కేసీఆర్ ఫామ్ హౌస్ కు టులెట్ బోర్డ్
ప్రతిపక్ష నేతగానే కాదు ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో కూడా వారాల తరబడి కేసీఆర్ సచివాలయానికి వచ్చేవారు కాదు.;
తెలంగాణ రాజకీయాల్లో ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది. అదేమిటంటే ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ ప్రధాన గేటుకు బీజేపీ తాళంవేసింది. గజ్వేలు నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో వినిపించేందుకు ఇష్టపడని కేసీఆర్ ఎంఎల్ఏగా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తు పెద్ద గొడవేచేశారు. గతంలో ఎవరూ ఇలాంటి గోలచేయలేదు. ప్రధానప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావటంలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష నేతగానే కాదు ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో కూడా వారాల తరబడి కేసీఆర్ సచివాలయానికి వచ్చేవారు కాదు. ఫామ్ హౌస్ లో కూర్చుని ఏమిచేసేవారు అన్నది మిలియన్ డాలర్ట ప్రశ్నగా మిగిలిపోయింది.
సీఎంగానే సచివాలయంకు రాని కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి మాత్రం ఎందుకువస్తారు ? అందుకనే రేవంత్ రెడ్డి(Revanth) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో 15 మాసాల్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ మహాయితే రెండురోజులు మాత్రమే హాజరయ్యుంటారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్(KTR) చెప్పింది అబద్ధమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు సభకు హాజరుకాని కేసీఆర్ మిగిలిన వారంరోజుల్లో హాజరవుతారని ఎవరు అనుకోవటంలేదు. ఈ నేపధ్యంలోనే గజ్వేలులోని బీజేపీ నేతలు, క్యాడర్, యూత్ కాంగ్రెస్ నేతలు, క్యాడర్ ఒకేరోజు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్(KCR Farm House) ముందు పెద్ద ఆందోళనచేశాయి.
బీజేపీ(BJP) నేతలైతే ఫామ్ హౌస్ మైన్ గేటుకు తాళాలు వేసి టులెట్ బోర్డ్ తగిలించారు. అలాగే కేసీఆర్ ఎంఎల్ఏగా రాజీనామా చేయాలనే బోర్డును కూడా తగిలించారు. గజ్వేలు నియోజకవర్గ(Gajwel Constituency) సమస్యలను అసెంబ్లీలో చర్చించనపుడు ఇక కేసీఆర్ ఎంఎల్ఏగా ఉండి ఉపయోగం ఏమిటని నేతలు నిలదీశారు. అసెంబ్లీ ఉన్నదే సమస్యలను చర్చించి పరిష్కారాలను కనుగొనేందుకని నేతలన్నారు. సమస్యల పరిస్కారానికి అత్యున్నత వేదిక అసెంబ్లీకే వెళ్ళనపుడు కేసీఆర్ ఎంఎల్ఏగా ఉండి నియోజకవర్గానికి ఉపయోగం ఏమిటని నేతలు లాజిక్ లేవదీశారు. నమ్మిఓట్లేసిన నియోజకవర్గం ప్రజలను నట్టేటముంచిన కేసీఆర్ తానుమాత్రం హ్యాపీగా ఫామ్ హౌస్ లో కూర్చున్నట్లు నేతలు మండిపోయారు.
ఇక, యూత్ కాంగ్రెస్ నేతలు గజ్వేలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేశారు. గడచిన 15 మాసాలుగా కేసీఆర్ నియోజకవర్గం ప్రజలకు కనబడటంలేదని ఫిర్యాదులో చెప్పారు. ఇప్పటికైనా కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి నియోజకవర్గంలో పర్యటించి, అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించాలని డిమాండ్ చేశారు.