కేకే మాటలకు అర్థమిదేనా ? ఫాం హౌస్ కు పరుగెత్తుకెళ్ళిన కేకే

సీనియర్ నేత కేకే ఎర్రవల్లి ఫాం హౌస్ కు పరుగెత్తారు. కేకే ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదాస్పదమవటంతో కేసీయార్ నుండి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

Update: 2024-03-28 10:04 GMT

కేకే మాటలకు అర్థమిదేనా ? ఫాం హౌస్ కు పరిగెత్తిన కేకే

బీఆర్ఎస్ సీనియర్ నేతల్లో ఒకరైన రాజ్యసభ ఎంపీ కే కేశవరరావు(కేకే) మాటల్లో ఏదో తేడా కొడుతోంది. రాబోయే పార్లమెంటు ఎన్నికలపై మాట్లాడుతు బీఆర్ఎస్ ది థర్డ్ ప్లేసే అని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రధాన పాటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని చెప్పిన కేకే మొదటి, రెండో ప్లేసులో ఎవరుంటారో ఇప్పుడే చెప్పలేమన్నారు. రేవంత్ రెడ్డి పాలనపై జనాల్లో సంతృప్తి కనబడుతోందన్నారు. అయోధ్య అక్షింతల ఎఫెక్టు కూడా ఉంటుందని అభిప్రాపడ్డారు. జనాల ఫోకస్ అంతా నరేంద్రమోడీ, రాహుల్ గాంధీపైనే ఉందన్నారు.


కేకే ఇంటర్వ్యూ బీఆర్ఎస్ ను బాగా డ్యామేజి చేసిందనే చెప్పాలి. అందుకనే ఫాంహౌస్ లో ఉన్న కేసీయార్ తనను కలవమని కేకేని ఆదేశించినట్లు పార్టీ వర్గాల సమాచారం. దాంతో కేకే హుటాహుటిన కేసీయార్ దగ్గరకు పరిగెత్తుకుంటు వెళ్ళారు. కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి తొందరలోనే కేకే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారనే ప్రచారంలో సడెన్ గా కేసీయార్ నుండి ఆదేశాలు రావటం ఆసక్తిగా మారింది. 

కేకే మాటలను బట్టిచూస్తే తొందరలోనే ఈ సీనియర్ నేత కూడా కేసీయార్ కు షాకివ్వటం తప్పదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బహుశా ఈయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్ తోనే. కాంగ్రెస్ తో కేకే అనుబంధం, ప్రయాణం కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. అలాగే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈయన కూతురే. కేకే ఒత్తిడి కారణంగానే అప్పట్లో గద్వాలను కేసీయార్ హైదరాబాద్ మేయర్ గా ఎంపికచేశారు. అలాంటి మేయర్ ఈమధ్యనే రేవంత్ రెడ్డిని కలిశారు. తొందరలోనే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవటం ఖాయమనే సూచనలు కనబడుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ కార్పొరేటర్లను లాగేసుకోవటంపై కాంగ్రెస్ కన్నేసింది.

జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు కార్పొరేటర్లు లేకపోయినా బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎంఐఎం కార్పొరేటర్ల మద్దతుగా గద్వాలను పదవిలో నుండి దింపేయటం ఖాయంగా కనిపిస్తోంది. అందుకనే ముందుజాగ్రత్తగానే తానే కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయే ఆలోచనలో గద్వాల ఉన్నారట. గద్వాల కాంగ్రెస్ లోకి వెళ్ళటం జరిగితే కేకే అనుమతిలేకుండా జరగదు. కాబట్టి తండ్రి, కూతుళ్ళు లేదా ముందు కూతురు తర్వాత తండ్రి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవటం ఖాయమనే అనిపిస్తోంది. పార్టీ మారాలని డిసైడ్ అయిన తర్వాత కేకే పై విధంగా మాట్లాడినట్లు అర్ధమవుతోంది. లేకపోతే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 14 సీట్లు వస్తుందని ఒకవైపు కేసీయార్ చెబుతుంటే అందుకు విరుద్ధంగా కారుపార్టీది మూడోస్ధానమే అని కేకే చెప్పటంలో అర్ధమేంటి ?

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని కేకే చెప్పారంటే బీఆర్ఎస్ ను జనాలు పట్టించుకోవటంలేదని చెప్పకనే చెప్పినట్లుగా అర్ధమవుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తమపార్టీపై తీవ్రమైన ప్రభావం పడిందని అంగీకరించారు. దాని కారణంగానే ఎంత ప్రయత్నించినా బీఆర్ఎస్ మూడోప్లేసు దాటదని కూడా తేల్చేశారు. అభ్యర్ధి పాపులారిటితో పాటు పార్టీ ఇమేజి కూడా ఎన్నికల్లో చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. అనేక కారణాలతో పార్టీ ఇమేజి దెబ్బతిన్నట్లుగా కేకే అంగీకరించారు. కేసీయార్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ మాట్లాడుతు రేవంత్ ప్రభుత్వంపై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోందని పదేపదే చెబుతున్నారు. ఇదే సమయంలో కేకే మాట్లాడుతు రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని చెప్పటం గమనార్హం.

కేకే తాజా ఇంటర్వ్యూని గమనిస్తే కేసీయార్, కేటీయార్ మాటలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని అర్ధమైపోతోంది. బీఆర్ఎస్ లో ఉండదలకుచున్న నేతలెవరు కేసీయార్, కేటీయార్ ఆలోచనలకు విరుద్ధంగా మాట్లాడే అవకాశంలేదని అందరికీ తెలుసు. రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని, జనాలంతా ఆగ్రహంగా ఉన్నారని తెల్లారిలేచింది మొదలు కేసీయార్, కేటీయార్ గోలచేస్తుంటే కేకే మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడారు. అందుకనే కేకే బీఆర్ఎస్ ను వదిలేసేందుకు డిసైడ్ చేసుకున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. పార్టీని వదిలేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టే రేవంత్, కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడారు.

ఇదే విషయమై సీనియర్ జర్నలిస్టు అమరవాది రవీంద్రశేషు మాట్లాడుతు పార్లమెంటు ఎన్నికల్లో కేకే చెప్పిందే జరిగేట్లుందన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి ట్రెండే కనిపించిందన్నారు. బీజేపీకి ఏవైనా అనూహ్యంగా వస్తే తప్ప పార్లమెంటు సీట్లు పెద్దగా వచ్చే అవకాశంలేదన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని గమనిస్తే బీజేపీకి రెండు, మూడు లోక్ సభ సీట్లకన్నా వచ్చే అవకాశంలేదని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News