కేరళలో ఉప ఎన్నికల వేళ మునంబంలో రాజకీయ దుమారం

కేరళ రాష్ట్రంలో ఉప ఎన్నికల వేళ.. మునంబంలో వక్ఫ్ భూముల గొడవ రాజకీయ దుమారం రేపుతోంది.

Update: 2024-11-02 09:39 GMT

కేరళ రాష్ట్రంలో ఉప ఎన్నికల వేళ.. మునంబంలో వక్ఫ్ భూముల గొడవ రాజకీయ దుమారం రేపుతోంది. కొచ్చి శివారులోని తీరప్రాంత గ్రామం మునంబం. ఇక్కడ 600 మందికి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇందులో మత్స్యకారు కుటుంబాలే ఎక్కువ. అయితే ఈ భూమి వక్ఫ్ బోర్డుకు చెందిందని చెప్పడంతో కుటుంబాలు ఆందోళన బాట పట్టాయి. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని పాలక లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) హామీ ఇచ్చింది. మరోవైపు మునంబం ప్రజల కష్టాలకు ప్రభుత్వమే కారణమని యూడీఎఫ్ ఆరోపిస్తోంది.

అసెంబ్లీలో వక్ఫ్ బిల్లును ఆమోదించడం పట్ల ఎల్‌డీఎఫ్, యుడీఎఫ్‌లను తప్పుపట్టింది బీజేపీ. ఉప ఎన్నికలకు ముందు కాషాయ పార్టీ దీన్నే ఎన్నికల అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది. ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ మైనారిటీ మోర్చా శనివారం ప్రభుత్వ సచివాలయం ముందు ఆందోళన కూడా నిర్వహించింది. నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఆందోళనకారులను కేంద్ర మంత్రి, కేరళకు చెందిన బీజేపీ ఏకైక ఎంపీ సురేష్ గోపి పరామర్శించారు. వారికి కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వక్ఫ్ (సవరణ) బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొంది చట్టంగా రూపొందిన తర్వాత దేశవ్యాప్తంగా వక్ఫ్ భూముల ఆక్రమణలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.

ఇటు యూడీఎఫ్ ప్రతిపక్ష నాయకుడు VD సతీశన్ మునంబం నివాసితులకు మద్దతు ప్రకటించారు. నిస్సందేహంగా భూమి మీదేనంటూ భరోసా ఇస్తున్నారు. శుక్రవారం సతీశన్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం అనుకుంటే 10 నిమిషాల్లో సమస్య పరిష్కారమవుతుందన్నారు. భూమి లావాదేవీలు జరగడానికి ముందు ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని, అలాంటి భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించేందుకు వీలేదని అన్నారు.

అసలు వివాదం ఏమిటి?

2019లో వివాదాస్పద భూమి తమదని వక్ఫ్ బోర్డు చెప్పడంతో మునంబంలో ఉంటున్న కుటుంబాలు ఆందోళనకు లోనయ్యాయి. 2022లో ఇంటి పన్ను కూడా చెల్లించొద్దని వక్ఫ్ బోర్డు సభ్యులు చెప్పడంతో మరింత భయాందోళనలకు లోనయ్యారు. అప్పట్లో కేరళ ప్రభుత్వం జోక్యం చేసుకుని పన్ను చెల్లించేలా మునంబం కుటుంబాలకు వెసులుబాటు కల్పించింది. దీన్ని సవాల్ చేస్తూ వక్ఫ్ సంరక్షణ సమితి హైకోర్టులో పిటీషన్ వేసింది. కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు పాజ్ చేసింది.

బాధిత కుటుంబాలు ఏమంటున్నాయి?

1950లో సిద్దిక్ సైత్ అనే వ్యక్తి విద్యా అవసరాల కోసం ఫరూక్ కాలేజీకి భూమి ఇచ్చాడని, కాలేజీ యాజమాన్యం నుంచి తాము భూమి కొన్నామని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. అది వక్ఫ్‌ భూమి కాదని వాదిస్తున్నాయి.

Tags:    

Similar News