తెలంగాణ అసెంబ్లీలో సీతక్క విశ్వరూపం
తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) బడ్జెట్ సమావేశాల్లో ప్రధానప్రతిపక్షం బీఆర్ఎస్ ఎంఎల్ఏలను మంత్రి తనదైన శైలిలో ధీటుగా ఎదుర్కొంటున్నారు;
సూటిగా, స్పష్టంగా ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పటంలో మంత్రి సీతక్క స్టైలే సపరేటు. తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) బడ్జెట్ సమావేశాల్లో ప్రధానప్రతిపక్షం బీఆర్ఎస్ ఎంఎల్ఏలను మంత్రి తనదైన శైలిలో ధీటుగా ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ తరపున హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల కవిత ఆరోపణలు, విమర్శలను మంత్రి గట్టిగా తిప్పికొడుతున్నారు. ప్రభుత్వం తరపున సభలో రేవంత్ రెడ్డి(Revanth) చాలా అనర్ఘళంగా మాట్లాడగలరు. రేవంత్ తరువాత మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కొండా సురేఖ లాంటి వాళ్ళు కూడా గట్టిగానే మాట్లాడుతారు. అయితే ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పటంలోను, ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టడంలో వ్యక్తిగత దూషణలకు దిగేస్తున్నారు. దాంతో సభాసమయం చాలావరకు వృధా అవుతోంది.
అయితే సీతక్క(Seethakka)మాత్రం కేవలం సబ్జెక్టుకు మాత్రమే పరిమితమవుతున్నారు. సబ్జెక్టుకు పరిమితం అవుతూనే పదేళ్ళ బీఆర్ఎస్(BRS MLAs) అధికారంలో ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఆ తప్పులను అధిగమించేందుకు తమ ప్రభుత్వచేస్తున్న ప్రయత్నాలను వివరిస్తున్నారు. దాంతో బీఆర్ఎస్ సభ్యులు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. హరీష్ రావు సభలో మాట్లాడుతు సంక్షేమ హాస్టళ్ళు, గిరిజన హాస్టళ్ళ నిర్వహణలో ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దాన్ని సీతక్క ధీటుగా ఎదుర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో సంక్షేమహాస్టళ్ళ నిర్వహణను వివరించారు. పెండింగ్ పెట్టిన వేలాది కోట్లరూపాయల బిల్లులను గుర్తుచేశారు. తమప్రభుత్వం వచ్చాక ఎన్నిబిల్లులను క్లియర్ చేశారో లెక్కలతో సహాచెప్పారు. బీఆర్ఎస్ హయంలో సంక్షేమహాస్టళ్ళు ఎలాంటి దుస్ధితిలో ఉండేవన్న విషయాలను ఆధారాలతో సహా వివరించారు. తమ 15 నెలల పాలనలో హాస్టళ్ళను బాగుచేయటానికి చేస్తున్న ప్రయ్నతాలను వివరించటంతో హరీష్ మళ్ళీ నోరెత్తలేదు.
కల్వకుంట్ల కవిత శాసనమండలిలో మాట్లాడుతు కాంగ్రెస్(Telangana Congress) హయాంలో కరప్షన్ గురించి మాట్లాడారు. ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్న కవితకు సీతక్క గట్టిగా బదులిచ్చారు. ఆధారాలు లేకుండా ఆరోపణలతో ప్రభుత్వంపై బురదచల్లటం కేసీఆర్ ఫ్యామిలీకి అలవాటుగా మారిందని వాయించేశారు. కరప్షన్ డీఎన్ఏ అన్నది కేసీఆర్ ఫ్యామిలీలోనే ఉందన్నారు. అలా చెబుతునూ ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) లో కవిత పాత్రగురించి సుమారు ఏడుమాసాలు తీహార్ జైలు(Teehar Jail)లో ఉన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఎప్పుడైతే మంత్రి లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించారో తర్వాత కవిత నోరు పెగలలేదు. ఇక కౌశిక్ రెడ్డితో లైఫ్ స్టైల్ గురించి మాట్లాడారు. మంత్రులు విలాసాల్లో ముణిగితేలుతున్నారని, ప్రజల సమస్యలను పట్టించుకోవటంలేదంటు సీతక్క గురించి ప్రస్తావించారు. కౌశిక్ ఆరోపణలపై మంత్రి స్పందిస్తు ‘తమ్ముడు లైఫ్ స్టైల్ వేరు తన లైఫ్ స్టైల్ వేర’న్నారు. తన నేపధ్యంగురించి తెలిసిన వాళ్ళెవరూ తాను విలాసాల్లో ముణిగితేలుతున్నట్లు ఆరోపణలు చేయరన్నారు. తనతో పాటు మంత్రులందరు నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తున్న విషయాన్ని ఉదాహరణలతో సహా వివరించారు.
తాను 500 గజాల స్ధాలంలో కట్టుకున్న ఇంట్లో ఉంటున్నానని, మంత్రి మాత్రం 5 ఎకరాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కట్టిన ప్యాలెస్ లో ఉంటున్నట్లు కౌశిక్ మళ్ళీ ఆరోపించారు. దానికి మంత్రి బదులిస్తు 5 ఎకరాల స్ధలంలో ఉన్న ఇంటిని తాను కట్టుకోలేదన్నారు. వైఎస్సార్ నిర్మించిన ఇంటిని తనకు అధికారిక నివాసంగా ప్రభుత్వం కేటాయిస్తే అందులో తాను ఉంటున్న విషయాన్ని తమ్ముడు కౌశిక్ మరచిపోయినట్లున్నాడంటు చురకలు వేశారు. తన సొంతింటికి, కౌశిక్ ఉంటున్న 500 గజాల ఇంటిని పోల్చిచూసినపుడు తామిద్దరి లైఫ్ స్టైల్ ఏమిటో అందరికీ అర్ధమవుతుందన్న సీతక్క సమాధానానికి కౌశిక్ మళ్ళీ నోరెత్తలేదు. ఈ విధంగా సభలో బీఆర్ఎస్ సభ్యుల ఆరోపణలు, విమర్శలను మంత్రి సీతక్క ధీటుగా ఎదుర్కొంటున్నారు.