బీఎస్పీ తమిళనాడు చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకేసులో మరో ముగ్గురి అరెస్టు

బీఎస్పీ తమిళనాడు చీఫ్ కె ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకేసులో మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌ను జూలై 5న తమిళనాడులో ఒక ముఠా నరికి చంపిన విషయం తెలిసిందే.

Update: 2024-07-28 09:06 GMT

బీఎస్పీ తమిళనాడు చీఫ్ కె ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను ఎన్ విజయకుమార్ (21), వి ముఖిలన్ (32), ఎన్ విఘ్నేష్(27)గా గుర్తించారు. వారిని ఆదివారం స్థానిక కోర్టులో హాజరుపరచగా 15 రోజుల కస్టడీ విధించారు. తాజా అరెస్టుతో తమిళనాడులో సంచలనం సృష్టించిన ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తుల సంఖ్య 20కి చేరుకుంది. ఈ కేసులో నిందితుడైన కె తిరువేంగడం జూలై 14న పోలీసులు ఎన్‌కౌంటర్లో చనిపోయాడు. తిరువేంగడంను అరెస్టు చేసిన తర్వాత దర్యాప్తులో భాగంగా ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు అతడిని నగరంలోని ఒక ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో పోలీసు సిబ్బందిపై కాల్పులు జరిపి వారి కస్టడీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం ఆయనపై కాల్పులు జరిపామని దాంతో తిరువేంగడం చనిపోయాడని పోలీసులు తెలిపారు.

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను జూలై 5న తమిళనాడులో ఒక ముఠా నరికి చంపింది. ఈ ఘటనతో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నాడీఎంకే సహా ప్రతిపక్షాలు ఆరోపించాయి. అంత్యక్రియలకు బీఎస్పీ చీఫ్ మాయవతి కూడా హాజరయ్యారు.

ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతితో పాటు పలువురు నేతలు కూడా సీబీఐ దర్యాప్తునకు పట్టుబట్టారు.

Tags:    

Similar News