Water Pollution | కాలుష్యం కాటుకు పక్షుల మృతి,కదిలిన పీసీబీ అధికారులు

ఫార్మా,కెమికల్ కంపెనీలు వెదజల్లుతున్న కలుషిత జలాలతో కాలుష్య కాసారంగా మారిన కిష్టారెడ్డిపేట్ సరస్సులో తాజాగా పక్షులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది.;

Update: 2025-01-03 09:56 GMT

విదేశాల నుంచి వలస వచ్చిన ఫ్లెమింగో పక్షులు, కింగ్ ఫిషర్, ఆషి డ్రోంగో లాంటి పలు రకాల పక్షులతో బర్డ్ వాచర్స్ కు కనువిందు చేసిన కిష్టారెడ్డిపేట్ సరస్సు...నేడు పరిశ్రమలు వెదజల్లుతున్న కలుషిత జలాలతో కాలుష్య కాసారంగా మారింది. గతంలో ఎగురుతున్న పక్షులతో కళకళలాడిన ఈ సరస్సు నేడు పక్షులకు మరణశాసనం లిఖిస్తోంది.

- సంగారెడ్డి- మేడ్చల్ జిల్లాల మధ్యలో ఉన్న కిష్టారెడ్డిపేట్ సరస్సులోకి చుట్టుపక్కల ఉన్న ఫార్మా, కెమికల్ కంపెనీల నుంచి వ్యర్థ కలుషిత జలాలు వచ్చి చేరుతున్నాయి. దీంతో నాడు పక్షులకు నిలయంగా ఉన్న ఈ చెరువు కాలుష్యం వల్ల పక్షులు మరణించే పరిస్థితులు ఏర్పడ్డాయి.
- కిష్టారెడ్డిపేట్ సరస్సు వద్ద ఫ్లెమింగోతోపాటు పలు రకాల పక్షులు చనిపోయాయి. డిసెంబరు 24వతేదీ నుంచి శుక్రవారం వరకు పలు రకాల పక్షులు కాలుష్యం కాటుకు నేలకొరిగాయి. కిష్టారెడ్డిపేట్ సరస్సు వద్ద వివిధ జాతులకు చెందిన పలు పక్షులు మృత్యువాతపడ్డాయి. మరణించిన పక్షుల్లో రివర్ టెర్న్స్, గ్రీన్ సాండ్‌పైపర్‌లు, బహుశా గార్గేనీ, వలస బాతులు ఉన్నాయి.

ఫ్లెమింగోలను చూద్దామని వస్తే అవి మరణించి ఉన్నాయి...
వేర్వేరు రోజుల్లో పక్షులను చూడటానికి సరస్సు వద్దకు వచ్చిన ముగ్గురు విద్యార్థులకు అచేతనంగా పడి ఉన్న పక్షులు కనిపించాయి.“మేం ఉదయం 6.30 గంటలకు ఫ్లెమింగో పక్షులను చూడడానికి సరస్సు వద్దకు వచ్చాం. కానీ మేం సరస్సు వద్ద చనిపోయిన పక్షిని చూశాం,చెరువు కాలుష్యం కారణంగా పక్షులు మరణించడం చూసి మేం షాక్ అయ్యాం, దీనిపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు తీసుకోవాలి’’అని పక్షి ప్రేమికులు అన్షుల్ గుప్తా, అభిషేక్ కోరారు.

రంగంలోకి దిగిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు
పరిశ్రమల నుంచి వెలువడిన కలుషిత జలాలు, గృహ వ్యర్థాల కారణంగా కిష్టారెడ్డిపేట సరస్సులో ఉన్న పక్షులు మరణించి ఉంటాయని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు భావిస్తున్నారు. పక్షులు మరణించాయని స్థానికులు చేసిన ఫిర్యాదుతో తమ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వచ్చి పరీక్షల కోసం కిష్టారెడ్డిపేట్ సరస్సులోని నీటి నమూనాలను సేకరించారని కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ సోషల్ సైంటిస్ట్ డబ్ల్యూ జీ ప్రసన్నకుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నీటి నాణ్యత పరీక్షలు చేసి, సరస్సులోని నీరు కలుషితం అయిందని తేలితే దీనికి కారణమైన పరిశ్రమలకు నోటీసులు జారీ చేస్తామని ఆయన చెప్పారు.



 కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఫార్మా పరిశ్రమలు

మెదక్ జిల్లా పటాన్ చెరు ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. దీనివల్ల ఇక్కడి ప్రజలు గుండెపోటు, ఊపిరితిత్తుల సమస్యలతో నానా పాట్లు పడుతున్నారు. కాలుష్యం కాటు వల్ల భూగర్భజలాలు కూడా కలుషితం అయ్యాయి. బోరు వేస్తే రంగునీరు వస్తుంది. ఈ నీటి వల్ల చర్మవ్యాధులు వస్తున్నాయి.

మూడు నగరాల్లో అత్యధిక కాలుష్యం
తెలంగాణ రాష్ట్రంలోని మూడు నగరాల్లో అత్యధిక కాలుష్యం ఉందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గుర్తించారు. హైదరాబాద్, సంగారెడ్డి,నల్గొండ నగరాలు దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలోకి చేరాయి. ఫార్మా, కెమికల్ కంపెనీల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు కాలుష్యాన్ని వెదజల్లుతున్న వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు, ఇతర వాహనాలు కొనుగోలు చేయాల్సి ఉంది. చెత్త కాల్చకుండా చర్యలు తీసుకొని గాలి నాణ్యతను మెరుగు పర్చేందుకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ, ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ, ఇంప్లిమెంటేషన్ కమిటీలు సమర్ధంగా పనిచేసి, కాలుష్యాన్ని నియంత్రించాలని పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రావు సూచించారు.



Tags:    

Similar News