ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ని ఎందుకు ఎంపిక చేశారు?

ఎంఐఎం ఎపుడూ అధికార పార్టీతోనే ఉంటుంది. కాంగ్రెస్ కు తొలినుంచి మిత్రపక్షమే. ప్రొటెం స్పీకర్ ఎంపిక ఎంఐఎం కు పంపిన స్నేహ సందేశమా!

Update: 2023-12-09 13:14 GMT
ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ను అభినందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్

 తెలంగాణ నూతన శాసనసభ  ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయడం పెద్ద చర్చనీయాంశమయింది.

ప్రోటెం స్పీకర్ అనేది ఏక్ దిన్ కా లేక పోతే దో దినోంకా సుల్తాన్ మాత్రమే. ఆ పూటకు మాత్రమే దక్కే తాత్కాలిక స్పీకర్ హోదా. స్పీకర్ స్థానంలో కూర్చొన్నందున ప్రొటెం స్పీకర్ గా ఎంపికయిన వ్యక్తికి వచ్చే అదనపు ప్రయోజనం ఏమీలేదు. కాకపోతే, ఆ వ్యక్తి రాజకీయ జీవితంలో ఒక మధుర జ్ఞాపకం కావచ్చు.ఎందుకంటే, తనెందరో ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించాడని చెప్పుకోవచ్చు. ఇంత చిన్నవిషయానికి అక్బరుద్దీన్ ఒవైసీ జాతీయ ట్రెండింగ్ లో ఉన్నాడు. ఆయన గురించి రకరకాల చర్చలు , విశ్లేషణలు సాగుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం ప్రకారం ప్రొటెం స్పీకర్ గా సభలో సీనియర్ మోస్ట్ అయిన వ్యక్తిని కాదని అక్బరుద్దీన్ ప్రోటెం స్పీకర్ గా ఎందుకు ఎంపిక చేశారు? దీని వెనక ఉన్న రాజకీయం ఏమిటి? అనే విషయాలు బాగా చర్చకు వస్తున్నాయి.

ఈ రోజు ఉదయం గవర్నర్ తమిళిసై అక్బరుద్దీన్‌తో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. చాంద్రాయణ గుట్ట నుంచి అక్బరుద్దీన్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇవాళ్టీ నుంచి 4 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. స్పీకర్ ఎన్నియ్యే దాకా ఆయన కొనసాగుతారు. అంతే.

లెక్క ప్రకారం సభలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎంపికయిన నేత. శస్త్ర చికిత్స వల్ల ఆయన సభకు రాలేని పరిస్థితి ఉంది. మరొకరికి ఎంపిక చేయాల్సి వచ్చింది. నిజానికి ఈ గౌరవం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కి దక్కాలి.. అయితే, టెక్నికల్ గా  ఆయన ఇంకా స్పీకరే.  మొదట ఆయన  1994 లో తర్వా,1999 బాన్స్ వాడ  నుంచి గెల్చారు. తర్వాత వరుసగా 2011, 2014, 2018,2023 అదే నియోజకవర్గం నుంచి గెల్చారు. తర్వాత ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీనియర్ సభ్యుడే. ఆయన ఆరు సార్లు ఎంపికయ్యారు. ఉత్తమ్ 1999 లో మొదటి సారి కోదాడ నుంచి ఎంపికయ్యారు. అప్పటి నుంచి ఆరు సార్లు వరుసగా ఎన్నికయ్యారు. అయితే, ఆయన రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రి అయారు. కెసిఆర్ సభకు వచ్చే అవకాశం లేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి టెక్కికల్ స్పీకర్ గానే కొనసాగుతున్నారు. ఎందుకంటే కొత్త సభ ఎర్పడే వరకు ఆయన ఆడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను చూస్తునే ఉంటారు. ఇది రాజ్యాంగ నియమం కూడా.  అందువల్ల ఆయన ని ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయలేరు. ఇక మిగిలింది తర్వాతి సీనియర్ సభ్యుడయిన అక్బరుద్దీనే. అందుకే ఎఐఎంఐఎం ఎమ్మెల్యే అయిన అక్బరుద్దీన్ వొవైసీని ప్రొటెం స్పీకర్ ఎంపిక చేసింది. ఇది సంప్రదాయనుంచి వైదొలగడంగా కనిపిస్తుంది.  కాని కాదు. అయితే, ఇది పైకి కనిపించేంత సింపుల్ నిర్ణయం కాదన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ వ్యవహారం గురించి చెబుతూ ఇందులో రాజకీయమేమీ లేదని అన్నారు “ సభలో అందుబాటులో ఉన్నది కేవలం ఇద్దరు సీనియర్లే. నేను, అక్బరుద్దీన్. నేనేమో మంత్రిని. ఇక మిగిలింది అక్బరుద్డీన్ మాత్రమే అందుకే అయనను ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేశారు,” అని ఆయన అన్నారు

అయితే, ప్రముఖ రాజకీయ పరిశీలకుడు నందిరాజు రాధాకృష్ణ మాత్రం ఇదొక రాజకీయ సంకేతమేనని అన్నారు. పైకి సింపుల్ గా కనిపిస్తున్నా ఇదొక మార్పుకు సంకేతమని చెబుతూ ఎంఐఎంకు కాంగ్రెస్ పార్టీ పంపిన స్నేహ హస్తమని ఆయన అన్నారు.

“ ఎంఐఎం పార్టీ ఎపుడు రాష్ట్రంలో అధికార పార్టీ వైపు ఉంటున్నది. పూర్వం కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం సఖ్యంగా ఉండింది. తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి దగ్గిరయింది. 2004 కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక, మళ్లీ కాంగ్రెస్ కుదగ్గరయింది. అయితే, కాంగ్రెస్ నేత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మాత్రమే ఎంఐఎం ఆ పార్టీకి దూరం జరిగింది.దీనికి కారణం అక్బరుదీన్ ను ఒక కేసులో పోలీసులు అరెస్టు చేయడమే. ఇది ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది.  కిరణ్ ని హీరోని చేసింది. ఈ అవమానంతో  కాంగ్రెస్ తో ఆ పార్టీ తెగతెంపులుచేసుకుని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు మద్దతు ప్రకటించిందింది. కాబట్టి ఎంఐఎం మళ్లీ కాంగ్రెస్ కు దగ్గరవడంలో ఆశ్చర్యమేమీ లేదు,” అని నందిరాజు అన్నారు.

ఎంఐఎం ను ఆకట్టుకుంటే వచ్చేలోకసభ ఎన్నికల నాటికి మరింత బలహీనపడుతుంది, అది కాంగ్రెస్ కు కొంత అనుకూలిస్తుందని పార్టీ భావిస్తూ ఉండవచ్చు. బిఆర్ ఎస్ ను బలహీన పర్చడంలో భాగాంగానే అక్బర్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేశారనేది సర్వత్రా వినిపిస్తున్నవాదన.

.

Tags:    

Similar News