రామచంద్రరావును ఈ సీనియర్లు ఎందుకు కలవలేదు ?
కొత్తఅధ్యక్షుడిగా బాధ్యతలుతీసుకున్న ఎన్ రామచంద్రరావు విషయంలో కొందరుసీనియర్లు ఉల్టాగా వ్యవహరిస్తున్నట్లు పార్టీలోనే చెప్పుకుంటున్నారు;
ఉన్న ఒక్క పోస్టుకోసం ఎంతమంది ప్రయత్నించినా దక్కేదిమాత్రం ఎవరో ఒకరికే. సదరుపోస్టును దక్కించుకున్న నేతను మిగిలిన నేతలు కలిసి అభినందించటం, నిర్వహించే సమావేశాల్లో పాల్గొనటం తప్పదు. కాని తెలంగాణ పార్టీకి కొత్తఅధ్యక్షుడిగా బాధ్యతలుతీసుకున్న ఎన్ రామచంద్రరావు విషయంలో కొందరుసీనియర్లు ఉల్టాగా వ్యవహరిస్తున్నట్లు పార్టీలోనే చెప్పుకుంటున్నారు. కొత్త అధ్యక్షుడిని కలవటానికి కొందరు ఎంపీలు, సీనియర్ నేతలు పెద్దగా ఆసక్తిచూపటంలేదని సమాచారం. కేంద్రమంత్రి బండి సంజయ్ తో పాటు ధర్మపురి అర్వింద్, ఎం. రఘునందనరావు లాంటి ఎంపీలు కలవలేదని పార్టీలో టాక్ వినబడుతోంది. అలాగే ఈటల రాజేందర్ ఒకసారి రామచంద్రరావును కలిసి అభినందనలు చెప్పి, స్వీట్ తినిపించిన తర్వాత మళ్ళీ కలవలేదు. ఈటల కలవటం కూడా ఏదో మొక్కుబడిగా కలిసినట్లు తెలిసింది. కొత్త అధ్యక్షుడికి అభినందనలు చెప్పి వెంటనే ఈటల వెళ్ళిపోయారు. వీళ్ళే కాకుండా మరికొందరు ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు ఇప్పటివరకు కొత్త అధ్యక్షుడిని కలవలేదని పార్టీలో టాక్ వినబడుతోంది.
తెలంగాణ అధ్యక్ష పదవికోసం మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందనరావు, గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ లాంటి మరికొందరు గట్టిగా ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే జాతీయనాయకత్వం మాత్రం మాజీ ఎంఎల్సీ రామచంద్రరావును ఎంపికచేసింది. దీంతో సహజంగానే ప్రయత్నాలు చేసుకున్న వారిలో బాధో లేకపోతే ఆగ్రహమో సహజం. అందరూ రాజాసింగ్ లాగ తమలోని కోపాన్ని అప్పటికప్పుడు వెళ్ళగక్కరు. రాజాసింగ్ లాంటి నేతలు అప్పటికప్పుడు బయటపడితే మరికొందరు బయటపడకుండా యాక్షన్లో చూపిస్తారు.
ఇపుడు విషయంఏమిటంటే రామచంద్రరావును కొందరు ఎంపీలు, మరికొందర సీనియర్ నేతలు ఇంతవరకు కలవలేదని తెలిసింది. కారణం ఏమిటంటే రామచంద్రరావు ఎంపికను వీళ్ళంతా జీర్ణించుకోలేకపోతున్నారు. రఘునందనరావు కాలికి ఆపరేషన్ అయ్యిందికాబట్టి కొత్త అధ్యక్షుడిని కలవలేదని చెప్పుకోవచ్చు. మరి బండి, ధర్మపురితో పాటు మరికొందరు సీనియర్ నేతలు, కొందరు ఎంఎల్ఏలు ఎందుకు కలవలేదో తెలీటంలేదు. కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావును ప్రకటించినపుడు పక్కనే ఉన్న డీకే అరుణ మళ్ళీ ఇప్పటివరకు నేరుగా కలవలేదని చెబుతున్నారు. కలవకపోవటానికి ప్రతి ఒక్కళ్ళూ కారణాలను చూపించుకుంటారు కాని అసలు విషయం అయితే రామచంద్రరావును కొత్త అధ్యక్షుడిగా చూడలేకపోతున్నారనే టాక్ మాత్రం ఎక్కువగా వినబడుతోంది. మరీవిషయం జాతీయ నాయకత్వానికి తెలీకుండానే ఉంటుందా ? పరిస్ధితులను జాతీయ నాయకత్వం ఏవిధంగా సర్దుబాటు చేస్తుందో చూడాలి.