తెలంగాణలో ఇద్దరు యువతుల ఆత్మహత్యలు
ప్రభుత్వోద్యోగం రాలేదని ఒకరు, గురుకుల్ పాఠశాల సీటు రాలేదని మరొకరు;
తెలంగాణలో ఇద్దరు యువతుల ఆత్మహత్యలు కలకలం రేపింది. హన్మకొండ, నారాయణ పేట జిల్లాల్లో చోటు చేసుకున్న వేర్వేరు ఆత్మహత్యలు చర్చనీయాంశమైంది.
హన్మకొండ జిల్లాలో..
హన్మకొండ జిల్లా పెదకోడె పాక గ్రామానికి చెందిన 24 ఏళ్ల రావుల ప్రత్యూష బిటెక్ పూర్తి చేసింది. రెండేళ్ల నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంట్రన్స్ పరీక్షలకు హాజరౌతుంది. కొద్ది మార్కులతో ఆమె అర్హత సాధించలేకపోతుంది.
దీంతో ప్రత్యూష మనస్థాపానికి గురైంది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చున్నీ బిగించి ఉరేసుకుంది. కొద్ది సేపటికే ప్రత్యూష కుటుంబ సభ్యులు ఇంట్లోకి వచ్చి చూడగా ప్రత్యూష విగత జీవిగా కనిపించింది. లబోదిబోమని మొత్తుకున్న కుటుంబసభ్యులు ప్రత్యూషను క్రిందకు దించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ప్రత్యూష తండ్రి రావు రమేష్ ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నారాయణ పేట జిల్లాలో..
నారాయణ పేట జిల్లా దమ్ గాన్ పూర్ కు చెందిన నర్సప్ప, లక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. 14 ఏళ్ల మనీషా గ్రామంలోని ముద్దూరు గవర్నమెంట్ స్కూల్ లో 9వ తరగతి చదువుతుంది. తండ్రి హైద్రాబాద్ లో లేబర్ వర్క్ చేసేవాడు. తల్లి వ్యవసాయకూలీగా పని చేసేది. కటిక పేదరికంతో బాధపడుతున్న మనీషా ఇటీవల గురుకుల పాఠశాలలో ఎంట్రన్స్ పరీక్ష రాసింది. పరిగి గురుకుల్ పాఠశాలలో సీటు వచ్చిందని చెప్పి ముద్దూరు పాఠశాలలో టీసీ తీసుకొని వెళ్లిపోయింది. పరిగి గురుకుల్ పాఠశాలకు వెళ్లి తన టీసీ ని చూపించింది. అడ్మిషన్ ఇమ్మని కోరగా వారు నిరాకరించారు. ‘నీకు మా దగ్గర సీటు రాలేదు అడ్మిషన్ ఎలా ఇవ్వగలం అని పరిగి గురుల్ పాఠశాల సిబ్బంది చెప్పడంతో అవాక్కవడం మనీషా వంతైంది. తాను చదువుతున్న స్కూల్ లో టీసీ తీసుకోవడంతో ఆ స్కూల్లో ప్రవేశం లేకుండా పోయింది. డిప్రెషన్ కు లోనైన మనీషా పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకుంది.కొనఊపిరితో ఉన్న మనీషాను తొలుత మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి ఆ తర్వాత గాంధీ హాస్పిటల్ లో చేర్చారు. చికిత్స పొందుతూ మనీషా శుక్రవారం తెల్లవారు జామున చనిపోయింది.
గవర్నమెంట్ జాబ్ రాకపోతే బ్రతకలేము అనుకున్న ప్రత్యూష, గురుకుల్ పాఠశాలలో సీటురాకపోతే చదువు ఆగిపోతుందని మనీష చనిపోవడం మానసిక బలహీనతలు తప్పి మరో కారణం కాదు. తన మీద తనకే నమ్మకం లేనప్పుడు ఆత్మహత్యలకు పాల్పడుతారని సైకియాట్రిస్ట్ లు చెబుతున్నారు.