ఓరి మీఅమ్మ కడుపులు మాడా, నమ్మించి గొంతు కోశారు కదరా!
ఆమె టెస్కాబ్ జీఎం. ఆమె మాటలు నమ్మి డిపాజిట్లు చేస్తే రూ.200 కోట్లతో బిచాణా ఎత్తేశారు. బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఆమె తన కుటుంబ సభ్యులతో పరారయ్యారు.
By : The Federal
Update: 2024-05-21 06:41 GMT
ఆమె టెస్కాబ్ జీఎం. ఆమె మాటలు నమ్మి డిపాజిట్లు చేస్తే రూ.200 కోట్లతో బిచాణా ఎత్తేశారు. బాధితులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేరానికి ఆమె తన కుటుంబ సభ్యులతో పరారయ్యారు.
'ఓరి మీ అమ్మకడుపులు మాడా, మా కొంప ముంచారు కదరా, మిమ్మల్ని నమ్మి మా పిల్లల పెళ్లికి దాచిన డబ్బుల్నే దొంగిలించారు కదరా'.. ఓ తల్లి ఆవేదన
'నమ్మించి గొంతు కోయడానికి మాలాంటోళ్లే దొరికారా, మీరు నాశనమైపోతార్రా కొడకల్లారా' ఓ పెద్దాయన కడుపుమంట
"పెన్షనంతా తెచ్చి మీ మొహనా పెడితే మాకడుపే కొట్టారు, మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. కేసు పెడతా, కోర్టులకీడుస్తా" అంటూ ఓ ఇంకో వయోధికుని ఆక్రోశం..
ఇలా ఒకరా, ఇద్దరా.. వందలాది మంది తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుని నట్టనడిబజార్లో హాహాకారాలు చేస్తున్నారు. అధిక వడ్డి ఇస్తామంటే ఆశపడితే ఉన్నదే లేకుండా పోయినట్టయింది. ఇలా మోసపోయిన వారిలో హైదరాబాద్ నగర ప్రజల మొదలు కృష్ణా జిల్లా వాసుల వరకు ఎందరెందరో ఉన్నారు.
అసలేం జరిగిందంటే...
రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆప్కాబ్ కూడా రెండుగా చీలింది. తెలంగాణలో సహకార బ్యాంకు- టెస్కాబ్- అవతరించింది. ఆ బ్యాంకుకు జనరల్ మేనేజరుగా పని చేసిన ఓ మహిళా ఉద్యోగి మాటలు నమ్మి ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. 537 మంది రూ.200 కోట్ల డిపాజిట్లు సేకరించిన ఆ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ బిచాణా ఎత్తేసింది. దీంతో మా డబ్బులు మాకివ్వాలంటూ బాధితులు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో మే 20న ఫిర్యాదు చేశారు. ఈ ఫైనాన్స్ సంస్థ నిర్వాహకుని భార్య వాణిబాల... తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ (టెస్కాబ్)లో జీఎం. ఆమె మాటలు నమ్మి సహోద్యోగులు, అధికారులు భారీగా ఆ సంస్థలో డిపాజిట్లు చేసి మోసపోయారు. ఇప్పుడామెను బ్యాంకు యాజమాన్యం సస్పెండ్ చేసింది. బాధితులు ఆమెపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తూ ఊగిపోతున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మేకా నేతాజీ, ఆయన కుమారుడు శ్రీహర్ష కి హైదరాబాద్ అబిడ్స్‌లో శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్, గ్రాఫిక్ సిస్టమ్, ఫైనాన్స్ కంపెనీ ఉన్నాయి. నేతాజీ భార్య నిమ్మగడ్డ వాణిబాల. ఆమె టెస్కాబ్ జనరల్ మేనేజర్. తమ కుటుంబం నిర్వహిస్తున్న ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్లు చేస్తే అధిక వడ్డీ ఇస్తామని పెద్దఎత్తున డబ్బు సేకరించారు. నేతాజీ భార్య నిమ్మగడ్డ వాణీబాల టెస్కాబ్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్లు చేస్తే 15-18 శాతం వడ్డీ ఇస్తారంటూ తన సహోద్యోగులు, తమ బ్యాంకు ఖాతాదారులు, విశ్రాంత ఉద్యోగులు, టెస్కాబ్‌లో డిపాజిట్ చేయడానికి వచ్చేవారిని వాణీబాల నమ్మించేవారు. ఆమె మాటలు నమ్మి ఎక్కడెక్కడి వాళ్లు సైతం పెట్టుబడులు పెట్టారు. ఇలా పెట్టిన వారిలో టెస్కాబ్ అధికారులు, వివిధ జిల్లాల డీసీసీబీల సిబ్బంది ఉన్నారు. ఈ కంపెనీలో రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు డిపాజిట్లు చేశారు. కొన్నేళ్లు అందరికీ వడ్డీలు సక్రమంగా చెల్లించే వారు. దీంతో మూడు రాష్ట్రాల్లో సుమారు 537 మంది ఈ కంపెనీలో రూ.200 కోట్లు డిపాజిట్ చేశారు. వాణీబాల సూచనతో శ్రీప్రియాంక ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్ చేశారు.
గత నవంబర్ నుంచి కనిపించకుండా పోయారు...
సక్రమంగా వడ్డీ డబ్బులు వస్తున్నాయన్న సంతోషంలో ఉన్న డిపాజిటర్లకు నిర్వాహకులు 2023 నవంబర్ నుంచి షాక్ ఇవ్వడం మొదలుపెట్టారు. వడ్డీలు చెల్లించడంలో జాప్యం చేశారు. కొందరు తమ డిపాజిట్లు తిరిగి చెల్లించాలని ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. ఏప్రిల్ నాటికి కస్టమర్లందరూ తమ డిపాజిట్ల కోసం ఎగబడ్డారు. దీంతో గత్యంతరం లేక నేతాజీ, శ్రీహర్ష, వాణీబాల అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మోసపోయామని బాధితులు గుర్తించారు. ఈ క్రమంలో వాణీబాల కుటుంబం కోర్టును ఆశ్రయించి ఐపీ పెట్టినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు జ్యోతి దిట్టకవి, నిశిత, గౌతమ్, పి.మల్లికార్జునశర్మ, వెంకటేశ్వరాచారి, రాధాకృష్ణశర్మ, ఎం.శ్రీనివాసమూర్తి మరికొంతమంది సీసీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు.
వాణీబాలపై విచారణకు టెస్కాబ్ ఆదేశం
ఈ ఘటనల నేపథ్యంలో టెస్కాబ్ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణీబాలను సస్పెండ్ చేశారు. ఆమె వ్యవహారంపై విచారణకు ఆదేశించామన్నారు టెస్కాబ్ ఎండీ మురళీధర్. ఈ నెలలో ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమెకు రావాల్సిన జీతభత్యాల చెల్లింపు నిలిపివేశారు. ఆమె అందుబాటులో లేకపోవడంతో సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆమె కూడా పరారీలో ఉన్నారు.