CMR College | సీఎంఆర్ కళాశాల బాత్రూంలో వీడియో ఘటన, పోక్సో కేసు నమోదు

సీఎంఆర్ కళాశాల హాస్టల్ విద్యార్థినుల బాత్రూంలో సీసీటీవీ కెమెరాలు అమర్పిన కేసులో మేడ్చల్ పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితుల అరెస్ట్.;

Update: 2025-01-05 11:25 GMT

సీఎంఆర్ కళాశాల హాస్టల్ బాత్ రూంలో బాలికలుండగా వెంటిలేటర్ నుంచి వారిని వీడియో తీసిన ఘటనలో ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు మేడ్చల్ డీసీపీ ఎన్ కోటిరెడ్డి చెప్పారు. తాము బాత్రూంలో ఉండగా కొందరు వీడియో తీశారని మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కళాశాల ఐటీ క్యాంపస్ విద్యార్థినులు ఆందోళన చేయడంతో మేడ్చల్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేశారు.

ఈ కేసులో కీలక నిందితులైన బీహార్ రాష్ట్రానికి చెందిన నందకిషోర్ కుమార్, గోవింద్ కుమార్ లను అరెస్టు చేసి రిమాండుకు తరలించామని డీసీపీ చెప్పారు. ఈ కేసులో బీఎన్ఎస్ సక్షన్ 77,125,49,239 11, 12,16 ,17 పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.

బాత్రూంలో సీసీటీవీ కెమెరాలు
కళాశాల హాస్టల్ వాష్ రూంల పక్కనే సిబ్బందికి గది కేటాయించడంతో వారు బాత్రూంలో సీసీటీవీ కెమెరాలు అమర్చారని పోలీసులు చెప్పారు. ఈ కేసులో అసలు నిందితులపై చర్యలు తీసుకోకుండా కేసు నుంచి తప్పించుకునేందుకు కళాశాల వార్డెన్లు, యాజమాన్యం యత్నించిందని దర్యాప్తులో తేలింది. దీంతో హాస్టల్ వార్డెన్ కేవీ ధనలక్ష్మీ, అల్లం ప్రీతిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ వరహబట్ల అనంత నారాయణ, కళాశాల డైరెక్టర్ మాదిరెడ్డి జంగారెడ్డి, కళాశాల వ్యవస్థాపక ఛైర్మన్ చామకూర గోపాల్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసును తప్పించే యత్నం
సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసినా కళాశాల యాజమాన్యం పట్టించుకోలేదని, కేసు నుంచి తప్పించుకునేందుకు యత్నించారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసును బహిర్గతం చేయకుండా కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేసిందని పోలీసులు చెప్పారు.

కేసును ఛేదించిన పోలీసులు
మేడ్చల్ ఏసీపీ బి. శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్‌ ఏసీపీ సత్యన్‌రాయణ, మేడ్చల్‌ ఎస్‌హెచ్‌వో, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు మన్మధరావు, అశోక్‌, అనిత, సైబరాబాద్‌ మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కేసును ఛేదించారు.

ప్రజలకు పోలీసుల సలహా
ఆపదలో ఉన్న లేదా సహాయం అవసరమైన ఏ అమ్మాయి లేదా స్త్రీ అయినా 100కి డయల్ చేయవచ్చునని డీసీపీ కోటిరెడ్డి చెప్పారు. సైబరాబాద్ వాట్సాప్ నెంబరు 9490617444కు కూడా సంప్రదించవచ్చునని డీసీపీ వివరించారు.



Tags:    

Similar News