సక్సెస్
ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పట్టున్న వ్యాపార దిగ్గజకంపెని మారుబేని యాజమాన్యం రేవంత్ తో అవగాహనా ఒప్పందం చేసుకున్నది;
పెట్టుబడులకోసం జపాన్ లో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి మొదటిరోజు పర్యటన సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పట్టున్న వ్యాపార దిగ్గజకంపెని మారుబేని యాజమాన్యం రేవంత్ తో అవగాహనా ఒప్పందం చేసుకున్నది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ(Future City)లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబేని తన సంసిద్ధతను వ్యక్తంచేసింది. టోక్యో(Tokyo)లో జరిగిన సమవేశంలో కంపెనీ ప్రతినిధులు రేవంత్ తో భేటి అయి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు రు. వెయ్యి కోట్లు పెట్టుబడిపెట్టేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పారు.
ఫ్యూచర్ సిటీలో దశలవారీగా మారుబేని తన వ్యాపారాన్ని విస్తరించబోతోంది. 600 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీలో ప్రపంచస్ధాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ను అభివృద్ధిచేసేందుకు తయారు చేసిన ప్రతిపాదనలను కంపెనీ ప్రతినిధులు రేవంత్(Revanth) కు వివరించారు. ఈమేరకు లెటర్ ఆఫ్ ఇండింట్ పై కంపెనీ ప్రతినిధులు, తెలంగాణ(Telangana) ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. మారుబేని(Marubeni) గనుక ఫ్యూచర్ సిటీలో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తే ప్రపంచంలోని మరిన్ని మల్టీనేషనల్ కంపెనీలు ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయని మరుబేని ప్రతినిధులు వివరించారు. సుమారు రు. 5 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేందుకు అవకాశాలున్నట్లు కంపెనీ ఆశాభావాన్ని వ్యక్తంచేసింది.
తెలంగాణలోని నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు తాము అవసరమైన ప్రణాళికలను రెడీచేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. రేవంత్ మాట్లాడుతు హైదరాబాద్(Hyderabad) లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి మారుబేని కంపెనీకి స్వాగతం పలికారు. కంపెనీ రాకతో సుమారు 30 వేలమందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశముందని చెప్పారు. తెలంగాణలో వ్యాపారాల అభివృద్ధికి తగిన వాతావరణం ఉందని రేవంత్ కంపెనీ ప్రతినిధులకు వివరించారు. భారతదేశంతో జపాన్ తో సంవత్సరాలుగా మంచి సంబంధాలున్న విషయాలను రేవంత్ గుర్తుచేశారు.
మారుబేని ప్రపంచవ్యాప్తంగ 65 దేశాల్లో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్, కెమికల్స్, మౌళిక సదుపాయాలు, ఫైనాన్స్, లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాల్లో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగ తమ కంపెనీల ద్వారా ఇప్పటికే 50 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది.