కోమటిరెడ్డి కోటలో బీజేపీ పాగా వేస్తుందా?

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. కోమటిరెడ్డి బ్రదర్స్,ఎమ్మెల్యేలను రంగంలోకి దించడం ద్వారా కాంగ్రెస్ గెలుపునకు వ్యూహం పన్నారు.

Update: 2024-04-10 10:28 GMT
Bhuvanagiri Parliamentary Candidates

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2014 వసంవత్సరంలో జరిగిన భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత గౌడ్ బీఆర్ నుంచి బీజేపీకి ఫిరాయించారు. ప్రస్థుతం భువనగిరి బరిలో బీజేపీ అభ్యర్థిగా గౌడ్ నిలిచారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ డిస్కవరీ ఇండియా టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు. ఇబ్రహీం పట్నం మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా పనిచేసిన క్యామ మల్లేష్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.


పోటాపోటీగా మూడు పార్టీల ప్రచారం
- కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీర్వాదంతో గెలుస్తామని చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాల వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతిందని చామల చెప్పారు.సోనియానే తెలంగాణ ఇచ్చినందున ఓటర్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించి రుణం తీర్చుకోవాలని కోరారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇవ్వాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల అమలు, కోమటిరెడ్డి బ్రదర్స్ బలగం, కాంగ్రెస్ బలంపై కిరణ్ కుమార్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు.,
- బూర నర్సయ్య గౌడ్ ప్రముఖ డాక్టర్. బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎంపీ అయ్యారు. అనంతరం గులాబీ జెండా రంగు మార్చి కాషాయకండువా కప్పుకున్న నర్సయ్య గౌడ్ మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. మోదీ అభివృద్ధి పనులు, రామాలయం తనను గెలిపిస్తామని గౌడ్ ధీమాగా చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్ అని దేశంలో మోదీ చేసిన అభివృద్ధి పనులు, తాను ఎంపీగా చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని బూర నర్సయ్యగౌడ్ చెప్పారు. మరో సారి మోదీ ప్రధాని అవుతారని, భారతదేశ, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలని గౌడ్ చెప్పారు. భువనగిరిలో బీజేపీ గెలవకపోతే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేస్తానని సవాలు విసిరారు.
-కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన కరవు అని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కల్లబొల్లి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చడంలో విఫలమైందని క్యామ మల్లేష్ ఆరోపించారు. బీజేపీ మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటుందని క్యామ మల్లేష్ ఆరోపించారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో అతిపెద్ద యాదాద్రి దేవాలయాన్ని నిర్మించినా తాము అయోధ్య రామాలయం పేరిట తాము ఓట్లు అడుక్కోవడం లేదని బీజేపీకి మల్లేష్ కౌంటర్ వేశారు. దేవాలయాన్ని రాజకీయాలకు ముడిపెట్టరాదని ఆయన పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో యూనివర్శిటీని నక్రేకల్, తుంగతుర్తిలో ఐటీ పార్కు, జనగామలో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలనేదే తన లక్ష్యమంటూ మల్లేష్ ప్రచారం చేస్తున్నారు.
- భువనగిరి నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండగా ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఓటమి తర్వాత భువనగిరి బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని వారంటున్నారు.
- భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటు అయ్యాక మూడు సార్లు ఎన్నికలు జరగ్గా రెండు సార్లు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంపీలుగా ఘన విజయం సాధించారు. సిట్టింగ్ ఎంపీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర మంత్రి అయ్యారు. మరో వైపు 2014 వసంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన గెలిచిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ కాషాయ తీర్థం స్వీకరించి ఈ సారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
పునర్ విభజనలో నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల కలుయికతో ఏర్పడింది భువనగిరి లోక్ సభ నియోజకవర్గం. భువనగిరి, మునుగోడు, ఇబ్రహీంపట్నం, నక్రేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగామ అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన ఈ నియోజకవర్గంలో అక్షరాస్యులైన ఓటర్లు 58.9 శాతం మంది ఉన్నారు.

భువనగిరిపై కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలతో సీఎం సమీక్ష
సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వచ్చారు.బుధవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేయన్నందున అదే రోజున సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత మే మొదటి వారంలో మరో బహిరంగ సభకు ప్రియాంకగాంధీ హాజరు కానున్నారు.

కోమటిరెడ్డి కుటుంబసభ్యులకు దక్కని ఎంపీ టికెట్
భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తన భార్య, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమార్తెను ఎన్నికల బరిలోకి దించాలనుకున్నారు. కానీ అనూహ్యంగా ఏఐసీసీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును భువనగిరి నుంచి బరిలోకి దింపింది. అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి, మాజీ సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి మద్ధతు కోరారు. దీంతోపాటు సీఎం, టీపీసీసీ అధ్యక్షుడైన ఎ రేవంత్ రెడ్డి బుధవారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి పలకరించాలని నిర్ణయించుకున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ సహకారం తీసుకోవడం ద్వారా భువనగిరి స్థానాన్ని కైవసం చేసుకోవాలని సీఎం వ్యూహాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ భువనగిరి కోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించారు.

బలహీనవర్గాల ఓటర్లే కీలకం
భువనగిరిలో ఎస్సీ, ఎస్టీ ఓటర్లే కీలకంగా ఉన్నారు. నియోజకవర్గంలో బలహీనవర్గాల ఓటర్లు 40శాతానికి పైగా ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 19.6 శాతం, ఎస్టీ ఓటర్లు 6 శాతం, ముస్లిం ఓటర్లు 3,7 శాతం, క్రిస్టియన్ ఓటర్లు 1.24 శాతం మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 10.8 శాతం మంది బీసీ ఓటర్లు ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల బలం
భువనగిరిలో కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల బలం ఉంది. ఇబ్రహీంపట్నం, మునుగోడు, భవనగిరి, నక్రేకల్, తుంగతుర్తి, ఆలేరు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. ఒక్క జనగామలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాదు పార్టీ కార్యకర్తల బలం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీకి మల్ రెడ్డిరంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు),కుంభం అనిల్ కుమార్ రెడ్డి (భువనగిరి), వేముల వీరేశం (నక్రేకల్), మందుల సామ్యేల్ (తుంగతుర్తి) ఐలయ్య బీర్ల (ఆలేరు) ఎమ్మెల్యేలున్నారు.

పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే అత్యధిక ఓట్లశాతం
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే అత్యధిక ఓట్లు లభించాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 53. 1 శాతం ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి అత్యథికంగా 44.4 శాతం ఓట్లు వచ్చాయి. అంటే బీఆర్ఎస్, బీజేపీ కంటే అత్యధిక ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఆరు స్థానాలు, ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 44 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 44.4 శాతం ఓట్లతో ఎంపీగా విజయం సాధించారు.

బీజేపీకి గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లశాతం
భవనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీకి గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లశాతం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 4.9 శాతం ఓట్కే దక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప బీఆర్ఎస్ పార్టీ కంటే 16.7 శాతం అత్యధిక ఓట్లతో కాంగ్రెస్ విజయం సాధించింది. అలాగే 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీకి కేవలం 5.4 శాతం ఓట్లే వచ్చాయి. అప్పట్లో సీపీఐ అభ్యర్థి బరిలో నిలవడంతో ఆ పార్టీ అభ్యర్థికి 2.3 శాతం ఓట్లు దక్కాయి.

సమస్యలెన్నో...
భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పలు సమస్యలు తెరమీదకు వచ్చాయి. ఓట్లు అడిగేందుకు వస్తున్న ప్రధాన పక్షాల అభ్యర్థుల ముందు ఓటర్లు తమ సమస్యలను ఏకరవు పెడుతున్నారు. తపాస్ పల్లి ప్రాజెక్టు నిర్మాణంతో మునిగిపోయిన వ్యవసాయ భూములకు రైతులకు ఇంకా నష్టపరిహారం అందలేదు. ఈ నియోజకవర్గంలో చేనేత, బీడీ, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల ఓట్లే కీలకంగా మారటంతో అభ్యర్థులు వారిని కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇక్కడ ఫ్లోరైడ్ పీడితుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. పట్టణీకరణ పెరిగిపోవడంతో కొత్త సమస్యలు ఏర్పడ్డాయి. రైల్వే ట్రాక్‌లపై లెవెల్‌ క్రాసింగ్‌లకు బదులుగా నిర్మించిన, రోడ్‌ అండర్‌ బ్రిడ్జిల వద్ద నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. నార్కట్‌పల్లి నుంచి బీ.వెల్లెంలకు వెళ్లే దారిలో నడికుడి-సికింద్రాబాద్‌ రైల్వే లైన్‌పై నిర్మిస్తున్న ఆర్‌యూబీ పనుల్లో జాప్యంతో స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
భువనగిరిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతోపాటు బలగం ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఎన్నికల ప్రచార రంగంలోకి దించడం, స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల బలంతో ప్రత్యేక వ్యూహాన్ని సీఎం రూపొందించారు. సీఎం రేవంత్ రూపొందించిన వ్యూహంతో భువనగిరి ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందా లేదా అనేది ఎన్నికల ఫలితాలు తేలే వరకు వేచిచూడాల్సిందే.





Tags:    

Similar News