డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓవర్ యాక్షన్ చేస్తున్నారా..!
రామచందర్ రావు నియామకాన్ని బీజేపీ పునరాలోచించాలని భట్టి విక్రమార్క కోరారు.;
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓవర్ యాక్షన్ చేస్తున్నారా? సంబంధం లేని వాటిలో తల దూరుస్తున్నారా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకంపై శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలనే ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు. రామచందర్ రావు నియామకాన్ని బీజేపీ పునరాలోచించాలని భట్టి విక్రమార్క కోరారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. దళితులు, గిరిజనులను వేధించిన వారికి బీజేపీ ఉన్నత పదవులు ఇస్తుందనడానికి రామచందర్ రావు నియామకం అతిపెద్ద ఉదాహరణ అని భట్టి వ్యాఖ్యానించారు.
భట్టి అసలేమన్నారంటే..
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని రామచందర్ రావుకు ఇవ్వడాన్ని భట్టి తప్పుబట్టారు. ‘‘హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్యకు రామచందర్ రావు కారణం. రోహిత్ వేముల తన సూసైడ్ నోట్‌లో కారణాలు వెల్లడించారు. రోహిత్ వేముల ఘటన జరిగినప్పుడు రాహుల్‌గాంధీ హెచ్‌సీయూకు వచ్చి విద్యార్థులకు మద్దతిచ్చారు. ఏబీవీపీ, ఏఎస్ఏ మధ్య ఘర్షణ జరిగినప్పుడు బీజేపీ నేత రామచందర్‌రావు.. హెచ్‌సీయూకు వెళ్లి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అతని ఒత్తిడి వల్లే రోహిత్ వేములతో పాటు మరో నలుగురు విద్యార్థులను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి నేత రామచందర్ రావుకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవితో రివార్డు ఇచ్చారు. ఆయన నియామకాన్ని బీజేపీ పునరాలోచించాలి. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన సుశీల్ కుమార్‌కు ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చారు. ఇక్క రామచందర్ రావుకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారు. రోహిత్ వేములది వ్యవస్థాగత హత్య’’ అని భట్టి అన్నారు.
అసలు భట్టికి ఏం సంబంధం..!
రామచందర్ రావు నియామకాన్ని బీజేపీ పునరాలోచించాలని కాంగ్రెస్ పార్టీ నేత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. అసలు రామచందర్ రావు నియామకంతో భట్టికి ఏం సంబంధం ఉందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. తమ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి అన్న నిర్ణయం తీసుకునే బాధ్యత, అధికారం అంతా కూడా బీజేపీకే ఉంటుందని, ఆ విషయంలో అసలు భట్టి ఎందుకు వేలు పెడుతున్నారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
దాంతో పాటుగా నిజంగా ఒక యువకుడి హత్యకు కారణమైన వ్యక్తి పదవి రాకూడదన్నదే భట్టి ఉద్దేశం అయితే.. రామచందర్ రావు నియామకాన్ని ప్రకటించిన రోజే ఆయన ఎందుకు స్పందించలేదు? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. జులై 5న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు ఛార్జ్ తీసుకున్నారని, అప్పటి నుంచి మౌనంగా ఉన్న భట్టి.. దాదాపు ఆరు రోజుల తర్వాత ఎందుకు ప్రశ్నిస్తున్నారని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అసలు ప్రత్యర్థి పార్టీకి వాళ్లు ఎవరికి ఏ పదవి ఇవ్వాలో చెప్పడం ముమ్మాటికీ భట్టి ఓవరాక్షనే అవుతుందని విశ్లేషకులు చురకలంటిస్తున్నారు.