SHE TEAMS | రాచకొండలో పోకిరీల భరతం పట్టిన షీ టీమ్

రాచకొండ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్ పోకిరీల భరతం పట్టింది. బస్టాండ్లు,స్టేషన్లు,కళాశాలలు,బహిరంగ ప్రదేశాల్లో అమ్మాయిలను వేధిస్తుండగా షీ టీమ్ వారి ఆట కట్టించింది.;

Update: 2025-02-14 07:47 GMT
ఈవ్ టీజర్ల వేధింపులు (ఫోటో : షీ టీమ్ సౌజన్యంతో)

రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో (Rachakonda)ఇటీవల అమ్మాయిలపై పోకిరీల వేధింపులు పెచ్చుపెరిగాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు,మెట్రో స్టేషన్లు, పాఠశాలలు, కళాశాలలు, కూరగాయల మార్కెట్లు,పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో అమ్మాయిలు, మహిళలను పోకిరీలు (Eve Teasers)వెంబడిస్తూ లైంగికంగా వారిని వేధిస్తున్నారు. మహిళలను వేధించే పోకిరీల భరతం పట్టేందుకు షీ టీమ్స్ (SHE TEAMS)డెకాయ్ ఆపరేషన్లు చేపట్టాయి.


మఫ్టీలో రంగంలోకి దిగిన షీ టీమ్
అమ్మాయిలను వెంబడించి వారిని వేధించే పోకిరీలను సాక్ష్యాధారాలతో పట్టుకునేందుకు షీ టీమ్ పోలీసులు మఫ్టీలో రంగంలోకి దిగారు. అమ్మాయిలపై ఈవ్ టీజింగ్ పెరగడంతో షీ టీమ్ కు వచ్చే ఫిర్యాదు లు కూడా పెరిగాయి. ఒక్క జనవరి నెలలోనే రాచకొండ షీ టీమ్ కు 170 ఫిర్యాదులు వచ్చాయి. ఫోన్ల ద్వారా 33 ఫిర్యాదులు, సోషల్ మీడియా యాప్ ద్వారా 40 మంది వేధించారని మహిళలు ఫిర్యాదు చేశారు. మరో 97 మంది అమ్మాయిలు తమను ఈవ్ టీజర్లు వేధించారని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.



 163 మంది పోకిరీలపై కేసులు

నెలరోజుల్లో మహిళలను వేధించిన 163 మందిని పట్టుకొని వారిపై కేసులు నమోదు చేశామని మహిళా సేఫ్టీ విభాగం డీసీపీ టి ఉషా విశ్వనాథ్ చెప్పారు. అమ్మాయిలను వేధించిన వారిలో 98 మంది మేజర్లు ఉండగా, 65 మంది మైనర్లు నిందితులని షీ టీమ్ పోలీసులు తేల్చారు. పోకిరీలను వారి కుటుంబసభ్యులు సమక్షంలోనే సీపీ క్యాంప్ కార్యాలయానికి పిలిపించి కౌన్సెలర్స్ తో కౌన్సెలింగ్ నిర్వహించారు.

పెళ్లి చేసుకోమంటూ వెంటపడిన యువకుడి అరెస్ట్
ఓ మహిళ భర్తతో విబేధాలు రావడంతో పుట్టింట్లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. ఒకే ఆఫీసులో పనిచేసే ఓ యువకుడితో మహిళకు పరిచయం ఏర్పడింది. దీంతో తనను పెళ్లి చేసుకోమంటూ యువకుడు మహిళ వెంట పడుతున్నాడు. విసిగిపోయిన మహిళ షీ టీమ్ కు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

ప్రేమ పెళ్లి పేరుతో అత్యాచారం
ఓ యువతి నర్సుగా ఆసుపత్రిలో పనిచేస్తుంది. అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానంటూ నర్సును లోబర్చుకున్నాడు.పలు సార్లు యువతిని శారీరకంగా అనుభవచి, ఆపై పెళ్లికి నిరాకరించాడు.ఈ విషయం ఎవరికైనా చెబితే యువతి వ్యక్తిగత ఫొటోలు అందరికీ పంపించి పరువు తీస్తానని బెదిరించాడు. యువతి ఫిర్యాదు మేర షీ టీమ్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి పంపించారు.మరో కేసులో ప్రేమ పెళ్లి పేరుతో మోసపోయి యువకుడి వలలో పడి అతనితో లైంగిక సంబంధం పెట్టుకున్న మరో యువతి కూడా షీ టీమ్ కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని కూడా అరెస్ట్ చేశారు. ప్రేమ పెళ్లి పేరుతో యువతులను మోసగించి వారిని శారీరకంగా వాడుకుంటున్న యువకుల సంఖ్య ఇటీవల పెరిగిందని షీ టీమ్ పోలీసులు చెప్పారు.

బస్టాండులో పోకిరీల వేధింపులు
భువనగిరి బస్టాండులో అమ్మాయిలను వేధిస్తున్నారని షీ టీమ్ కు ఫిర్యాదు రాగా వారు హుటాహుటిన వెళ్లి పోకిరీలను పట్టుకొని వారిపై కేసు నమోదు చేశారు. మెట్రోరైళ్లలో మహిళలు ప్రయాణిస్తున్న కంపార్టుమెంట్లలోకి ఎక్కిను 13 మంది యువకులను షీ టీమ్ పోలీసులు పట్టుకొని వారికి మెట్రో రైలు అధికారుల ద్వారా జరిమానా వేయించారు.

మార్ఫింగ్ ఫొటోలు పంపించి...
పన్నెండేళ్ల బాలిక తన నానమ్మ ఫోనులో సోషల్ మీడియా యాప్ డౌన్ లోడ్ చేసింది. ఓ యువకుడి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే దాన్ని యాక్సెప్ట్ చేసింది. దీంతో ఆ యువకుడు కొన్ని ఫొటోలు స్క్రిన్ షాట్ తీసుకొని వాటిని హార్ఫింగ్ చేసి అమ్మాయికి పంపించాడు. అమ్మాయి ఫ్రైవేటు ఫొటోలు పంపించకుంటే మార్ఫింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని చెప్పి బెదిరించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేర షీటీం నిందితుడిపై కేసు నమోదు చేసింది.

కామాంధుడికి కటకటాలు
ఓ తండ్రి కామంతో కళ్లు మూసుకుపోయి తన ముగ్గురు కుమార్తెలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేర పోలీసులు కామాంధుడైన భర్తను అరెస్టు చేసిన షీ టీమ్ పోలీసులు అతన్ని జైలుకు పంపించారు.

టీ సేఫ్ రైడ్ యాప్ తో సురక్షితం
ఈ కొత్త సంవత్సరంలో భయం, వేధింపుల వాతావరణాన్ని తొలగించడం ద్వారా మహిళలకు సాధికారత కల్పించండి అంటూ తెలంగాణ మహిళా సేఫ్టీ విభాగం అధికారిణి శిఖా గోయల్ కోరారు.ప్రయాణాన్ని సురక్షితంగా చేయండి, మెరుగైన ప్రపంచాన్ని నిర్మించండి. అత్యవసర పరిస్థితుల్లో, టీ సేఫ్ రైడ్ మానిటరింగ్ సేవ కోసం 100-8 కు డయల్ చేయాలని శిఖా గోయల్ సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో, మహిళా భద్రతా విభాగం కోసం 100 కు డయల్ చేయండి
చాలా మంది మహిళా ఉద్యోగులు కార్యాలయంలో నిత్యం వేధింపులకు గురవుతున్నారు. ఇలాంటి సంఘటనలను చాలా తక్కువ మంది మాత్రమే నివేదిస్తున్నారు, చాలా మంది ఫిర్యాదు చేయడం లేదు. పని ప్రదేశాల్లో మహిళలపై అసభ్యకరమైన ప్రవర్తనపై యాజమాన్యానికి తెలియజేయండి. అత్యవసర పరిస్థితుల్లో షీ టీమ్ కోసం 100కు డయల్ చేయాలని ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసు అధికారిణి శిఖా గోయల్ కోరారు.

అవగాహన కార్యక్రమాలు
జనవరి నెలలో రాచకొండ పోలీసులు కళాశాలలు, పాఠశాలల్లో బాలికలకు 97 అవగాహన కార్యక్రమాలను షీ టీమ్ నిర్వహించింది. మహిళల చట్టాలు, హక్కులు, నేరాల నుంచి జాగ్రత్తలు చెప్పి బాలికలకు షీ టీమ్ అవగాహన కల్పించింది. వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిగిల్ల గ్రామంలో షీ టీం చౌటుప్పల్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ కళాశాలలో షీ టీం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.షీ టీమ్ పోలీసులు ఇబ్రహీంపట్నం డివిజన్ కందుకూరు పీఎస్ పరిమితుల గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ (బాలికల) కందుకూరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

పోకిరీలు వేధిస్తే ఫిర్యాదు చేయండి
బహిరంగ ప్రదేశాల్లో అమ్మాయిలను పోకిరీలు వేధిస్తే షీ టీమ్ కు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టి ఉషా విశ్వనాథ్ కోరారు.


Tags:    

Similar News