మునిగిపోయిన ఎంజీబీఎస్..ప్రయాణీకుల అవస్ధలు

శుక్రవారంఅర్ధరాత్రికి వర్షపునీరు+వరదనీరు బస్టాండులోకి ఒక్కసారిగా ప్రవేశించాయి

Update: 2025-09-27 03:04 GMT
MGBS

హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టాండ్ ‘మహాత్మాగాంధి బస్ స్టేషన్’ (MGBS)మూసీ నదిలో ముణిగిపోయింది. ఛాదర్ ఘాట్ లో  మూసీ నది మధ్యలో నిర్మంచిన  ఎంజీబీఎస్ చరిత్రలో మొదటిసారి మునిగిపోయింది. గడచిన రెండురోజులుగా కురుస్తున్న భారీవర్షాల కారణంగా జంటజలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ నుండి నీటిని అధికారులు దిగువప్రాంతాలకు వదిలిపెట్టారు. అప్పటికే భారీవర్షాలు కురుస్తున్నాయి. జలాశయాలనుండి దిగువకు వదిలేసిన నీరు మూసీలో వరద సృష్టించింది. దానికి అదనంగా భారీవర్షాలు కలవటంతో నీరు ఒక్కసారిగా బస్టాండును ముంచెత్తింది. శుక్రవారం అర్ధరాత్రికి వర్షపునీరు+వరదనీరు బస్టాండులోకి ఒక్కసారిగాప్రవేశించాయి. ఫలితంగా బస్టాండ్ మొత్తం ఒక్కసారిగా జలదిగ్భందంలోకి వెళిపోయింది. జలాశయాల్లోని నీరంతా మూసీనదిలోకి చేరుతోంది. బస్టాండ్ మూసీ ఒడ్డునే ఉండటంతో నీరంతా లోపలకు వచ్చేసింది.

 బస్టాండ్ చుట్టుపక్కలున్న మూసారంబాగ్, ఛాదర్ ఘాట్ ప్రాంతాలు కూడా వర్షపునీటితో ముణిగిపోయాయి. ఒక్కసారిగా బస్టాండులోకి నీరువచ్చేయటంతో వందలాదిప్రయాణీకులు భయంతో వణికిపోయారు. పండగ సందర్భంగా తమఊర్లకు వెళ్ళటానికి వెయిట్ చేస్తున్న ప్రయాణీకులు పరిస్ధితి అన్యాయంగా తయారైంది. బస్టాండులో ఉండేందుకు లేదు అలాగని బస్టాండు బయటకు వచ్చేందుకు లేదు. పరిస్ధితిని గమనించిన ఆర్టీసీ అధికారులు వెంటనే కొందరు ప్రయాణీకులను ఆగివున్న బస్సుల్లోకి ఎక్కించారు. అయినా సమస్యకు పరిష్కారం దొరక్కపోవటంతో హైడ్రాతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది, పోలీసులు బస్టాండుకు చేరుకున్నారు.

నీటిలోనే బస్టాండులో ఎక్కడికక్కడ తాళ్ళని కట్టి ప్రయాణీకులను బస్టాండు నుండి బయటకు తీసుకొస్తున్నారు. బయట రెడీచేసిన రక్షిత వాహనాల్లో ఎక్కించి అతికష్టంమీద దూరంగా విడిచిపెడుతున్నారు. బస్టాండ్ మొత్తం జలమయమైపోయిన విషయం తెలియటంతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఉన్నతాధికారులతో పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. బాధితులకు అవసరమైనసహకారం అందించేందుకు మున్సిపల్, ఫైర్, ఇరిగేషన్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు, అధికారులను అప్రమత్తంచేశారు. శనివారం ఉదయం 8గంటలకు కూడా పరిస్ధితిలో మార్పేమీరాలేదు. కాకపోతే వర్షంతీవ్రత తగ్గుముఖంపట్టడంతో కొంతసేపటిలో పరిస్ధితి నార్మల్ గా అవుతుందని అనుకుంటున్నారు.

అర్థరాత్రి నుంచి ఎంజిబిఎస్ నుంచి బయలుదేరాల్సిన బస్సులను ఇతరప్రాంతాలనుంచి నడుపుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ  సంస్థ  మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ తెలిపారు.



బస్టాండును నీరు ముంచెత్తటంతో బయటప్రాంతాల నుండి రావాల్సిన బస్సులను చుట్టుపక్కల ప్రాంతాల్లోని బస్టాండులకు తరలిస్తున్నారు. 1978లో బస్టాండులోకి ఇలా నీరుచేరిందని అధికారులు గుర్తుచేసుకుంటున్నారు. అప్పటినుండి నగరంలో ఎంతటి భారీవర్షాలు కురిసినా బస్టాండ్ అయితే ఎప్పుడు ముణగలేదు. అలాంటిది ఇపుడు మూసీలోకి 33 వేల క్యూసెక్కుల వరదనీరు చేరుతుండటంతో ఒక్కసారిగా వరదనీరు, వర్షపునీరు కలిసి బస్టాండును ముంచెత్తాయి.

ముఖ్యమంత్రి సమీక్ష

వరుసగా అనేక రోజులుగా వర్షాలుకురవడం, మూసీనదిలో వరదలతో జంట జలాశయాల గేట్లు ఎత్తడం, మూసీకి వరద నీటి ప్రవాహం పెరగటంతో పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూసీ వెంట లోతట్టు ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

అర్ధరాత్రి ఇమ్లిబన్​​ సమీపంలో ఎంజీబీఎస్​ బస్టాండ్ చుట్టూ నీళ్లు రావటంతో అక్కడున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలను ముఖ్యమంత్రి గారు స్వయంగా సమీక్షించారు. ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్​లో మాట్లాడి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి బయటకు తీసుకు వచ్చే ఏర్పాట్లు చేశారు.

వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్​కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ, దసరా పండుగల వేళ వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ విభాగం తగిన చర్యలు చేపట్టాలనిముఖ్యమంత్రి ఆదేశించారు.

"వరుసగా రెండో రోజు కూడా హైదరాబాద్​లో భారీ వర్ష సూచన ఉండటంతో పోలీస్, ట్రాఫిక్​ హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్తు విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలి  నగరంలో నీరు నిలిచే ప్రాంతాలు, మూసీ ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాల్లో అధికారులు ప్రజలను హెచ్చరించేలా బోర్డులు పెట్టాలి. వరదతాకిడి ఉన్న వైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా దారి మళ్లించాలి," అని ముఖ్యమంత్రి సూచనలు ఇచ్చారు.

Tags:    

Similar News