శాంతిచర్చలపై తేల్చేసిన కేంద్రం..మావోయిస్టులు ఏంచేస్తారు ?
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతాదళాలు అడవులను జల్లెడపడుతు ఎన్ కౌంటర్లు చేస్తున్నాయి;
శాంతిచర్చలు..శాంతిచర్చలంటు మావోయిస్టులు గడచిన నెలరోజులుగా పదేపదే డిమాండ్లు చేస్తున్నారు. అయితే మావోయిస్టులతో శాంతిచర్చలు జరిపేదిలేదని ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ తేల్చిచెప్పేశారు. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో భద్రతాదళాలు మావోయిస్టుల ఏరివేతను టార్గెట్ గా పెట్టుకుని అడవులను అణువణువు గాలిస్తున్నారు. తెలంగాణ-ఛత్తీస్ ఘడ్-జార్ఖండ్-మహారాష్ట్ర-మధ్యప్రదేశ-ఏపీ లాంటి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతాదళాలు అడవులను జల్లెడపడుతు ఎన్ కౌంటర్లు చేస్తున్నాయి. 2026, మార్చినాటికి దేశంలో మావోయిస్టులే ఉండకూడదన్నది కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) పెట్టుకున్న డెడ్ లైన్. అమిత్ షా పెట్టుకున్న డెడ్ లైన్ కు తగ్గట్లే సీఆర్పీఎఫ్, బస్తర్ ఫైటర్స్, కోబ్రా, లోకల్ పోలీసు, గ్రేహౌండ్స్ లాంటి విభాగాల్లో మెరికల్లాంటి సిబ్బంది సుమారు 30 వేలమందిని ఏరికోరి మరీ ఆపరేషన్ కగార్(Operation Kagar) ను ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి.
గడచిన నాలుగునెలల్లో ఆపరేషన్ కగార్ దెబ్బకు సుమారు 300 మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో చనిపోయారు. మరో 250 మంది ప్రాణభయంతో లొంగిపోగా పదులసంఖ్యలో తుపాకి తూటాలకు తీవ్రంగా గాయపడి ఎన్ కౌంటర్లనుండి తప్పించుకున్నారు. తీవ్రంగా గాయపడి తప్పించుకున్న వారి ప్రస్తుత పరిస్ధితి ఏమిటో తెలీదు. ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు(Maoists) తుడిచిపెట్టుకుపోక తప్పదన్న టెన్షన్ అగ్రనేతల్లో పెరిగిపోతోంది. అందుకనే కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్ కౌంటర్లను ఆపేయాలని, తాము శాంతిచర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టుల అధికారప్రతినిధులు అభయ్, రూపేష్ పేరుతో పదేపదే ప్రకటనలు జారీచేస్తున్నారు. తాము డిమాండ్ చేస్తే శాంతిచర్చలకు కేంద్రప్రభుత్వం అంగీకరించటంలేదన్న ఉద్దేశ్యంతో ప్రజాసంఘాలు, పౌరహక్కులసంఘాలు, మానవహక్కులసంఘాలు, రాజకీయపార్టీల నేతలతో ప్రకటనలు ఇప్పిస్తు కేంద్రంపై ఒత్తిడిపెంచే పనిలో ఉన్నారు. అయితే ఎవరెన్ని డిమాండ్లు చేస్తున్నా, ఒత్తిడితెచ్చే ప్రయత్నాలుచేస్తున్నా కేంద్రంవైఖరిలో మార్పులేదన్న విషయం తాజాగా బయటపడింది. ఆపరేషన్ కగార్ ను ఆపే ప్రశక్తేలేదని బండి సంజయ్(Bandi Sanjay) తెగేసిచెప్పారు. ‘తుపాకులు చేతిలో పెట్టుకుని అమాయకులను పొట్టనపెట్టుకున్న మావోయిస్టులతో చర్చలు జరిపే అవకాశమే లేద’న్నారు. అమాయక గిరిజనులను ఇన్ ఫార్మర్ల పేరుతో మావోయిస్టులు అన్యాయంగా కాల్చిచంపిన విషయాన్ని కేంద్రమంత్రి గుర్తుచేశారు. ‘అమాయక గిరిజనులను కాల్చిచంపేసి ఆ కుటుంబాలను మానసిక క్షోభకు గురిచేసిన మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపద’ని స్పష్టంగా తేల్చిచెప్పేశారు.
శాంతిచర్చలు ఉండవని బండి చెప్పటం వెనుక కచ్చితంగా అమిత్ షా ఆలోచనే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే కేంద్ర హోంశాఖకు క్యాబినెట్ మంత్రి అమిత్ షా, సహాయమంత్రి బండి సంజయ్. అమిత్ షా తో మాట్లాడకుండా లేదా అమిత్ షా ఆదేశాలు లేకుండా బండి తనంతట తానుగా శాంతిచర్చలపై ప్రకటనచేసే అవకాశం ఉండదు. మావోయిస్టుల శాంతిచర్చల ప్రతిపాదనపై ఇంతకాలం నోరిప్పని బండి ఇంత సడెన్ గా ప్రకటన చేయటం గమనార్హం. సహాయమంత్రులు ఎవరూ స్వతంత్రంగా ఏమీ మాట్లాడలేరు, ఏ నిర్ణయం తీసుకునేందుకు లేదు. అందులోను అమిత్ షా క్యాబినెట్ గా ఉన్న శాఖలో సహాయమంత్రికి ఉన్న అధికారాలు ఏముంటాయో అందరు ఊహించుకోవచ్చు. కాబట్టి తనఆలోచన, నిర్ణయాన్నే బండి నోటిద్వారా అమిత్ షా చెప్పించారన్న విషయం అర్ధమైపోతోంది. శాంతిచర్చలుండవన్న విషయాన్ని కేంద్రం తేల్చేయటంతో ఇపుడు మావోయిస్టులు ముందున్న మార్గం ఏమిటి ? అన్నది ఆసక్తిగా మారింది.
మావోయిస్టుల ముందున్న మార్గాలు మూడే అని అర్ధమవుతోంది. ఒకటి ఆపరేషన్ కగార్ రూపంలో భద్రతాదళాలను ఎదుర్కుంటు ఎన్ కౌంటర్లకు బలయిపోవటం. ఒకవేళ ఎన్ కౌంటర్లను తప్పించుకున్నా ఎంతోదూరం మావోయిస్టులు వెళ్ళలేరు. ఇక రెండో ఆప్షన్ ఏమిటంటే తుపాకులను వదిలేసి పోలీసులముందు లొంగిపోవటం. మూడో ఆప్షన్ అజ్ఞాతంలోకి కూడా వెళ్ళవచ్చు కాని అలాఎంతోకాలం తమగుర్తింపునుదాచి మావోయిస్టులు తప్పించుకోలేరు. శాంతిచర్చల విషయంలో కేంద్రం నిర్ణయం ఏమిటో తేలిపోయింది కాబట్టి ఇపుడు మావోయిస్టులు ఏమిచేస్తారన్నది చూడాలి.