సమయంచూసి స్మితా సబర్వాల్ పైన రేవంత్ ప్రభుత్వం వేటువేసిందా ?

సుమారు మూడువారాల పాటు ఎంతో అట్టహాసంగా తెలంగాణలో జరగబోయే కార్యక్రమం నిర్వహణలో బిజీగా ఉన్న స్మితను ప్రభుత్వం సడెన్ గా ట్రాన్స్ ఫర్ చేసేసింది.;

Update: 2025-04-29 09:07 GMT
Senior IAS officer Smita Sabarwal

ఒకవైపు రాజకీయ వ్యవస్ధ..మరొవైపు అధికార వ్యవస్ధ. ఈ రెండింటిలో ఏ వ్యవస్ధది పైచేయి ? ఇంకెవరిది, రాజకీయ వ్యవస్ధదే అనటంలో సందేహంలేదు. అందుకనే సమయంచూసి సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పైన బదిలీ వేటువేసింది. టూరిజం శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న స్మితను ప్రభుత్వ ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా బదిలీచేసింది. ఎవరిని ఎక్కడకు బదిలీచేయాలన్న నిర్ణయం పూర్తిగా ప్రభుత్వానిదే. కాబట్టే స్మితను ఫైనాన్స్ కమిషన్ కు బదిలీచేసింది. ఇష్టమున్నా లేకపోయినా ఈ సీనియర్ ఐఏఎస్ కొత్తపోస్టులో జాయిన్ అవ్వాల్సిందే తప్ప వేరేదారిలేదు. టూరిజంశాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ హోదాలో స్మిత 72వ మిస్ వరల్డ్-2025 ప్రోగ్రామ్(Miss World-2025) నిర్వహణ బిజీలో ఉన్నారు. మే 7 నుండి మే 31వరకు మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ(Telangana)లో జరగబోతున్నాయి. ఈ పోటీల్లో 150 దేశాలకు చెందిన సుందరీమణులు, 3 వేలమంది అంతర్జాతీయ మీడియ ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్లు రాబోతున్నారు. సుమారు మూడువారాల పాటు ఎంతో అట్టహాసంగా తెలంగాణలో జరగబోయే కార్యక్రమం నిర్వహణలో బిజీగా స్మితను ప్రభుత్వం సడెన్ గా ట్రాన్స్ ఫర్ చేసేసింది.


దీనికి కారణం ఒకవిధంగా స్మితా సబర్వాల్(Smita Sabarwal) యాటిట్యూడనే చెప్పాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనిష్టంవచ్చినట్లు ట్విట్టర్లో ట్వీట్లు, ఎవరో చేసిన ట్వీట్లను రీట్వీట్లు చేస్తోంది. జాతీయస్ధాయిలో బాగా వివాదాస్పదమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(HCU) 400 ఎకరాల విషయంలో రేవంత్ ప్రభుత్వం బద్నాం అయ్యింది. సుప్రింకోర్టు విచారణలో ప్రభుత్వం తన వాదనేదో తాను వినిపించుకుని వివాదంలో నుండి బయటపడేందుకు ప్రయత్నాలు చేసుకుంటోంది. నిజానికి 400 ఎకరాల అంశం జాతీయస్ధాయిలో వివాదమై సుప్రింకోర్టు సీరియస్ అవటానికి కారణం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్సే అని మంత్రులు ఆరోపించిన విషయం తెలిసిందే. 400 ఎకరాలను చదునుచేసేందుకు ప్రభుత్వం బుల్డోజర్లు, జేసీబీలను రంగంలోకి దింపటంతో వివాదం మొదలైంది. 400 ఎకరాలను చదునుచేయటంవల్ల హైదరాబాద్ కు ఆక్సిజన్ అందించే లంగ్ స్పేస్ దెబ్బతింటోందని, జంతు, పక్షిజాతులు భయంతో పారిపోతున్నాయని, జింకలు చచ్చిపోతున్నాయనే ఆరోపణలతో బీఆర్ఎస్ కొన్ని వీడియోలు, ఫొటోలను ట్విట్టర్లో పెట్టింది.


ఆ వీడియోలు, ఫొటోలు నిజమేనా కాదా అన్న విషయాన్ని నిర్ధారించుకోకుండానే కొందరు సెలబ్రిటీలు వాటిని రీపోస్టులు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధ్వజమెత్తారు. ఎప్పుడైతే సెలబ్రిటీలు సదరు వీడియో, ఫొటోలను రీపోస్టులు చేశారో వెంటనే మేథావులు, పర్యావరణవేత్తలు, శాస్త్రజ్ఞులంతా గోలగోల చేసేశారు. దాంతో ఈ విషయాన్ని సుప్రింకోర్టు సూమోటోగా కేసు టేకప్ చేసి ప్రభుత్వాన్ని ఫుల్లుగా వాయించేసింది. లేటుగా మేల్కొన్న ప్రభుత్వం బీఆర్ఎస్ పెట్టిన వీడియో, ఫొటోలపై సైబర్ పోలీసులను రంగంలోకి దింపింది. వీడియోలు, ఫొటోలపై విచారణచేసిన సైబర్ పోలీసులు బీఆర్ఎస్ పోస్టుల్లో పెట్టిన వీడియోలు, ఫొటోల్లో చాలావరకు ఏఐ జనరేటెడ్ అని తేల్చటమే కాకుండా బీఆర్ఎస్ నేతలు క్రిశాంక్, దిలీప్ పై కేసులు పెట్టారు. దాంతో వెంటన బీఆర్ఎస్ ట్విట్టర్ నుండి వీడియోలు, ఫొటోలు మాయమైపోయాయి. బీఆర్ఎస్ వీడియోలు, ఫొటోలను రీపోస్టులు చేసిన సెలబ్రిటీలతో పాటు చాలామంది తమ ఖాతాల నుండి పోస్టులను డిలిట్ చేసేశారు.


అయితే, ‘హాయ్ హైదరాబాద్’ అనే సంస్ధ ట్వీట్టర్లో(Twitter) పెట్టిన అవే వీడియోలు, ఫొటోలను స్మిత రీ పోస్టుచేశారు. ఎప్పుడైతే స్మిత రీ పోస్టుచేశారో మళ్ళీ వివాదం రాజుకోవటంతో బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకున్నది. బీఆర్ఎస్ పెట్టిన తప్పుడు వీడియోలు, ఫొటోలను హాయ్ హైదరాబాద్ పోస్టుచేయటం, దాన్ని స్మిత రీపోస్టుచేయటంతో వివాదం మళ్ళీ మొదటికొచ్చింది. దాంతో గచ్చిబౌలి పోలీసులు స్మితకు విచారణకు రమ్మని నోటీసులిచ్చారు. విచారణలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఏమి సమాధానంచెప్పారో తెలీదు కాని మళ్ళీ ప్రభుత్వాన్ని నిలదీస్తు మరో ట్వీట్ చేశారు. తనతో పాటు రీపోస్ట్ చేసిన 2 వేలమందికీ నోటీసులిచ్చి పోలీసులు విచారిస్తారా ? అని నిలదీశారు. మిగిలిన వాళ్ళని విచారించకుండా తననుమాత్రమే విచారిస్తే ఎంపికచేసిన వారిని టార్గెట్ చేసినట్లవుతుంది అని కూడా తేల్చేశారు.


ప్రభుత్వసర్వీసులో ఉంటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదన్న విషయం సీనియర్ ఐఏఎస్ అధికారికి తెలియని విషయంకాదు. తెలిసే కావాలని స్మిత ప్రభుత్వంపై బురదచల్లటమే కాకుండా విచారణ విషయంలో ప్రభుత్వం తనను టార్గెట్ చేస్తోందని బహిరంగంగానే ఆరోపించారు. దాంతో స్మిత వైఖరిపై ప్రభుత్వంలో పెద్దఎత్తున చర్చ జరిగింది. జపాన్ పర్యటన నుండి తిరిగొచ్చిన రేవంత్ ఈ విషయమై సమీక్షించి చివరకు స్మితను టూరిజం శాఖ నుండి ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా బదిలీచేశారు. స్మిత కూడా తన వైఖరిని బయటపెట్టడం, ప్రభుత్వాన్ని నిలదీయటంతో తాను రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకం అన్నవిషయం లోకానికి తెలిసేట్లు చేసింది. ఎందుకంటే బీఆర్ఎస్(BRS) హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సెక్రటరీ హోదాలో స్మిత అపరిమితమైన అధికారాలను అనుభవించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారగానే రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం బదిలీచేసి అప్రాముఖ్యమైన పోస్టులో నియమించింది. తర్వాత టూరిజంశాఖకు ప్రిన్సిపుల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చింది. అప్పటినుండి సీనియర్ ఐఏఎస్ అధికారికి రేవంత్ ప్రభుత్వంపై బాగా మండుతున్నట్లుంది. అందుకనే ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని పదేపదే బయటపెట్టుకుంటున్నారు.


ఈ విషయం గమనించిన రేవంత్ కూడా ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా పెద్దగా ప్రాముఖ్యతలేని ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా నియమించారు. బహుశా తాజా బదిలీ విషయంలో కూడా స్మితకు బాగా మండిపోతుండవచ్చు. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ 2025 కార్యక్రమం మొదలయ్యేందుకు మరో 8 రోజులుమాత్రమే సమయం ఉండగా సడెన్ గా ఆమెను బదిలీచేసింది. టూరిజం శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ హోదాలో ఆమె మిస్ వరల్డ్ కార్యక్రమంపై కొద్దినెలలుగా పనిచేస్తున్నారు. తాజా బదిలీతో మిస్ వరల్డ్-2025 పోటీల నిర్వహణలో స్మితకు ఎలాంటి సంబంధంలేదని ప్రభుత్వం తేల్చేసింది. ప్రభుత్వంలో ఉంటు ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తే ఫలితం ఎలాగుంటుందో స్మిత బదిలీ వేటే ఉదాహరణ.

సర్వీసు కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులెవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు లేదు. అయితే విచిత్రం ఏమిటంటే స్మిత తన చర్యలను తాను సమర్ధించుకుంటున్నారు. తనలాగే రీపోస్టుచేసిన 2 వేలమందికీ నోటీసులిచ్చి విచారిస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీయటంలో అర్ధమేలేదు. ఎందుకంటే రీప్టోస్టుచేసిన 2 వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు కారు. వాళ్ళమీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్న విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుంది స్మితకు ఎందుకు ? ఈ పాయింట్ మీద కొందరు నెటిజన్లు స్మితను వాయించేశారు. ‘రాజకీయాల మీద ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేర’మని సలహా కూడా ఇచ్చారు.


కేసీఆర్ హయాంలో సీఎం ఆఫీసులో ఆకాశమే హద్దుగా అధికారాలను అనుభవించిన స్మితకు ఇపుడు అప్రాముఖ్యత పోస్టులో ఉండటం అంటే బాధగానే ఉంటుంది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న వాస్తవాన్ని ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి మరచిపోయినట్లున్నారు. పైగా ప్రభుత్వ సర్వీసులో ఉన్నపుడు ప్రభుత్వం ఏపోస్టుకు బదిలీచేస్తే అక్కడకు పోవాల్సిందే అని స్మితకు బాగా తెలుసు. ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రత్యక్షంగా పర్యవేక్షించిన కాళేశ్వరం(Kaleswaram Project) ప్రాజెక్టు అత్యంత అవినీతిగా తయారవ్వటమే కాకుండా మొత్తం ప్రాజెక్టే కుప్పకూలిపోయింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని స్మిత ఏమి పర్యవేక్షించారో అర్ధంకావటంలేదు. ఈ విషయంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ స్మితను ఇప్పటికే విచారించింది. ప్రాజెక్టు అవినీతి, నాసిరకం నిర్మాణం విషయంలో కమిషన్ తనను విచారించటాన్ని స్మిత తట్టుకోలేకపోతున్నారేమో. ఏదేమైనా క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలను చూస్తుంటే రేవంత్ ప్రభుత్వంలో స్మిత కంఫర్టబుల్ గా ఉండలేకపోతున్నారన్న విషయం అర్ధమైపోతోంది. బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేవంత్ స్మిత సీఎంవో నుండి ఫైనాన్స్ కమిషన్లోనే మెంబర్ సెక్రటరీగా బదిలీచేశారు. తర్వాత కొంతకాలానికి టూరిజం, యూత్ అడ్వాన్స్ మెంట్ శాఖలకు ప్రిన్సిపుల్ కార్యదర్శిగా రెండోసారి బదిలీఅయ్యారు. ఇపుడు తాజాగా మళ్ళీ ఫైనాన్స్ కమిషన్ కే మెంబర్ సెక్రటరీగా బదిలీఅయ్యారు.

స్మిత నేపధ్యం

1977, జూన్ 9వ తేదీన పుట్టిన స్మితా సబర్వాల్ స్కూల్, కాలేజీ చదువంతా హైదరాబాదులోనే జరిగింది. బెంగాల్ లోని డార్జిలింగ్ ఆమె సొంతూరు. తండ్రి ప్రణబ్ దాస్ ఆర్మీలో కలనల్ హోదాలో పనిచేశారు. స్కూల్ రోజుల్లో ఐసీఎస్ఈ పరీక్షలో ఇండియా టాప్ ర్యాంకర్ గా నిలిచారు. అలాగే యూపీఎస్సీ పరీక్షలో కూడా 22వ ఏళ్ళకే 4వ ర్యాంకు తెచ్చుకుని ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తియిన తర్వాత ఆదిలాబాదు జిల్లాలో మొదటి పోస్టింగ్ లో జాయినయ్యారు. తర్వాత చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ గా నియమితులయ్యారు. తర్వాత కడప జిల్లాలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత వరంగల్ మున్సిపల్ కమీషనర్ గా, వాణిజ్యపన్నుల శాఖలో వైజాగ్ డిప్యుటి కమీషనర్ గా కూడా పనిచేశారు.

కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ అయిన తర్వాత 2011లో కరీంనగర్ కలెక్టర్ మొదటి పోస్టింగ్ అందుకున్నారు. కలెక్టర్ హోదాలో విద్యా, వైద్య శాఖల్లో అభివృద్ధికి గణనీయమైన కృషిచేశారు. ఆ తర్వాత 2013-14లో మెదక్ కలెర్టర్ గా కూడా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శ సందర్భంగా స్మిత కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఈ ఘటనే కేసీఆర్ దృష్టిలో పడి తర్వాత సీఎంవో లో పనిచేసే అవకాశాన్ని కల్పించింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో సెక్రటరీ హోదాలో పనిచేసిన మొదటి మహిళా ఉన్నతాదికారిగా స్మిత రికార్డు సృష్టించారు. కేసీఆర్ గుడ్ లుక్స్ లో ఉండేసరికి స్మిత అపరిమితమైన అధికారాలను అనుభవించారనే ఆరోపణలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యవేక్షణే కాదు జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్లోనే తిరిగేవారనే ఆరోపణలకు కొదవేలేదు.

ఉన్నవాళ్ళతోనే పనిచేయించుకోవాలి

ఇప్పటికే స్మిత వైఖరిని రేవంత్ గమనించుంటారు. స్మిత లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయంలో రేవంత్ కు పూర్తి సమాచారం ఉండే ఉంటుంది. అందుకనే మీడియాతో మాట్లాడుతు ‘ఉన్న అధికారులతోనే కదా తాము పనిచేయించుకోవాల్సింది’ అని అన్నాడు. ‘అవసరాలను బట్టి అధికారులను ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకుంటా’మన్నాడు. ‘కొందరు అధికారుల గురించి అన్నీ విషయాలు తెలిసినా వేరే ఆప్షన్ లేకపోవటంతోనే కంటిన్యుచేయాల్సొస్తోంద’ని చెప్పాడు. ఎవరిని ఉద్దేశించి రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశాడో.

Tags:    

Similar News