తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరో తేలిపోతుందా ?

దాఖలైన నామినేషన్లు, ఉపసంహరణల తర్వాత కొత్త అధ్యక్షుడిని శోభ ప్రకటించే అవకాశముంది;

Update: 2025-06-28 13:24 GMT
Telangana BJP

ఎప్పటినుండో ఊరిస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పేరు ఆదివారం రాత్రికి ఫైనల్ కాబోతోంది. పరిస్ధితున్నీ అనుకూలిస్తే బహుశా జూలై 1వ తేదీన కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించే అవకాశముంది. తెలంగాణ బీజేపీ(Telangna BJP) అధ్యక్షుడి ఎన్నికకు పార్టీ జాతీయనాయకత్వం షెడ్యూల్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారమైతే అధ్యక్షుడిగా పోటీచేయాలని అనుకుంటున్న నేతలు జూన్ 30వ తేదీన నామినేషన్లు దాఖలు చేస్తారు. అదేరోజు సాయంత్రానికి ఉపసంహరణలు కూడా ఉంటాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అవసరమైతే జూలై 1వ తేదీన ఎన్నిక జరుగుతుంది. తెలంగాణ పార్టీ ఎన్నికల ఇన్చార్జి, కేంద్రమంత్రి శోభా కరంజ్లాదే ఆదివారం రాత్రికి హైదరాబాదుకు చేరుకుంటారు.

దాఖలైన నామినేషన్లు, ఉపసంహరణల తర్వాత కొత్త అధ్యక్షుడిని శోభ ప్రకటించే అవకాశముంది. పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే ఇప్పటికే కొత్త అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని జాతీయ నాయకత్వం డిసైడ్ చేసేసింది. ఇపుడు జరుగుతున్న తంతు అంతా కేంద్ర ఎన్నికల కమిషన్ నియమాలను పాటిస్తున్నామని చెప్పుకోవటానికి మాత్రమే. జాతీయ నాయకత్వం నిర్ణయించేసిన తర్వాత అధ్యక్ష పదవికి పోటీచేసేంత ధైర్యం ఎవరికి ఉంటుంది. ఇప్పటికి అయితే అధ్యక్ష పదవి రేసులో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar), నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind), మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ(DK Aruna), మెదక్ ఎంపీ రఘునందనరావు(Raghunandan Rao)తో పాటు కొందరి ఎంఎల్ఏల పేర్లు గట్టిగా వినబడుతున్నాయి.

ఇప్పటికైతే కొత్త అధ్యక్షుడి పేరు జాతీయ నాయకత్వం లీక్ చేసినట్లు లేదు. అందుకనే నామినేషన్లు వేయటానికి కొందరు నేతలు రెడీ అవుతున్నారు. పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే నామినేషన్లు వేసిన వాళ్ళంతా చివరకు ఆదివారం రాత్రికి ఉపసంహరించుకోవటం ఖాయం. జాతీయ నాయకత్వం ఎవరిపేరుకు అయితే టిక్ పెడుతుందో సదరు నేత మినహా మిగిలిన వాళ్ళంతా నామినేషన్లు ఉపసంహరించుకుంటారు. అప్పుడు అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లుగా కలరింగ్ ఇచ్చుకుంటారు. ఇపుడు అధ్యక్షుడిగా ఉన్న కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి(Kishan Reddy)కి చాలా మెతకమనిషిగా పేరుంది. తనను తప్పించి కొత్త అధ్యక్షుడిని నియమించాలని నరేంద్రమోదీ, అమిత్ షా తో పాటు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కిషన్ చాలాకాలంగా కోరుతున్నట్లు సమాచారం. కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న విషయంలో తేల్చుకోలేకపోవటంతోనే ఇంతకాలం పార్టీ కాలయాపన చేసింది. మొత్తానికి కొత్త అధ్యక్షుడిపై క్లారిటి రావటంతోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. మరి కొత్త అధ్యక్షుడు ఎవరనేది బహుశా ఆదివారం రాత్రికే తేలిపోవచ్చు.

Tags:    

Similar News