Telangana Raithu Bharosa | రైతు భరోసాపై సబ్ కమిటీ కసరత్తు

తెలంగాణలో రైతులకు భరోసా అందించాలని రైతు భరోసా సబ్ కమిటీ నిర్ణయించింది.రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు కమిటీ కసరత్తు చేస్తోంది.

Update: 2024-12-29 13:02 GMT

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.72,659 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉందని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళతామని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు చెప్పారు.

- ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు, కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు, దుదిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం అయ్యారు.
- రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై రెండు గంటల పాటు మంత్రులు కసరత్తు చేశారు.పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రైతు భరోసా అందించిన తీరు,కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన క్రమంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అధికారులు సేకరించిన సమాచారం పై మంత్రులు కసరత్తు చేశారు.

రైతు రుణమాఫీ
రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ కింద రెండు నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్ల రూపాయల నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు భట్టి విక్రమార్క తెలిపారు.రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతుల సంక్షేమానికి కృషి చేసేందుకు వ్యవసాయ కమిషన్ ను ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా ప్రజా ప్రభుత్వం తొలి ఏడాదిలోనే యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేసిన విషయాన్ని వివరించారు. 1,57,51000 ఎకరాలకు రూ. 7,625 కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమ చేసిన విషయాన్ని భట్టి గుర్తు చేశారు.

రైతు నేస్తం కార్యక్రమం
గత ప్రభుత్వంలో నిర్మించిన రైతు వేదికలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించామని భట్టి విక్రమార్క తెలిపారు. రైతు వేదికలను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం చేసి రైతు సమస్యలను పరిష్కరించేందుకు రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన వివరించారు. 110 రైతు వేదికల్లో నాలుగు కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించి వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.



ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సాహం

2024-25 లో రాష్ట్రంలో ఒక లక్ష ఎకరాల ఆయిల్ ఫామ్ సాగును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 2023-24 ఏడాదికి గాను ఆయిల్ సాగు పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.80.10 కోట్లు విడుదల చేయగా రాష్ట్ర వాటా కలుపుకొని మొత్తం రూ.133.5 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసే సన్నధాన్యానికి ప్రతి క్వింటాకు 500 రూపాయలు బోనస్ గా చెల్లిస్తుందని తెలిపారు.


Tags:    

Similar News