బిర్యానీకి ఒక ప్రాణం బలి.. ఆగమాగంగా ఫుడ్ ఇండస్ట్రీ..

ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగమేఘాలపై అనేక రెస్టారెంట్లపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బిర్యానీ తిని ప్రాణం కోల్పోయిన విషయం కీలకంగా మారింది.;

Update: 2025-05-03 11:17 GMT

బయట ఏం తినాలన్నా భయమేస్తోంది. ఏది ఎలా తయారు చేస్తారో, ఎలాంటి పదార్థాలు వాడతారో అర్థం కాక.. అసలు తినడమే బంద్ చేసే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా బయట నుంచి తెప్పించుకున్న బిర్యానీ తిని ఒక మహిళ మరణించగా.. ఆమె భర్త పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగమేఘాలపై అనేక రెస్టారెంట్లపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బిర్యానీ తిని ప్రాణం కోల్పోయిన విషయం కీలకంగా మారింది. ఈ ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

అసలు విషయం ఏంటంటే..ఎర్రబోడ ప్రాంతానికి చెందిన రమేష్(48), రాజేశ్వరి(38) భార్యభర్తలు. రమేష్.. బాలానగర్‌లోని ఓ ఫ్యాక్టీరీలో పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చే సమయంలో రమేష్.. బాలానగర్‌లోని ఓ రెస్టారెంట్‌ నుంచి ఇంటికి బిర్యానీ తీసుకొచ్చాడు. బిర్యానీని ఇద్దరూ తిన్నారు. తెల్లవారుజాము నుంచి ఇద్దరికీ వాంతులు, విరేచనాలు, తలతిరగడం జరగడంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి వెళ్లిన చికి్త్స పొందారు. కాగా గురువారం రాజేశ్వరి మరణించింది. ఆమెకు కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. రమేష్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో అతడిని ఉప్పర్‌పల్లిలోని ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ అయిందని వైద్యులు గుర్తించారు. ఆ కారణంగానే తన చెల్లి కూడా మరణించిందంటూ రాజేశ్వరి అక్క పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని నెలలుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. దాదాపు ప్రతి రెస్టారెంట్‌లో తనిఖీలు చేసి.. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పలు రెస్టారెంట్ల లైసెన్స్‌లు క్యాన్సిల్ చేస్తే మరికొన్నిటికీ సీల్ కూడా వేశారు. ఇంకొందరి దగ్గర నుంచి ఫైన్‌లు వసూలు చేశారు. ఇంతలా చర్యలు తీసుకుంటున్నా.. రెస్టారెంట్లలో ఆహార కల్తీ యథేచ్ఛగా జరుగుతుంది. అందుకు కారణం.. రెస్టారెంట్ల సంఖ్య, వాటిని తనిఖీ చేయడానికి ఉన్న అధికారుల సంఖ్య మధ్య ఉన్న తేడా అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌లో లైసెన్స్ ఉన్న రెస్టారెంట్లు, ఫుడ్ స్టాళ్ల సంఖ్య దాదాపు 80వేలు ఉన్నాయని, లైసెన్స్ లేని ఫుడ్ ట్రక్స్, రోడ్ సైడ్ బిజినెస్‌లు వంటివి మరో 20వేల ఉండొచ్చని సమాచారం. వీటన్నింటినీ తనిఖీ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న అధికారుల సంఖ్య.. మహా అయితే 500 ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ లెక్కన అధికారులు రోజుకు పది రెస్టారెంట్లు తనిఖీలు చేసినా.. అన్ని రెస్టారెంట్లను తనిఖీ చేసి, చర్యలు తీసుకోవడానికి సంవత్సరాలు పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అందువల్లే అధికారులు తమ దగ్గరకు వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అన్న ధీమాతోనే అనేక రెస్టారెంట్లు యథేచ్చగా ఆహార కల్తీకి పాల్పడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. దీని వల్లే ఇప్పుడు కల్తీ ఆహారం తిని ఒక మహిళ మరణించింది. ఆమెకు అంత్యక్రియలు కూడా జరిగిపోవడంతో అసలు కల్తీ ఎక్కడ జరిగింది అనేది స్పష్టత లేకుండా పోయింది. ఫుడ్ పాయిజన్‌కు వారు తిన్న బిర్యానీలో ఏది కారణమైంది అనేది ఇప్పటి వరకు తేలలేదు. బహుశా విషమ పరిస్థితుల్లో ఉన్న భర్త నుంచి శాంపిళ్లు తీసుకుని పరీక్షలు చేసి, పోలీసులు యాక్షన్ తీసుకుంటారేమో చూడాలి.

Tags:    

Similar News