నేను చేసింది తప్పే.. ఒప్పుకున్న ‘రామ రాజ్యం’ రాఘవరెడ్డి
ఇకపై శాంతియుతంగా రామరాజ్య స్థాపనకు పనిచేస్తామన్న వీర రాఘవరెడ్డి.;
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో ‘రామ రాజ్యం’ వ్యస్థాపకుడు వీర రాఘవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మూడు రోజులుగా విచారిస్తున్నారు. ఇందులో భాగంగా అసలు ‘రామరాజ్యం’ స్థాపన విషయంలో ఆయన ఆలోచన ఏంటి? అన్న అంశంపై కూడా ప్రశ్నించారు పోలీసులు. ఇందులో భాగంగానే పలు కీలక విషయాలు వెల్లడించారు అధికారులు. వీర రాఘవరెడ్డి తన తప్పును అంగీకరించినట్లు చెప్పారు. తన పనులకు చింతిస్తున్నానని, రంగరాజన్‌పై దాడి చేయడం బుద్ది తక్కువ పనే అని అంగీకరించాడని పోలీసు వర్గాలు చెప్పాయి. తన చర్యల పట్ల తీవ్రంగా చింతిస్తున్నానని, మరోసారి ఇటువంటి చర్యలకు పాల్పడనని వీరరాఘవ రెడ్డి చెప్పారు.
ఇకపై శాంతియుతంగా రామరాజ్య స్థాపనకు పనిచేస్తామన్న వీర రాఘవరెడ్డి. తన వెంట వచ్చిన సైన్యం ముందు తనను చులకనగా చూడడంతోనే దాడికి దిగాల్సి వచ్చింది వివరణ ఇచ్చారు. తనను చులకన చేసినట్లు మాట్లాడటంతో ఆగ్రహం వ్యచ్చిందని, ఆ కోపంలోనే దాడి చేశానని అంగీకరించాడు వీర రాఘవరెడ్డి. కాగా ఆ తర్వాత తన పనులకు ఎంతగానో చింతిస్తున్నానని, మరోసారి అహింసా మార్గాన ప్రయాణించకుండా, శాంతియుతంగానే రామరాజ్య స్థాపన చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పినట్లు సమాచారం.
అందుకే రాజరాజ్య స్థాపన
విచారణలో భాగంగా రామరాజ్యాన్ని ఎందుకు స్థాపించావని పోలీసులు ప్రశ్నించారు. కాగా 2015లో రెండవ తరగతి చదువుతున్న తన బిడ్డను స్కూల్లో మూడో తరగతికి ప్రమోట్ చేయకుండా డీటెయిన్ చేసారని. అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగిన న్యాయం జరగకపోవడంతో రామరాజ్యాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నట్టు వీర రాఘవరెడ్డి వెల్లడించాడు. తాను చదువుకున్నది పదో తరగతి అయినా చట్టాలపై, మత గ్రంథాలపై అవగాహన పెంచుకున్నానని పోలీసులకు వెల్లడించాడు. తన బిడ్డకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని, అవినీతి రహిత సమాజం అంటే ‘రామరాజ్యమే’ అన్న ఆలోచనతోనే దీనిని స్థాపించినట్లు ఆయన వివరించారు.
అసలేం జరిగిందంటే..
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి జరిగింది. ఆయన ఇంట్లో ఉన్న సమయంలో ‘రామరాజ్యం’ ఆర్మీ ఆయనపై దాడి పాల్పడ్డారు. దీంతో రంగరాజన్.. స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయాన్ని రంగరాజన్ వెల్లడించారు. ‘‘నాపై 20 మంది దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మిగతా వివరాలు విచారణలో తెలుస్తాయి. ఇంతకు మించి నాపై జరిగిన దాడి గురించి మాట్లాడను’’ అని రంగరాజ్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ‘రామరాజ్యం’ వ్యవస్థాపకుడు వీర రాఘవరెడ్డితో పాటు దాదాపు మరో 20మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.