గెలుపు ధీమాలో సీఎం వైఎస్ జగన్
వారానికి మూడు రోజులు జనం మధ్యకు
(జిపి వెంకటేశ్వర్లు)
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పీడు పెంచారు. వారానికి మూడు రోజులు జనం మధ్యకు వెళుతున్నారు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి తాము చేసిన సంక్షేమాన్ని వారికి వివరిస్తున్నారు. నేను మీకు సాయం చేశానని నమ్మితేనే ఓట్లు వేయండని ధీమాగా అడుగుతున్నారు. సభలు పెట్టిన ప్రతి చోటా తనదైన శైలిలో మాట్లాడుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. సంక్షేమ పథకాలన్నీ డీబీటీ పద్ధతిపై అమలు చేస్తున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అనేది వైఎస్ జగన్ ప్రభుత్వంలో వచ్చిన కొత్త అంశం. ఇప్పటికే లక్షల కోట్లు ఈ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఎంతో మంది పేదలకు అందించారు. అందుకే తాను తిరిగి ఎన్నికల్లో గెలిచి తీరుతాననే ధీమాలో ఉన్నారు.
ఆయన మరో మాట కూడా సభల్లో మాట్లాడుతున్నారు. మనమంతా పేదల పక్షం, వాళ్లంతా పెద్దల పక్షం అంటూ ప్రతిపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని సంక్షేమ పథకాలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిందని చెప్పవచ్చు. నాడు, నేడు పథకం ద్వారా విద్య, వైద్య రంగాల్లో భారీ విప్లవం వచ్చింది. దీనిని ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు. అందువల్లనేనేమో సీఎం జగన్ అంత ధీమాగా ఉన్నారని పలువురు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ఈ పథకాలు గెలిపిస్తాయంటే గత ప్రభుత్వ హయాంలో పసుపు కుంకుమ పథకం కింద చంద్రబాబు నాయుడు వేల కోట్లు ఎన్నికల సమయంలో ఇచ్చారు. అయినా టీడీపీకి జనం ఓటు వేయలేదు. ఇప్పుడు వరుసగా డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఓట్లు తప్పకుండా వేస్తారనుకుంటే పొరపాటేననే భావన కూడా కొందరు వైఎస్సార్‌సీపీ నాయకుల్లో ఉంది.
రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రెవెన్యూ శాఖలో సంస్కరణలు సీఎం జగన్ తీసుకొచ్చారు. బ్రిటీష్ ప్రభుత్వం రెవెన్యూ రికార్డులు తయారు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రికార్డుల్లో మార్పులు చేర్పులు చేసిన దాఖలాలు లేవు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత భూముల రీ సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేయిస్తున్నది. ఎంతో కాలంగా పూర్తి స్థాయి హక్కులు లేని బంజరు, చుక్కలు, గ్రామకంఠం లాంటి భూములను ప్రస్తుతం ఆయా రైతులు, పేదల పేరుతో పట్టాలు ఇస్తున్నది. ఇప్పటికే లక్షల ఎకరాల భూములు అనుభవ దారుల పేరుతో పట్టాలుగా మారాయి. ఇవన్నీ మాకు కలిసొచ్చే అంశాలేనని వైఎస్సార్‌సీపీ భావిస్తున్నది.
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ సంక్షేమ రాజ్యం అంటే ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూపించారన్నారు. ప్రస్తుతం ఇంటింటికీ మ్యానిపెస్టోను పంపిస్తున్నాం. వారి గుండెలపై చేయి వేసుకుని ఎంతవరకు అమలు చేశారో లేదోననేది వారే ఆలోచిస్తారని అన్నారు. వైనీడ్ జగన్ కార్యక్రమంలో పేరేచర్లలో ఏర్పాటు చేసిన సభలో నేను మాట్లాడాను. తప్పులు ఉంటే ప్రశ్నించాలని కోరాను. ఏ ఒక్కరూ ప్రశ్నించలేదన్నారు. యూపీ, హర్యానా నుంచి కొందరు వచ్చి ఏపీలో సర్వే చేస్తున్నారు. ఈ పథకాలు చూసి వారు ఆశ్చర్యపోతున్నారన్నారు.
జగన్ గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. జనం ఏ ధీమాలో ఉన్నారనేది ఓటు వేసే వరకు ఊహించడం కూడా కష్టమేనని సీనియర్ వెటరన్ జర్నలిస్ట్ వెంకటేశ్వరావు పేర్కొన్నారు. నేను హిందూ దినపత్రికలో రిటైర్డ్ అయ్యే వరకు పనిచేశాను. ఎన్నో ఎన్నికలు చూశాను. ఈ ఎన్నికలు మాత్రం గొప్ప మార్పును తీసుకొస్తామయని చెప్పారు. ఓటరు ఇంకా డిసైడ్ కాలేదు, సీఎం జగన్‌పై ఎటువంటి వ్యతిరేకత కనిపించడం లేదు. ఎటువంటి మార్పులు ఉంటాయో ఇప్పుడే చెప్పలేమని తెలిపారు.