'వారు తమిళంలో సంతకం చేయరు'

భాషా వివాదం నేపథ్యంలో డీఎంకెపై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ..;

Update: 2025-04-06 13:56 GMT
Click the Play button to listen to article

ప్రధాని మోదీ(PM Modi) మరోసారి తమిళనాడు(Tamil Nadu) సీఎం ఎంకే స్టాలిన్‌(CM MK Stalin)ను పరోక్షంగా విమర్శించారు. తమిళనాడు నాయకుల నుంచి తనకు అనేక ఉత్తరాలు వస్తున్నాయని, అయితే వాటిలో ఎవరూ కూడా తమ సంతకాన్ని తమిళంలో చేయలేదని పేర్కొన్నారు. తమిళనాట గత కొంతకాలంగా హిందీ భాషా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తమిళనాడులో పర్యటించిన ప్రధాని రూ. 8,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తమిళ భాషను ప్రపంచమంతా విస్తరించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, పేదలకు ప్రయోజనం చేకూర్చేలా తమిళ మాధ్యమంలో వైద్య విద్యను అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.

ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే(DMK) ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య గత కొన్ని నెలలుగా విభేదాలు ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తోందని రాష్ట్రం ఆరోపిస్తోంది.

'నిధుల కోసం ఏడుస్తారు'

రాష్ట్రానికి నిధుల విడుదలలో పక్షపాత పూరితంగా వ్యవహరిస్తోందని డీఎంకే నాయకులు కేంద్రాన్ని తరుచూ విమర్శిస్తున్న నేపథ్యంలో.. ‘‘తమిళనాడుకు కేటాయింపులు పెంచినా.. కొంతమంది నిధుల కోసం ఇంకా ఏడుస్తున్నారు. 2014 కంటే ముందుతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ నిధులు కేటాయించాం’’ అని మోదీ చెప్పారు.

"గత దశాబ్దంలో రాష్ట్ర రైల్వే బడ్జెట్ ఏడు రెట్లు పెరిగింది. అయినా కొంతమంది ఎటువంటి కారణం లేకుండా ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. 2014 కి ముందు ఏటా రూ. 900 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే ఈ సంవత్సరం తమిళనాడు రైల్వే బడ్జెట్ రూ. 6,000 కోట్లు దాటింది. అదనంగా కేంద్రం ప్రభుత్వం రామేశ్వరంలోని స్టేషన్‌తో సహా 77 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది" అని పేర్కొన్నారు.

స్టాలిన్ గైర్హాజరు..

బహిరంగ సభకు ముందు పంబన్ సముద్ర వంతెనను అలాగే రామేశ్వరం-తాంబరం (చెన్నై) రైలు సర్వీసును ప్రారంభించారు. అయితే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ కార్యక్రమాలకు హాజరుకాలేదు. అంతకుముందే ఖరారయిన అధికారిక కార్యక్రమంలో భాగంగా స్టాలిన్ ఉదగమండలంలో ఉన్నారు.

Tags:    

Similar News