SLBC టన్నెల్ పనుల్లో కదలిక, లీడార్ సర్వేకి ఆదేశాలు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ తవ్వకాలకు ఆదేశాలు ఇవ్వడంతోపాటు అత్యంత అధునాతన యంత్రాలను రంగంలోకి దించాలని నిర్ణయించారు.;
By : Saleem Shaik
Update: 2025-07-21 12:14 GMT
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు జీవనాడి అయిన శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) ప్రాజెక్టు పనులను పునః ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కృష్ణా జలాలను తెలంగాణకు మళ్లించేందుకు ఉద్దేశించిన ఈ ఎస్ ఎల్ బిసి టన్నెల్ కూలిపోవడంతో పనులు ఆగిపోయాయి. ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన టన్నెల్ బోరింగ్ మిషన్ సాయంతో దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్ బీసీ వద్ద సొరంగం తవ్వుతుండగా, ఒక్కసారిగా పైకప్పు కూలి 8 మంది కార్మికులు, ఉద్యోగులు సజీవ సమాధి అయ్యారు. ఇందులో ముగ్గురి మృతదేహాలను మాత్రమే వెలికి తీశారు. మిగతా ఆరుగురి శవాలు మట్టిలోనే కూరుకుపోయి రెస్క్యూ బృందాలు వెలికితీసేందుకు యత్నించినా సాధ్యం కాలేదు.
టన్నెల్ నిర్మాణంలో ముందుకు పాగేందుకు ఆ ప్రాంతంలో నేల అనుకూలంగాలేదని, టన్నెల్ తవ్వడం కష్టమని అంతా భావిస్తూ వచ్చారు. అయితే, టన్నెల్ నిర్మాణం చేపట్టి, సాధ్యమైనంత తొందరగా పూరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ భావిస్తున్నది. దీనికోసం నేల, భూగర్భ స్వభావం ఎలా ఉంది, టన్నెల్ తవ్వకం కొనసాగించవచ్చా, భూగర్భ స్వభావం అనుకూలంగా లేకపోతే, ఏమిచేయాలనే అంశాన్ని అధ్యయనం చేసేందుకు రాష్ట ప్రభుత్వం లిడార్ (Light Detection and Ranging : LiDAR) సర్వేకి ఆదేశించింది. ఈ సర్వేల వల్ల సొరంగం తవ్వాలనుకుంటున్న ప్రాంతం భౌగోళిక, భూగర్భ స్వరూపం ఎలా ఉన్నదో తెలుస్తుంది. ఈ సర్వే రిపోర్టు రాగానే అవసరమైన టెక్నాలజీ మార్పులు చేసి పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఈ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ అజయ్ చెప్పారు.ఈ ప్రాజెక్టును అత్యంత అధునాతన టెక్నాలజీ సాయంతో తాము మూడేళ్లలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు.
- ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 4.15లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత 516 గ్రామాలకు తాగునీటిని గ్రావిటీ ద్వారా అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ప్రాజెక్టు (ఎస్‌ఎల్‌బీసీ)ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. నల్గొండ జిల్లాకు చెందిన నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి కావడంతోపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాలుగా సాగుతున్న ఈ ప్రాజెక్టు పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని నిర్ణయించిందని ఈ ప్రాజెక్టు ఇంజినీర్లు చెబుతున్నారు.
టన్నెల్ పనులు ప్రారంభించాలని చీఫ్ ఇంజినీర్ ఆదేశాలు
శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC)లో సొరంగం నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించాలని తాము కాంట్రాక్టు సంస్థ అయిన జయప్రకాశ్ గ్రూప్ (JAYPEE)కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని ఈ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ చెప్పారు.ఈ టన్నెల్ కూలిన తర్వాత సరిగ్గా 150 రోజులకు మళ్లీ టన్నెల్ నిర్మాణ పనులు ప్రారంభించింది.
టన్నెల్ వద్ద అధునాతన సర్వేకు ఆదేశాలు
నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) సహకారంతో ఎస్ ఎల్ బీసీ (SLBC) సొరంగం పనులు అత్యాధునిక విద్యుదయస్కాంత సర్వే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేయాలని కోరుతూ సోమవారం తాము ఉత్తర్వులు జారీ చేశామని ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వెల్లడించారు. ఖచ్చితమైన ప్రణాళికను నిర్ధారించడానికి వైమానిక లిడార్ (LIDAR) సర్వేను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.సొరంగం పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్ జీ ఆర్ఐ) (NGRI) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI)తో నీటిపారుదల శాఖ ఒప్పందం కుదుర్చుకుంది.
కూలిన ప్రాంతం వైపు 3 కిలోమీటర్ల దూరం తవ్వకాలు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ మొత్తం పొడవు 43.93 కిలోమీటర్లు కాగా, ఇప్పటికే 34.37 కిలోమీటర్ల దూరం సొరంగం తవ్వారు. 9.2 మీటర్ల వ్యాసంతో ఈ సొరంగాన్ని తవ్వుతున్నారు. దోమలపెంట వైపు టన్నెల్ లోపల జరిగిన ప్రమాదంతో పనులను ఫిబ్రవరి 22వతేదీన నిలిపివేశారు. ఈ ప్రమాదం తర్వాత టన్నెల్ తవ్వకాల పనులను అత్యంత అధునాతన మైన సాంకేతికతతో డ్రిల్లింగ్, బ్లాస్టింగ్‌తో (Drilling and Blasting) సహా మిగిలిన సొరంగం కార్యకలాపాలను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఎస్‌ఎల్‌బీసీ ఇంజినీర్లు చెప్పారు. టన్నెల్ కూలిన ప్రాంతంలో ముక్కలైన టన్నెల్ బోరింగ్ మిషన్(టీబీఎం) సాయంతో పనులు చేయాలంటే దెబ్బతిన్న టీబీఎంకు మరమ్మతుల కోసం రూ.100 కోట్లు వెచ్చించాలని చీఫ్ ఇంజినీర్ వి అజయ్ కుమార్ చెప్పారు.
మన్నెవారిపల్లి వైపు నుంచి కూడా టన్నెల్ తవ్వకాలు
పాత టీబీఎంకు మరమ్మతులు చేయాలంటే అమెరికా నుంచి బేరింగులు తెప్పించాలి. అందుకే టీబీఎంను కాదని అధునాతన యంత్రాల సహాయంతో మిగిలిన 9.56 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకాలు పూర్తి చేయాలని నిర్ణయించామని చీఫ్ ఇంజినీర్ వివరించారు.దోమల పెంట కూలిన ప్రాంతం వైపు కేవలం మూడు కిలోమీటర్ల దూరమే సొరంగం తవ్వుతామని, దేవరకొండ వైపు ఉన్న మన్నెవారిపల్లి నుంచి మిగిలిన 6.56 కిలోమీటర్ల దూరం టన్నెల్ తవ్వకాలు చేపడుతున్నామని చీఫ్ ఇంజినీరు తెలిపారు. దీంతో త్వరలో రెండు వైపులా టన్నెల్ తవ్వకాల కోసం యంత్రాలను కాంట్రాక్టు సంస్థ జయపీ అసోసియేట్స్ (Jaypee Associates)ద్వారా రంగంలోకి దించుతున్నామని ఆయన చెప్పారు.
పర్యావరణానికి ఆటంకం లేకుండా టన్నెల్ తవ్వకాలు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ తవ్వకాలను పర్యావరణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా పనులు చేపడుతున్నామని వి అజయ్ కుమార్ చెప్పారు. టన్నెల్ తవ్వకాలు చేపడుతున్న ప్రాంతంలో కొండలు, గుట్టలతోపాటు అమ్రాబాద్ పులుల అభయారణ్యం ఉన్నందున పర్యావరణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు.
నీటిపారుదల శాఖకు డెప్యుటేషన్ పై కల్నల్ పరీక్షిత్ మెహ్రా
నీటిపారుదల శాఖలో డిప్యుటేషన్‌పై టన్నెల్ ఇంజనీరింగ్ నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రాను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈయన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన టన్నెల్ నిపుణుడని ఇంజినీర్లు చెప్పారు. మెహ్రా నైపుణ్యం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సాంకేతిక సవాళ్లను పరిష్కరించడానికి ఎస్ ఎల్ బీసీ ఇతర కీలక సొరంగ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడంలో సహాయపడుతుందని మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (N Uttam Kumar Reddy) విశ్వాసం వ్యక్తం చేశారు.భారత సైన్యం మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ జనరల్ హర్పాల్ సింగ్‌ను త్వరలో తెలంగాణ ఇరిగేషన్ శాఖ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి గౌరవ సలహాదారుగా నియమిస్తామని కూడా మంత్రి ఉత్తమ్ ప్రకటించారు.