మల్లన్న ‘తీన్మార్’ అన్ స్టాపబుల్

ప్రభుత్వం పేరుతో కాదు ఏకంగా రేవంత్ పైనే రెగ్యులర్ గా విమర్శలు, ఆరోపణలతో తీన్మార్ రెచ్చిపోతునే ఉన్నారు.

Update: 2024-10-22 09:35 GMT
Teenmar Mallanna

ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపణలు, విమర్శలను కంటిన్యు చేస్తునే ఉన్నారు. తాజాగా సియోల్ లోని ‘చంగ్ ఏ చున్’ నదిని పరిశీలించేందుకు ప్రభుత్వం కొందరు జర్నలిస్టులను దక్షిణకొరియాకు పంపింది. జర్నలిస్టులతో పాటు ఇద్దరు మంత్రులు, కొందరు ఎంఎల్ఏలు, ఒక ఎంపీ, మరికొందరు ఉన్నతాధికారులు కూడా వెళ్ళారులేండి. నాలుగు రోజుల పర్యటనకు తెలంగాణా నుండి పెద్ద బృందమే సియోల్ వెళ్ళింది. ఇపుడు విషయం ఏమిటంటే జర్నలిస్టులను దక్షిణకొరియాకు ప్రభుత్వం పంపటాన్ని తీన్మార్ మల్లన్న తప్పుపట్టారు. తన యూట్యూబ్ ఛానల్ తో పాటు ట్విట్టర్ వేదికగా ఇదే విషయమై ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. ‘కొందరు జర్నలిస్టులను ప్రభుత్వం దక్షిణకొరియాకు పంపింది ఏమి చేయటానికి’ అంటు నిలదీశారు.

‘దక్షిణకొరియా నుండి వీడియోలు తీసి పంపమంటే సరిపోయేదానికి జర్నలిస్టులను దక్షిణకొరియాకు పంపాల్సిన అవసరం ఏమిటి’ ? అని ప్రశ్నించారు. జీవో ఇచ్చి మరీ పంపిన ప్రభుత్వం ప్రజాధనం వృధాచేసినట్లే అని తేల్చేశారు. ‘ఎవ్వరి పైసలని చెప్పి జర్నలిస్టులను ధక్షిణకొరియాకు పంపింది’ అని నిలదీశారు. ప్రజాధనం వృధాచేయటం కాకపోతే ఇంకేమిటి ? అని ఎద్దేవాచేశారు. ‘ఇంతమందిని హైదరాబాద్ నుండి అధ్యయనం పేరుతో దక్షిణకొరియాకు పంపేబదులు సౌత్ కొరియా ఆయన్ను వీడియోలు తీసి పంపమంటే పంపరా’ ? అని నిలదీశారు. జర్నలిస్టులను పంపిన విషయంలో ఇంతగా రెచ్చిపోయిన తీన్మార్ మరి ఇద్దరు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీ, ఉన్నతాధికారుల పర్యటన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.

ఈ విషయమే కాదు సోమవారం కొందరు బీసీ సంఘాల నేతలతో కలిసి తీన్మార్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఒక వినతిపత్రం ఇచ్చారు. అందులో ఏముందంటే గ్రూప్-1 మెయిన్ పరీక్షలను వెంటనే రద్దుచేసేట్లుగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఒకవైపు ఇదే విషయమై పరీక్షలు రాస్తున్న అభ్యర్ధుల్లో కొందరు హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ లో కేసులు వేసి ఓడిపోయారు. సుప్రింకోర్టులో పిటీషన్ వేసినా ఉపయోగంలేకపోయింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 46 కేంద్రాల్లో పరీక్షలు కూడా మొదలైపోయాయి. ఈ దశలో గవర్నర్ ను కలిసి మెయిన్స్ పరీక్షలను ఆపాలంటు ప్రభుత్వాన్ని ఆదేశించమని గవర్నర్ ను కోవటంలో ఉద్దేశ్యం ఏమిటో అర్ధంకావటంలేదు. ఇదే జీవో 29 విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది. అభ్యర్ధులు, ప్రతిపక్షాలు జీవో 29ని రద్దుచేసి మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని ఎంత గోలచేసినా రేవంత్ పట్టించుకోలేదు. అలాంటి జీవో 29కి వ్యతిరేకంగా బీసీ సంఘాలతో కలిసి తీన్మార్ గవర్నర్ ను కలవటం పార్టీలో చర్చ జరుగుతోంది.

ఇదే కాకుండా తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చితీరాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని రేవంత్ అండ్ కో చేసిన ప్రకటన, ఇచ్చిన హామీని తీన్మార్ పదేపదే గుర్తుచేస్తున్నాడు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయకపోతే కాంగ్రెస్ పార్టీని బీసీలే బొందపెడతారంటు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతయ్యుండి, కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంఎల్సీగా గెలిచిన దగ్గరనుండి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదేపదే విమర్శిస్తునే ఉన్నారు. మరి రేవంత్ తో తీన్మార్ కు ఎక్కడ చెడిందో అర్ధంకావటంలేదు. పై అంశాలే కాదు ప్రభుత్వం పేరుతో కాదు ఏకంగా రేవంత్ పైనే రెగ్యులర్ గా విమర్శలు, ఆరోపణలతో తీన్మార్ రెచ్చిపోతునే ఉన్నారు. ఏదేమైనా తీన్మార్ వ్యవహారశైలి మాత్రం కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో అన్ స్టాబుల్ అనే పద్దతిలో చర్చలు జోరందుకుంటున్నాయి.

Tags:    

Similar News