Union Budget | గేమ్ ఛేంజర్ కేంద్ర బడ్జెట్, తెలంగాణ బీజేపీ ప్రశంస
పార్లమెంటులో కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ గేమ్ ఛేంజర్ గా నిలుస్తుందని తెలంగాణ బీజేపీ ప్రశంసించింది.;
By : Saleem Shaik
Update: 2025-02-01 09:26 GMT
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2025 కేంద్ర బడ్జెట్‌ను గేమ్-ఛేంజర్‌గా నిలుస్తుందని బీజేపీ రాష్ట్ర యూనిట్ ప్రశంసించింది. ఈ బడ్జెట్ గణనీయమైన ఆర్థిక సంస్కరణలను భారతీయ మధ్యతరగతికి అవసరమైన ఉపశమనాన్ని అందిస్తుందని బీజేపీ పేర్కొంది.
లక్షలాది మందికి గణనీయమైన ఆర్థిక ఉపశమనాన్ని అందించే రూ.12 లక్షల వరకు ఆదాయానికి ఆదాయపు పన్ను మినహాయింపు ఒక ముఖ్యమైన అంశమని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. బడ్జెట్ "మోదీ హై తో ముమ్కిన్ హై" అనే నమ్మకాన్ని బలోపేతం చేస్తుందన్నారు. బడ్జెట్ వ్యవసాయం, తయారీ, పరిశోధన, రక్షణ, ఆరోగ్యం, ఇంధనం, ఎగుమతులు, కార్పొరేట్ రంగంలో పరివర్తనాత్మక సంస్కరణలను ప్రవేశపెడుతుందన్నారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో 2025 -26 ఆర్ధిక సంవత్సరానికి గానూ రూపొందించిన వికసిత్ భారత్ బడ్జెట్ లో సూక్ష్మ - మధ్యతరహా పరిశ్రమలకు 10 లక్షల వరకు క్రెడిట్ సౌలభ్యం, స్టార్ట్ - అప్ లకు ప్రోత్సాహం, 5 లక్షల మంది ఎస్సి - ఎస్టీ మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా గుర్తించి వారికి 2 కోట్ల వరకు రుణాలు అందించే వెసులుబాటు కల్పిస్తున్నట్టు బీజేపీ నేతలు ప్రశంసించారు.
మధ్య తరగతి నేస్తం…మోడీ బడ్జెట్ : ఎంపీ ధర్మపురి అర్వింద్
మధ్య తరగతి నేస్తం…మోడీ బడ్జెట్ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు.భారత మధ్యతరగతి ప్రజలకు ప్రధాని మోదీ అండగా నిలుస్తున్నారని అర్వింద్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
రాజకీయ అజెండా బడ్జెట్ : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
రాజకీయ అజెండాతో కేంద్ర బడ్జెట్ సాగిందని, రాజకీయ అజెండాతోనే బీహార్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.