చెన్నై డీలిమిటేషన్ సమావేశ తీర్మానాలకు తెలంగాణ మేథావుల మద్దతు

తెలంగాణ ఫెడరల్ తో మేథావులు మాట్లాడుతు చెన్నై సమావేశంలో చేసిన తీర్మానాలకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు;

Update: 2025-03-23 09:19 GMT
Chennai meeting against center proposed Delimitation

కేంద్రప్రభుత్వ ప్రతిపాదిత డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా చెన్నై సమావేశంలో చేసిన తీర్మానాలకు తెలంగాణ మేథావులు మద్దతు పలికారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆధ్వర్యంలో డీలిమిటేషన్ వల్ల నష్టపోతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నేతలతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో పాల్గొన్న నేతలు కేంద్రప్రతిపాదిత డీలిమిటేషన్ను(Delimitation) తప్పుపట్టారు. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాధి రాష్ట్రాలు(South States) ఏవిధంగా నష్టపోతాయనే విషయాన్ని సవివరంగా చెప్పారు. తమ అభ్యంతరాలను కాదని కేంద్రప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియను మొదలుపెడితే జరగబోయే నష్టాలపై హెచ్చరికలు కూడా చేశారు. తొందరలోనే రెండోమీటింగ్ హైదరాబాదు(Hyderabad)లో పెట్టబోతున్నట్లు మీటింగులో పాల్గొన్న రేవంత్ రెడ్డి(revanth) ప్రకటించారు. మీటింగుతో పాటు డీలిమిటేషన్ పై కేంద్రప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా భారీ బహిరంగసభను నిర్వహించబోతున్నట్లు కూడా చెప్పారు.

ఈ నేపధ్యంలోనే ‘తెలంగాణ ఫెడరల్’ కొందరు మేథావులతో చెన్నై డీలిమిటేషన్ సమావేశంలో చేసిన తీర్మానాలను ప్రస్తావించింది. తెలంగాణ ఫెడరల్ తో మేథావులు మాట్లాడుతు చెన్నై సమావేశంలో చేసిన తీర్మానాలకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పనిలోపనిగా కేంద్రప్రభుత్వ వైఖరిని కూడా తప్పుపట్టారు. మేథావులు ఏమన్నారో వాళ్ళమాటల్లోనే చూద్దాం.

డాక్టర్ బీ. కేశవులు నేత, తెలంగాణ మేధావుల సంఘం అధ్యక్షుడు

డీ లిమిటేషన్ ప్రక్రియే ఇపుడు మొదలుపెట్టాల్సిన అవసరంలేదు. దేశానికి ఇపుడు పునర్విభజనే అవసరంలేదు. ఇప్పుడున్న 543 మంది ఎంపీలే ఏమీచేయటంలేదు. వీళ్ళకు అదనంగా మరో 400 మంది ఎంపీలు పెరిగితే దేశానికి నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎంపీల ద్వారా సమాజంలో జరిగే డెవలప్మెంట్ ఏమీలేదు. నేతలకు రాజకీయ పునరావాసం కల్పించటం తప్ప ఇంకెలాంటి ఉపయోగం ఉండదు. 30 ఏళ్ళు వాయిదావేయాలన్న చెన్నై సమావేశపు తీర్మానం మంచినిర్ణయం. సైంటిఫిక్ స్టడీ లేకుండా రాజకీయ లబ్దికోసమే చేస్తే ఉత్తర-దక్షిణాధి రాష్ట్రాల మధ్య అశాంతి పెరిగిపోతుంది. ఇప్పటికే వివిధ కారణాలతో దక్షిణాధి-ఉత్తరాధి ప్రాంతాల మధ్య వివాదాలు రేగుతున్నాయి. ఈ నేపధ్యంలో డీలిమిటేషన్ చేయాలన్న నరేంద్రమోడీ వైఖరి మరింత ప్రమాధకరం. శాస్త్రీయమైన అధ్యయనం జరిగిన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టాలి. ఇప్పటికిప్పుడు ఎంపీల సంఖ్య పెంచాల్సినంత అవసరం ఏమీలేదు. ఏడాదికి 400 మంది ఎంపీలు పెరగటం వల్ల సుమారు 2 వేల కోట్లరూపాయలు ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. దేశంలోని పేదలు పెరిగిపోతున్నారు. పేదల కనీసవసరాలు తీర్చలేని స్ధితిలో ఎంపీల సంఖ్య పెంచటం అవసరమా ? కేవలం పార్టీల ఆధిపత్యం కోసమే ఎంపీ సీట్లను పెంచాలని కేంద్రప్రభుత్వం అనుకుంటోంది.

డీవీజీ శంకర్ రావు, పార్వతీపురం మాజీ ఎంపీ

జనాభా ప్రాతిపదికగా ఎంపీల సీట్లు పెంచితే దక్షిణాధిలో సీట్లు తగ్గిపోవటం ఖాయం. శాస్త్రీయమైన అధ్యయనం జరిగి అందరితోను మాట్లాడిన తర్వాతమాత్రమే ఎంపీ సీట్లసంఖ్యను పెంచాలి. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా చెన్నై మీటింగు డిమాండ్లలో న్యాయముంది. శాస్త్రీయపద్దతిలో సమస్యకు పరిష్కారాన్ని మోడీయే చూపించాలి. దక్షిణాధి రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్య తగ్గకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది.

ప్రొఫెసర్ ఇ వెంకటేశు, పొలిటికల్ సైన్స్-హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి

1971,2001లో కాంగ్రెస్, బీజేపీ ప్రధానమంత్రులు డీలిమిటేషన్ ప్రక్రియను 50 ఏళ్ళు వాయిదా వేశారు. వాయిదా వేయటంలో ఉద్దేశ్యం జనాభాలో తేడాలున్నాయని. రెండుప్రాంతాలను బ్యాలెన్స్ చేసిన తర్వాతే డీలిమిటేషన్ చేయాలని. అయితే జనాభాను బ్యాలెన్స్ చేయటంలో అప్పటి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దానికారణంగా ఉత్తరాధి, దక్షిణాధి ప్రాంతాలమధ్య బాగా వ్యత్యాసం పెరిగిపోయింది. 50 ఏళ్ళసమస్య ఇపుడు బాగా జటిలమైపోయింది. డీలిమిటేషన్ కు సంబంధించిన ఆర్టికల్స్ 82, 171 రాజ్యాంగబద్దంగా చేపట్టాల్సిన ప్రక్రియ. డీలిమిటేషన్ ప్రక్రియలో అందరికీ భాగస్వామ్యం కల్పించాలి. కేంద్రప్రభుత్వ వైఖరివల్ల రాజ్యాంగబద్దంగా చేపట్టాల్సిన ప్రక్రియకాస్త రాజకీయ ఉద్యమంగా మారుతోంది. డీలిమిటేషన్ వల్ల దక్షిణాధి నష్టపోతుందనే ఆందోళన అందరిలోను పెరిగిపోతోంది. కేంద్రానికి దక్షిణాధి రాష్ట్రాలు చెల్లిస్తున్న పన్నుల దామాషాలో కేంద్రంనుండి దక్షిణాధి రాష్ట్రాలకు తిరిగి రావటంలేదు. దక్షిణాధి భాషలను ఉత్తరాధి రాష్ట్రాలు నేర్చుకోవటంలేదు. ఇదేసమయంలో హిందీని దక్షిణాధి రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నారు.

2024 ఎన్నికల తర్వాత ఎన్డీయే బలహీనపడింది. తన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఎన్డీయేపైన పడింది. 1951, 61, 71లో డీలిమిటేషన్ జరిగింది. చివరగా 2009లో జరిగిన డీలిమిటేషన్ రాష్ట్రాల మధ్య మాత్రమే జరిగింది. రాష్ట్రంలోని పార్లమెంటు, అసెంబ్లీతో పాటు నియోజకవర్గాల పరిధిని, జనాలను సర్దుబాటు మాత్రమే చేశారు. అందుకనే పార్లమెంటులో ఎంపీల సంఖ్య పెరగలేదు. ఒకవేళ ఇపుడు కేంద్రప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెడితే దక్షిణాధి, ఉత్తరాధి రాష్ట్రాలమధ్య అంతరం పెరిగిపోతుంది. చెన్నై సమావేశం చేసిన డిమాండ్లలో న్యాయముంది.

కూరపాటి వెంకటనారాయణ, కాకతీయ యూనివర్సిటి-ఎకనామిక్స్ డిపార్టమెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్

చెన్నై సమావేశాన్ని, డిమాండ్లను రాజకీయ కోణంలో ఆలోచించకూడదు. ఇది దక్షిణాధి రాష్ట్రాల సమస్యగానే చూడాలి. ఎంపీ సీట్ల పెంపులో కేంద్రం వివక్షగా వ్యవహరిస్తే సమస్యలు పెరిగిపోతాయి. జనాభా ఆధారంగా ఎంపీల సీట్లు పెంచితే దక్షిణాధి రాష్ట్రాలు నష్టపోతాయి. గడచిన 2 దశాబ్దాలుగా దక్షిణాధి జనాభా పెరుగుదల నియంత్రణలో ఉంది. ఉత్తరాధి జనాభా నియంత్రణ పాటించలేదు. అందుకనే ఉత్తరాధి రాష్ట్రాల్లో జనాభా పెరిగిపోయింది. ఎంపీల సీట్లే కాదు రాష్ట్రాలకు తిరిగి ఇవ్వాల్సిన నిధుల విషయంలో కూడా కేంద్రప్రభుత్వం అన్యాయమే చేస్తోంది. జనాభా ఆధారంగానే కేంద్రం నిధులు మంజూరుచేస్తోంది. ఈరూపంలో కూడా దక్షిణాధినష్టపోతోంది. నరేంద్రమోడీ(Narendra Modi) చెబుతున్న డబల్ ఇంజన్ కాన్సెప్టే రాంగ్. చెన్నై మీటింగ్ అత్యవసరం. దక్షిణాధి రాష్ట్రాలకు జరుగుతున్న నష్టాల విషయంలో ఉత్తరాధి రాష్ట్రాలు సానుకూలంగా ఆలోచించాలి. డీలిమిటేషన్ అన్నది రాజకీయపార్టీల సమస్యగా కాకుండా ప్రజల సమస్యగా చూడాలి. కేంద్రప్రభుత్వం అనుకుంటున్నట్లుగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాధి రాష్ట్రాల వాయిస్ తగ్గిపోవటం ఖాయం.

Tags:    

Similar News