ఆర్జేడీ బహిష్కృత నేత తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన నిర్ణయం..
ఈ సారి ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని వెల్లడి;
బీహార్(Bihar) మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్(Tej Pratap Yadav) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనున్నారు. వైశాలి జిల్లాలోని మహువా స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతానని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన సమస్తిపూర్ జిల్లాలోని హసన్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.
పాట్నాలోని తన నివాసంలో శనివారం సాయంత్రం ఆయన విలేఖరులతో మాట్లాడారు. "నాకు అక్కడి ప్రజల మద్దతు ఉంది. అందుకే ఈసారి నేను మహువా నుంచి పోటీ చేయాలనుకున్నా’’ అని చెప్పారు. ఇదే సందర్భంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్(Nitish Kumar) ముఖ్యమంత్రి కాలేరని కూడా చెప్పారు.
పార్టీ నుంచి బహిష్కరణకు కారణమేంటి?
తేజ్ ప్రతాప్ యాదవ్‌ను తన తండ్రి, ఆర్జేడీ(RJD) చీఫ్ లాలూ ప్రసాద్(Lalu Prasad Yadav) మే 25న పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఆరేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉంచారు. ఆ మధ్య అనుష్క అనే మహిళతో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరలైంది. దాంతో తేజ్ ప్రతాప్ యాదవ్‌పై వేటు పడింది. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీపరంగా చర్య తీసుకున్నారు. అయితే తన ఫేస్‌బుక్ పేజీ "హ్యాక్" చేశారన్న తేజ్ వాదనను తండ్రి తోసిపుచ్చారు.
పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కొన్ని రోజుల తర్వాత.. తనకు, తన తమ్ముడు తేజస్వి యాదవ్‌ను విడదీసేందుకు "కుట్ర" జరుగుతోందని తేజ్ ఆరోపించారు. 2015 అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేశారు తేజ్ ప్రతాప్ యాదవ్ .. కొంతకాలం పాటు మంత్రిగా కూడా పనిచేశారు.