ఫ్యాన్సీ వెహికల్ నెంబర్లు కావాలంటే అంతే ఫ్యాన్సీగా చెల్లించాలి..
రెండు రెట్లు ధరలు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసిన రవాణా శాఖ.;
వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లను పెట్టుకోవాలని అంతా కోరుకుంటారు. కానీ చాలా మంది వాహనం నెంబర్ కోసం ప్రత్యేకంగా ఖర్చు దేనికిలే అని వదిలేస్తే మరికొందరు మాత్రం ఆ నెంబర్ కోసం రూ.వేల నుంచి రూ.లక్షల వరకు ఖర్చు చేస్తారు. అంతర్జాతీయ స్థాయిలో కోట్ల రూపాయలు పలికిన నెంబర్ ప్లేట్లు కూడా ఉన్నాయి. అయితే ఈ నెంబర్ ప్లేట్ల విషయంలో తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వీటి రిజిస్ట్రేషన్ ఫీజును భారీగా పెంచింది. రెండు రెట్లు ఫీజులు పెంచినట్లు వెల్లడించింది. ఇదివరకు ఈ నెంబర్ ప్లేట్ల కోసం వాహనదారులు చెల్లించే ఫీజుల స్లాబులు ఐదు ఉండేవి. వాటి సంఖ్యను తాజాగా రావాణ శాఖ ఏడుకు పెంచింది. ఈ క్రమంలోనే ఫీజులు కూడా భారీగానే పెరిగాయి. ఇప్పటి వరకు రూ.50వేలుగా ఉన్న ధర కొత్త స్లాబుల ప్రకారం రూ.1.50 లక్షలు అయింది. అదే విధంగా రూ.40వేలు ఉన్న ఫీజు రూ.లక్ష రూయాలకు, రూ.30వేలు ఉన్న ఫీజు రూ.50వేలకు పెరిగింది. ఈ మార్పులు తెలంగాణ మోటర్ వాహన చట్టం 1989లోని రూల్ నెంబర్ 81పై ఫోకస్ చేయబడ్డాయి.
అంతే కాకుండా ప్రత్యేక నెంబర్ల కోసం ఎవరైనా ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే ఈ అప్లికేషన్లను రావాణా శాఖ స్వీకరించనుంది. అప్లై చేసుకోవడానికి www.transport.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
నెంబర్ ప్లేట్ల ధరలు ఇలా..
మోటల్ వాహన చట్టంలో తెచ్చిన ఈ కొత్త సవరణ ప్రత్యేక నెంబర్ల ఫీజులను గణనీయంగా పెంచింది. దీని ప్రకారం..
- 9999 నెంబర్ ఫీజు రూ.1.50 లక్షలు
- 1. 9, 6666 వంటి నెంబర్ ఫీజు రూ. లక్ష
- 99, 999, 3333, 4444, 5555, 7777 వంటి నెంబర్ల ఖరీదు రూ.50వేలు
- ఇవి కాకుండా మిగిలిన ప్రత్యేక నెంబర్ల ఫీజు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఉంటుంది. అదే విధంగా టూవీలర్ రిజర్వేషన్ ఫీజును కూడా రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచడం జరిగింది. ఇది హై-టైర్ క్యాటగిరీలో లేని నెంబర్ల రిజిస్ట్రేషన్ స్వీకరించే ఫీజు.
ప్రజా అభిప్రాయ సేకరణ..
కాగా ఈ సవరణ బిల్లు ముసాయిదాను తెలంగాణ రవాణా శాఖ ప్రజా అభిప్రాయ సేకరణ కోసం 30 రోజుల పాటు ఓపెన్‌గా ఉంచనుంది. ఈ సవరణలపై ఎవరైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఇవ్వదలుచుకుంటే వాటిని చీఫ్ సెక్రటరీ, రవాణా శాఖ కమిషనర్ ద్వారా సంబంధిత శాఖకు పంపాలని అధికారులు తెలిపారు.
రవాణా శాఖకు పెరగనున్న ఆదాయం
ఫ్యాన్సీ నెంబర్ల ఫీజులు పెంచడం ద్వారా రవాణా శాఖ ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2023లో తొలి తొమ్మిది నెలల్లోనే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం వేయడం ద్వారా రూ.53.9 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత కూడా 2023లో అధిక సంఖ్యలోనే ఫ్యాన్సీ నెంబర్లను అందించినట్లు అధికారులు చెప్పారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతీయ రవాణా అథారిటీలు రూ.124.2 కోట్ల విలువైన ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్లలను చేశాయి. 2024 మే నెలలో ‘TG’తో వచ్చిన తొలి నెంబర్ ప్లేట్ ఒక్కటే రూ.2.7కోట్లు ఆర్జించింది. అదే నెలలో ‘9999’ నెంబర్ కోసం ఓ వ్యక్తి రూ.25.5 లక్షలు చెల్లించారు. ఇక 2025లో చూసుకుంటే ఏప్రిల్ నెలలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఒకే ఒక్క వేలంలో రూ.37.15 లక్షల ఆదాయం వచ్చింది. ఇందులో ‘0001’ నెంబర్‌ను రూ.7.75 లక్షలకు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మారిన ఫీజుల స్లాబులతో ఈ ఆదాయం మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.