మొత్తం మీడియానే చేసిందంటోన్న రేవంత్

తనకు న్యాయవ్యవస్థపై అపారమైన గౌరవం, నమ్మకం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Update: 2024-08-30 08:30 GMT

తనకు న్యాయవ్యవస్థపై అపారమైన గౌరవం, నమ్మకం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. "భారత న్యాయవ్యవస్థపై నాకు అత్యంత గౌరవం, పూర్తి విశ్వాసం ఉంది. 29 ఆగస్టు, 2024 నాటి కొన్ని పత్రికా నివేదికలు నా వ్యాఖ్యలను తప్పుగా ప్రచురించినట్టు అర్ధమవుతోంది. నేను గౌరవనీయ న్యాయస్థానం న్యాయపరమైన విజ్ఞతను ప్రశ్నిస్తున్నాను అనే అభిప్రాయం వచ్చేలా మీడియా కథనాలు ప్రచురించినట్టు నాకు అర్ధమైంది. పత్రికా నివేదికలలో వచ్చిన కథనాల పట్ల బేషరతుగా నా విచారం వ్యక్తం చేస్తున్నాను. న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల నాకు అత్యున్నత గౌరవం ఉంది. భారత రాజ్యాంగాన్ని విశ్వసించే వ్యక్తిగా, న్యాయవ్యవస్థపైనా నాకు అత్యంత గౌరవం ఉంది, అది అలాగే కొనసాగిస్తాను  కూడా" అంటూ పోస్ట్ చేశారు.

కాగా, కవిత బెయిల్ విషయంలో రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓటుకు నోటు కేసులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పుపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సీఎం రేవంత్‌ కు తగునా అని ప్రశ్నించింది. రాజకీయ నాయకులను సంప్రదించి మేము ఆదేశాలు ఇస్తామా అని ధర్మాసనం మండిపడింది. ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండాలి కదా. ఇలా ఎలా మాట్లాడతారు అంటూ నిలదీసింది. "మేము ఎవరి వ్యాఖ్యలు పట్టించుకోము. మా విధి మేము నిర్వహిస్తాము. మేము ప్రమాణ పూర్వకంగా పనిచేస్తాము. ఎవరి పనుల్లోనూ జోక్యం చేసుకోము. సర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా?" అంటూ రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే, కవిత బెయిల్ పై సీఎం రేవంత్ చిట్ చాట్ లో మాట్లాడుతూ... "బీఆర్ఎస్, బీజేపీ మైత్రి వల్లే ఆమెకి బెయిల్ వచ్చింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌ బీజేపీకి ట్రాన్స్‌ఫర్ చేశారు. అందుకే కవితకు ఐదు నెలల్లో బెయిల్ వచ్చింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న కేజ్రీవాల్, సిసోడియాకు నెలలు దాటినా రాలేదు. బీఆర్‌ఎస్‌కు ఒక న్యాయం, మిగితా వారికి మరో న్యాయం జరుగుతుంది" అని సీఎం వ్యాఖ్యానించినట్లు కథనాలు వెలువడ్డాయి. 

Tags:    

Similar News